ఒక హంబర్ సైకిల్ ముచ్చట....           (25-Aug-2020)


 గుర్తుకొస్తున్నాయి...31

 

ఒక హంబర్ సైకిల్ ముచ్చట

 

(ఎనిమిది సంవత్సరాల క్రితం ప్రజాశక్తి దినపత్రిక ఆదివారం పుస్తకం ‘స్నేహ’లో ‘సైకిళ్ళ పుట్టుపూర్వోత్తరాల గురించి’ వివరమైన వ్యాసం ప్రచురింపబడింది.

 

అది చదివిన తరువాత మా ‘హంబర్’ సైకిల్ రాసుకున్న స్వగతం-

 

ఇది కూడా ‘స్నేహ పుస్తకంలో ప్రచురించబడింది.)

 

అయ్యా, అమ్మా!

 

‘స్నేహ’ పుస్తకంలో నా పూర్వీకుల సమాచారం చదివిన తరువాత నా ముచ్చట్లు కూడా మీతో పంచుకోవాలను కుంటున్నాను.

 

నేను 40 ఏళ్ల క్రితం హంబర్ ఫ్యాక్టరీలో తయారయ్యాను. కార్లలో బెంజి కార్లకు ఎంత గౌరవం ఉండేదో, అప్పట్లో నాకు సైకిళ్ళలో అంత గౌరవం ఉండేది.

 

నన్ను కొన్న టీచర్ 3 సంవత్సరాల తరువాత ఇప్పటి ఓనర్ రామమోహనరావు గారికి అమ్మేశారు. ఈయన డ్రిల్ మాష్టారు. రోజూ ఆయన్ని స్కూల్ కు తీసుకెళ్ళడం, తీసుకురావడం నా పని.

 

నాకప్పుడు స్కూలులో చాలామంది స్నేహితులు వుండేవారు (తోటి సైకిళ్ళు). తరువాత వారి పెద్దబ్బాయి మెడికల్ కాలేజీలో చేరిన తరువాత నన్ను తీసుకువెళ్ళి మెడికల్ కాలేజీకి, హాస్టల్ కి తిప్పేవాడు. ఆ తరువాత వారి చిన్నబ్బాయి దావణగెరెలో ఇంజనీరింగ్ లో చేరినప్పుడు మళ్ళీ అక్కడకు వెళ్లాను. 4 సంవత్సరాలు ఆయనకు సేవ చేశాను. మళ్ళీ తిరిగి డ్రిల్లు మాష్టారు గారి వద్దకు చేరి, ఆయనకు సేవ చేస్తున్నాను. ఆ తరువాత వారి మనుమడు (ఈయనా డాక్టరే) ఈ వూరు వచ్చినప్పుడల్లా నన్ను వాడుతూ వున్నాడు.

ఇలా మూడు తరాలకు సేవ చేసిన నేను ప్రస్తుతం ఖాళీగా ఉంటున్నాను. ఈ నలుబది ఏళ్లలో నా మిత్రులంతా కనుమరుగైపోయారు.

 

మా మాష్టారికి 80 సంవత్సరాలు రావడంతో నన్ను పక్కన పెట్టి, కార్లో ప్రయాణిస్తున్నారు. అయితే, ఈమధ్యన ఆయనకు యిద్దరు కవల మునిమనవళ్ళు పుట్టారు. ఇక వారిద్దరూ ఎప్పుడు పెద్ద అయి నన్ను ఉపయోగిస్తారా అని ఎదురు చూస్తున్నాను.

 

ఎందుకంటే నేనింకా ఫిట్ గానే వున్నాను కదా!

 

ఇట్లు
40 ఏళ్ల వయస్సున్న హంబర్ సైకిల్
చల్లపల్లి.
2012

 

*. *. *

 

1971 లో మరో మాష్టారు ఈ సైకిల్ను కొని 1974 లో మా నాన్నగారికి అమ్మేశారు.

 

49 సంవత్సరాల వయసున్న ఈ సైకిల్ ఇప్పటికీ నా దగ్గరే ఉంది.

 

డి. ఆర్.కె
25.08.2020