నా ఇంటర్ మీడియట్ సీటు....           (27-Aug-2020)


 “ఎందుకోయ్ నీకు Bi.p.c గ్రూపు” అన్నారు.

 

“డాక్టర్నవ్వాలనుకుంటున్నాను సర్ “ అన్నాను.

 

‘ఇలా చదివితే డాక్టరవ్వరు’ అని గట్టిగా అన్నారు.

 

‘ బాగా చదువుతానండీ’ అన్నాను.

ఇంతకీ సీటు ఇచ్చారా లేదా ?


గుర్తుకొస్తున్నాయి... 33

కాలేజీ కబుర్లు

 

*నా ఇంటర్ మీడియట్ సీటు*

 

అవును మీరు సరిగ్గానే చదివారు. నా మెడికల్ కాలేజ్ సీటు గురించి కాదు నేను రాస్తున్నది. నా ఇంటర్ మీడియట్ సీటు గురించే!

 

పదవ తరగతి నేను మూలపాడు జిల్లా పరిషత్ స్కూల్లో చదివాను. విజయవాడ - హైదరాబాదు రూటులో 25 వ కి.మీ. వద్ద మూలపాడు ఉంటుంది.

 

అప్పట్లో మాకొక గేదె ఉండేది. దానికి గడ్డి కోసుకురావడానికి ఊరి చివర్లో ఉన్న కొండ దగ్గరకు వెళ్లి కోసుకుని మోపు నెత్తి మీద పెట్టుకుని వస్తున్నాను.

 

ఇంటికి వచ్చే దారిలో ‘ ప్రసాదూ! నీకు ఫస్ట్ క్లాస్ వచ్చింది’ అని ఎవరో చెప్పారు. పదవ తరగతి పరీక్షలు రాసి ఫలితాల కోసం ఎదురుచూస్తున్న రోజులవి. ఈ ఫస్ట్ క్లాస్ గోడవేంటో తెలీదు. అప్పటి వరకూ పాస్ , ఫెయిల్ అనేవి రెండే ఉండేవి. అందుకే నాకు అర్థంకాక వారు చూపించిన పేపరు చూశాను. ఆ ఏడే(1971) మొదటి సారి First, 2nd , 3rd క్లాస్ లుగా ఫలితాలు ప్రకటించారు.

 

పరీక్షా ఫలితాలంటే అప్పట్లో అందరూ విశాలాంధ్ర పేపరు కోసం ఎదురు చూసేవారు. మర్నాడు రాబోయే ఫలితాలను విశాలాంధ్ర ఈ రోజు మధ్యాహ్నమే ప్రత్యేక ఎడిషన్ గా వేసేది. అలా విశాలాంధ్ర లో మొదటిసారి నా నెంబరు ఫస్ట్ క్లాసు లిస్టులో చూసుకున్నాను.

 

ఇప్పటిలాగా ‘ఇంటర్ నెట్’ లో ఫలితాలు, మార్కులు చూసుకోవడం లేవప్పుడు. దినపత్రికలలో ఫలితాలు, మరికొన్ని రోజుల తర్వాత స్కూలుకు మార్కులు వచ్చేవి.

 

అలానే కొద్ది రోజుల తర్వాత స్కూలు కు మా మార్కులు వచ్చాయి. నాకు 384 (600 కు ) వచ్చాయి. 60% కంటే ఎక్కువ కాబట్టి ఫస్ట్ క్లాసే!

 

కానీ ఆ సంవత్సరం అవి చాలా తక్కువ మార్కులు. 420 వస్తే మంచి మార్కులు కింద లెక్క. 450 వస్తే స్టేట్ ర్యాంక్ వచ్చేది. ఇప్పట్లా 560 , 590 అనే మార్కులు అప్పట్లో లేనే లేవు. నేను మా స్కూలు ఫస్టే. కానీ నా మార్కులు చూసి దిగులు పడ్డాను. అన్ని సబ్జక్ట్స్ లోనూ మార్కులు బాగానే వచ్చినా హిందీలో 35 మాత్రమే వచ్చి టోటల్ బాగా తగ్గింది.

 

ఇంటర్ మీడియట్ విజయవాడ లయోలా కాలేజీలో చదవాలని, గుంటూరు మెడికల్ కాలేజీలో MBBS చదివి డాక్టరవ్వాలని నా లక్ష్యం. లయోలా కాలేజీలో మా అన్నయ్య (కజిన్) లక్ష్మణరావు గారు బోటనీ లెక్చరర్. ఆ కాలేజి కి తప్పితే వేరే కాలేజి కీ అప్లికేషన్ పెట్టలేదు.

 

లయోలా కాలేజ్ లిస్టులో నా పేరు లేదు. కంగారు మొదలయ్యింది. SRR కాలేజ్ లో ప్రయత్నించారు నాన్నగారు. అక్కడ అప్పటికే అడ్మిషన్ లు ముగిశాయి. లయోలా కాలేజ్ డోనర్ని ఒకాయన్ని తీసుకువెళ్లి ప్రిన్సిపల్ ‘ఫ్రాన్సిస్’ గారిని కలిశాం. ఉపయోగం లేదు.

 

ఇప్పటిలాగా పదవ తరగతిలోనే ‘మా కాలేజి కి రండి అంటే మా కాలేజ్ కి రండి అని’ ఇంటర్ మీడియట్ లో చేర్చుకునే రోజులు కావవి. అప్పట్లో ఇంటర్ సీటు దొరకడం మాటలేం కాదు. గుంటూరు, నిడుబ్రోలు, నర్సరావుపేట అన్ని చోట్లా అడ్మిషన్లు అయిపోయాయి . నాన్నగారు నా సీటు కోసం ఎంత తిరిగారో! నర్సరావుపేట నుండి తిరిగివస్తుండగా బస్సులో ప్రక్కనున్నాయనతో మాటలు కలిశాయట.

 

‘గుంటూరు లో JK C కాలేజ్ అని ఒక కొత్త కాలేజ్ ఉందండీ. Bipc గ్రూపు లో మరో సెక్షన్ శాంక్షన్ అయిందని తెలిసింది ప్రయత్నించండి’ అన్నారట. నాన్నగారు రాత్రి 8 గంటలకు JKC కాలేజ్ కి చేరుకున్నారు. ఊరి బయట ఎక్కడో ఉండేది ఆ కాలేజ్. సరైన ప్రయాణ సౌకర్యం కూడా ఉండేది కాదు. కరస్పాండెంట్ గారిని కలిస్తే ‘గట్టిగా చేరతానంటే సీటు అట్టిపెడతాం’ అన్నారట. అది శనివారం రాత్రి. సోమవారం ప్రొద్దున్నే JKC కాలేజ్ కి నాన్నగారు నన్ను తీసుకు వచ్చారు.

 

రోశయ్య గారు ప్రిన్సిపల్. అప్లికేషన్ నింపి వారి ఇంటర్వూ కోసం ఎదురు చూస్తున్నాం. పిలుపు వచ్చింది.

 

“ ఎందుకోయ్ నీకు Bi.p.c గ్రూపు” అన్నారు.

 

“ డాక్టర్నవ్వాలనుకుంటున్నాను సర్ “ అన్నాను.

 

‘ఇలా చదివితే డాక్టరవ్వరు’ అని గట్టిగా అన్నారు.

 

‘ బాగా చదువుతానండీ’ అన్నాను.

 

‘సరే అయితే చేరు’ అని సీటు ఇచ్చారు.

 

ఇలా నాకోసం ఎంతో కష్టపడి ఇంటర్ మీడియట్ లో సీటును సంపాదించారు మా నాన్నగారు.

 

అదే నా జీవితంలో కీలకమైన మలుపు.

 

లయోలా లో సీటు రాకపోవడం, JKC లో సీటు రావడం –

 

‘బ్లెస్సింగ్ ఇన్ డిస్ గైస్' అంటారే అదన్నమాట.

 

ఆ కాలేజి క్రమశిక్షణ, లెక్చరర్ల అద్భుతమైన బోధనతో మాలో 18 మందికి మొదటిసారే MBBS సీట్లు వచ్చాయి. గుంటూరు మెడికల్ కాలేజీ లోనే 14 మంది చేరాం. ఆ సంవత్సరం మెడికల్ ఎంట్రన్స్ స్టేట్ ఫస్ట్ కూడా JKC నుండే! లయోలా కాలేజీకి MBBS లో నాలుగు సీట్లు వచ్చాయి.

 

MBBS సీటు కంటే ఇంటర్ మీడియట్ లో సీటు తెచ్చుకోవడం ఎంతో కష్టమైంది నాకు. నా ఇంటర్ మీడియట్ సీటు కోసం మా నాన్నగారు పడిన ఇబ్బంది గుర్తుకొచ్చినప్పుడల్లా నాకు బాధగానే ఉంటుంది.

 

పదవ తరగతిలో హిందీ మరింత బాగా చదివి మార్కులు తెచ్చుకుంటే నాన్నగారిని ఇంత బాధపెట్టేవాడిని కాదుకదా అనిపిస్తుంది.

 

డి. ఆర్. కె.
27.08.2020