నేను రన్నింగ్ లో ఫస్ట్....           (26-Aug-2020)


 అతను మా కాలేజీ ఛాంపియన్

 

100 మీటర్ల పరుగులో కాలేజీ ఫస్ట్, నేను సెకండ్

 

ఇంటర్ కాలేజి యేట్ లో ఇద్దరం మా కాలేజీ తరపున రిప్రజెంట్ చేశాం

 

మరుపురాని ఆ అనుభవం గురించి –

 

గుర్తుకొస్తున్నాయి... 32

 

కాలేజీ రోజులు

 

“నేను రన్నింగ్ లో ఫస్ట్”

 

నాకు చిన్నప్పటి నుండీ ఆటలంటే ఇష్టం. నేను చదువుకున్న కైకలూరు జిల్లా పరిషత్ స్కూల్లో ప్రతి సాయంత్రం ఆడుకునేవాళ్లం.

 

మా నాన్నగారు డ్రిల్లు మాష్టారు. సీతారామయ్య గారు, చలపతి రావు గారు అనే మరో ఇద్దరు డ్రిల్లు మాష్టార్లు కూడా ఆ స్కూల్లో పనిచేసేవారు. వీరు ముగ్గురూ వాలీబాల్ బాగా ఆడేవారు. టీచర్ల టోర్నమెంట్ లో వీరి ఆట చూడటానికి పిల్లలమంతా చేరేవాళ్లం. చూడముచ్చటగా ఉండేది వారి ఆట. ముగ్గురూ స్కూల్ పిల్లల్ని ఆడించడంలో ఎంతో శ్రద్ధ చూపేవారు. ఆ తర్వాత వచ్చిన వేంకటేశ్వరరావు డ్రిల్లు మాష్టారు కూడా ఇంతే శ్రద్ధగా ఆడించేవారు.

 

మెడికల్ కాలేజీ లో ఆటలకు ప్రోత్సాహం తక్కువ. స్పొర్ట్స్ డే కోసమో, కాలేజ్ డే కోసమో సంవత్సరానికి ఒక్కసారి ‘ఇంట్రా మ్యూరల్’ పోటీలు జరిగేవి. మహా అయితే నెల రోజులు ఆటలు ఆడేవాళ్లం. అతి కొద్ది మంది మాత్రమే క్రమం తప్పకుండా వాలీబాల్, టేబుల్ టెన్నిస్ ఆడుకునేవారు.

నాకు కబడ్డీ, వాలీబాల్, బాస్కెట్ బాల్ ఆటలంటే ఇష్టం. కబడ్డీ మా కాలేజీలో ఆడేవారు కాదు. ఒక సంవత్సరం మా క్లాసుకు వాలీబాల్ కు, బాస్కెట్ బాల్ కు కెప్టెన్ గా పనిచేశాను. క్రీడల్లో ప్రతి ఈవెంట్ లోనూ పాల్గొనేవాణ్ణి.

 

‘గెలవనని తెలిసినా ఆడతావు ఎందుకయ్యా’ అని ఒక మిత్రుడు అనేవాడు. నాకు అదో సరదా! కానీ అప్పుడప్పుడు గెలిచేవాణ్ణి కూడా. 400 మీటర్ల పరుగు పందెం లో ఒక సంవత్సరం నేను మా కాలేజ్ ఫస్ట్. మరోసారి బాస్కెట్ బాల్ లో మా టీం విన్నర్స్.

 

ఒక సంవత్సరం నాగార్జునా యూనివర్సిటీ పరిధిలో గుంటూరు గుంటగ్రౌండ్స్ లో ఇంటర్ కాలేజి యేట్ పోటీలు జరిగాయి. మా కాలేజీ నుండి వెళ్లిన వాలీబాల్ టీం లో నేనూ ఉన్నాను. మా టీం లో ఒక spiker ఉండేవాడు. మిగతా వాళ్లమంతా ఆయన్ని గొప్పగా చూసేవాళ్లం.

 

ఆర్ట్స్ కాలేజ్ టీం తో మాకు పోటీ మొదలయింది. తుక్కు తుక్కుగా షాట్స్ కొట్టేస్తున్నారు వాళ్లు. వాళ్లు కొట్టిన బంతిని లేపడం కూడా మాకు సాధ్యం కావడం లేదు. మా spiker షాట్ కొట్టడానికి ఛాన్స్ రావడం లేదు. వాళ్లు షాట్ కొట్టే తీరుకు మా వాడు కొట్టే తీరుకు సంబంధం లేదు. ఏక పక్షంగా ఆ మ్యాచ్ జరిగింది. దిగులు ముఖాలతో తిరిగి వచ్చాం. మేము ఏ స్థాయిలో ఉన్నామో మాకు బాగా అర్థంఅయింది.

 

నేనూ, మా కాలేజ్ ఛాంపియన్ అయిన మిత్రుడు గుంటూరు మెడికల్ కాలేజ్ తరపున 100 మీటర్ల పరుగు పందెం లో పాల్గొన్నాం. మా కాలేజీ లో 100 మీటర్ల రేసులో అతను ఫస్టు, నేను సెకండ్ వచ్చాం.

 

చాలా మంది పోటీ దారులున్నప్పుడు ముందుగా ‘హీట్స్’ అనే పోటీలు ఉంటాయి. 6 గురికి చొప్పున పోటీని నిర్వహించి అందులో మొదట వచ్చిన ఇద్దర్ని తరువాత రౌండ్ కు సెలెక్ట్ చేస్తారు. ఇలా హీట్స్ లో గెలిచిన వాళ్ళందరికీ మళ్లీ పోటీ పెట్టి ఫైనల్ కు ఆరుగురిని సెలెక్ట్ చేస్తారు.

 

ఫైనల్స్ లో మొదట వచ్చిన వాడు విన్నర్ రెండవ వాడు రన్నర్ గదా!

 

మేం హీట్స్ మొదటి రౌండ్ లో పోటీకి సిద్ధం అయ్యాము.

 

మా మిత్రుడు spikes shoes వేసుకువచ్చాడు. Warmup చక్కగా చేస్తున్నాడు. కాలేజ్ ఛాంపియన్ కదా! మంచి ఫాం లో ఉన్నాడు. మా కాలేజీ లో అందరి కంటే ఫాస్ట్ రన్నర్.

 

అందరం ట్రాక్ లో నిలబడ్డాం. రెడీ చెప్పగానే పరిగెట్టడంమొదలు పెట్టాం. శక్తి కొలదీ పరుగెత్తాం.

నేను ఫస్ట్, మా ఛాంపియన్ సెకెండ్ వచ్చాం. కాకపోతే చివర్నుండీ.... అదేనండీ హీట్స్ లో5 వ వాడిగా అతను, 6వ వాడిగా నేను అన్నమాట!

 

మన స్టామినా ఏమిటో మాకు బాగా అర్థం అయింది.

 

మళ్లీ ఇంటర్ కాలేజీ యేట్ లో పాల్గొంటే ఒట్టు.

 

డి. ఆర్. కె.
26.08.2020.