ఏక్ రోటీ భాయీ సాబ్!....           (28-Aug-2020)


 గుర్తుకొస్తున్నాయి... 34

 

ఏక్ రోటీ భాయీ సాబ్!

 

గుంటూరులో MBBS చదువుతున్నప్పుడు ఉదయం టిఫిన్ గీతా కేఫ్ లో గానీ, శంకర్ విలాస్ లోగానీ తినేవాళ్లం. ప్లేట్ పూరీ ఆర్డర్ చేస్తే రెండు పూరీలు, ప్లేటు చపాతీ అయితే ఒకటి ఇచ్చేవారు. కూరకు ప్రత్యేకమైన ధర ఏమీ ఉండదు కదా. కూర చాలకపోతే మరింత వడ్డించేవారు. ఇప్పటికీ మన ప్రాంతంలో దాదాపుగా ఇంతే!

 

ఢిల్లీకి వెళ్లినప్పుడు ఒకసారి AIIMS కు దగ్గర్లో ఒక లాడ్జిలో ఉన్నాను. AIIMS కు ఎదురుగా ఒక రోడ్డు ప్రక్కన ఉన్న పాకలో చిన్న హోటల్ ఉండేది (కాకా హోటల్ వంటిది). ఒకరోజు నేను టిఫిన్ చేయడానికి వెళ్లి ఆ పాకలో కూర్చున్నాను. తండూర్ పొయ్యిలో రోటీలు కాలుస్తున్నాడు ఒకతను . చిన్న బల్లలపై కూర్చొని కొంతమంది రోటీలు తింటున్నారు. మళ్ళీ మళ్ళీ ఆర్డర్ చేస్తున్నారు.


నా వంక చూశాడు రోటీలు కాల్చే అతను.

 

‘ఏక్ రోటీ ’అన్నాను.

 

అందరూ ఉలిక్కిపడినట్లు చూశారు నా వంక.

 

రోటీలు వేసే అతను చేసే పని ఆపి నా దగ్గరకు వచ్చి గొంతుకు కూర్చొని కళ్లల్లో కళ్లు పెట్టి ‘ఏక్ రోటీ భాయీ సాబ్’ ? అన్నాడు.

 

‘హాః జీ ఏక్’ అన్నాను.

 

అందరూ తినడం ఆపి నా వంకే చూస్తున్నారు.

 

అతను మరికొన్ని క్షణాలు నా కళ్ల వంక అలాగే చూసి ఒక రకంగా నవ్వుకుంటూ పొయ్యి దగ్గరకు వెళ్లి ‘రెండు రోటీలు’ తెచ్చి ఇచ్చాడు.

 

మనం మామూలుగా ఒక చపాతీనే గా ఆర్డర్ ఇచ్చేది. అందుకే నేను ఒక రోటీ అని అడిగాను. కానీ అక్కడ నా సమాధానం వారందరికీ వింతగా ఉంది. ఇక్కడ రెండు తక్కువ తినరు కాబోలు అని సర్దుకున్నాను.

 

ఆ తరువాత రెండు సంవత్సరాలకు కన్యాకుమారి చూడటానికి వెళ్లాను. రామకృష్ణ మఠం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కాటేజీలో ఒక రోజు రాత్రి ఉన్నాను. అదేరోజు ఉత్తర భారతదేశం నుండే ఒక బస్సులో టూరిస్టులు వచ్చారు. మధ్యలో పొయ్యి పెట్టుకుని చుట్టూ అంతా కూర్చున్నారు. రోటీలు వేస్తున్నారు, తింటున్నారు, వేస్తున్నారు, తింటున్నారు. ఒక్కొక్కరూ 10 వరకూ తినడం చూశాను.

 

‘ఏక్ రోటీ భాయీ సాబ్’? అని ఆ ఢిల్లీవాలా ఎందుకంత ఆశ్చర్యపడ్డాడో అప్పటికి అర్థమయింది నాకు.

 

డి.ఆర్.కె

28.08.2020