కామ్రేడ్ జ్ఞానానందంతో పాతిక సంవత్సరాలు…....           (24-Aug-2020)


గుర్తుకొస్తున్నాయి.... 30

 

కామ్రేడ్ జ్ఞానానందంతో పాతిక సంవత్సరాలు…

 

నెల రోజుల క్రితం మాట! మామూలుగా ఓ.పి.లో కూర్చొని రోగులను చూస్తున్నాను. మధ్యాహ్నం 2 గంటలకు 42వ నెంబర్ పిలవగానే కొల్లూరి జ్ఞానానందం నా గదిలోకి వచ్చాడు. రాగానే తనదైన ప్రత్యేకమైన శైలిలో నమస్కరించాడు. ఉదయం ఎప్పుడొచ్చాడో? ఏం తిన్నాడో? వరుసలో చూపించుకోవడం తప్పితే ముందు చూడమని ఈ పాతికేళ్ళ పరిచయంలో ఎప్పుడూ నన్నడగలేదు. “జ్ఞానాన్ని” (జ్ఞానానందాన్ని అలాగే పిలుస్తారు) చూడగానే నా అలసట పోతుంది. ఆరోగ్య విషయాలు పూర్తయ్యాక, సమకాలీన సమాజంపై అభిప్రాయాలు, బాధలు పంచుకోవడం మాకు అలవాటు. అందుకని జ్ఞానం నా గదిలోకి వచ్చిన తర్వాత బయటకు వెళ్ళడానికి కాస్త సమయం పట్టేది. మా కాంపౌండర్లు కూడా ఆ కాస్సేపు బయటకు వెళ్ళిపోయేవారు.

 

“నన్ను పంచాయతీ ఎన్నికలలో వార్డు మెంబరుగా పార్టీ నిలబెట్టింది” అని చెప్పాడు. ఏమయింది ఫలితం అని అడిగాను. ‘ఏమవుతుంది మామూలే! ఓడిపోతాం గదా! అదే జరిగింది. పాతిక ఓట్లు వచ్చాయి’ అని తన సహజసిద్ధమైన నవ్వుతో చెప్పాడు. (“పాత సినిమాల్లో చదలవాడ గుర్తొస్తాడు ‘జ్ఞానాన్ని’ చూస్తే” అని కొంతమంది మిత్రులు అనేవారు) గత పంచాయతీ ఎన్నికలలో పోటీ చేసిన వాళ్ళలో చాలామంది లక్షలు ఖర్చు పెట్టారు. నీ ఆరోగ్యం సహకరించదు గదా ఎందుకు నుంచున్నావు అని అడిగితే “పార్టీ నుంచోమంది” అని సమాధానం.

 

గెలవనని తెలిసినా అత్యంత క్రమశిక్షణ గల కార్యకర్తగా తన ధర్మాన్ని తాను నెరవేర్చాడు. “ఎవ్వరికీ రూపాయి ఇవ్వలేదు, సారా పోయించలేదు, అందర్నీ వ్యక్తిగతంగా కలిసి ఓట్లు అడిగాను, వేస్తానన్న వాళ్ళంతా ఓట్లు వేస్తే ఎంతో మెజారిటీతో గెలిచేవాడ్ని. చివరి రెండు రోజులు డబ్బు, సారా ప్రభావం ముందు మనం ఓడిపోయాం” అన్నాడు.

 

ఓడిపోయానన్న దిగులు ఏమాత్రం తన మొహంలో కనిపించలేదు. నాలుగు దశాబ్దాలుగా సి.పి.యం. కార్యకర్తగా పని చేస్తున్న “జ్ఞానం” 2-3 సార్లు ఎలక్షన్లలో గెలవడం జరిగింది. అందుకే ఆ వార్డులో ఆయన పేరు “నంబరు గారు”. “ఎలక్షన్లలో నిలబడడం మన రాజకీయాలు ప్రచారం చేసుకోవడం కోసమే తప్ప గెలుపోటములు ప్రధానం కాదు” అని త్రికరణశుద్ధిగా నమ్మిన కార్యకర్త కొల్లూరి జ్ఞానానందం.

 

కేవలం ఒక పూరిల్లు తప్పితే స్వంత ఆస్థి ఏమీ లేనివాడు. భార్య కష్టంతో కుటుంబ పోషణ, తన కష్టంతో ప్రజలకు సహాయపడటం జరుగుతూ ఉండేది. ఎప్పుడూ సైకిల్ త్రొక్కుతూనో, సైకిల్ పట్టుకుని నడుస్తూనో కనపడేవాడు. ఘంటసాలలో పెద్ద రైతులు, అన్ని పార్టీల పెద్దలు కూడా జ్ఞానానందానికి ప్రత్యేకమైన గౌరవాన్నిచ్చేవారు. ఎవరన్నా డబ్బివ్వబోయినా ఎందుకండీ నా దగ్గరున్నాయిగా అని సమాధానమిచ్చేవాడు జేబులో చిల్లి గవ్వ లేకపోయినా.

 

క్షేత్రస్థాయిలో పని చేస్తూ వ్యవసాయ కార్మికులకు, శ్రామిక వర్గానికి అందుబాటులో ఉండేవాడు. నిస్వార్ధంగా పనిచేసేవాడు కాబట్టే పెద్దలకు కూడా గౌరవం ఇచ్చేవాడు.

 

కొన్ని సంవత్సరాల క్రితం గుండెపోటుతో అనారోగ్యం పాలయ్యాడు. ఆ తరువాత “నేను ఇక ఏ డాక్టరు దగ్గరకు వెళ్ళను, మీరు చేయగలిగిన వైద్యం మీరు చేయండి” అని తేల్చి చెప్పేశాడు. ఆర్ధిక ఇబ్బంది వలనే ఈ నిర్ణయం తీసుకున్నా, ఎప్పుడూ ఆర్ధిక పరిస్థితి గురించి చర్చించేవాడు కాదు. మందులకు డబ్బు లేకపోతే తీసుకో అని చెప్పినా ఎప్పుడూ వద్దనే అనేవాడు. “ఆంజియోగ్రామ్” చేయించుకుంటే మంచిది అని ఒప్పించి దానికి డబ్బిచ్చి పంపితే చేయించుకున్న తర్వాత మిగిలిన డబ్బును తిరిగి నాకు ఇచ్చేశాడు”.

 

తన ఆరోగ్యం బాగోలేదనీ, ఎప్పుడో ప్రమాదం ముంచుకొస్తుందనీ తెలుసు. అయినా ఏనాడు దిగులు పడటం చూడలేదు. ఇంత అనారోగ్యంలోనూ ఖమ్మంలో జరిగిన సిపియం రాష్ట్ర మహాసభ సందర్భంగా జరిగిన ర్యాలీలో పాల్గొన్నాడు. అదృష్టవశాత్తు ప్రమాదం నుండి తప్పించుకున్నాడు. అది తెలిసి దూర ప్రయాణాలు చేయవద్దని వారించాను.

 

నిజాయితీగా పోటీ చేసి పాతిక ఓట్లు మాత్రమే తెచ్చుకుని గెలిచినవాడి కంటే ధీమాగా తిరుగుతున్న కార్యకర్త గురించి లోకానికి తెలియకపోతే ఎలా? అందుకే “సైకిలు, చేతి సంచి పట్టుకున్న జ్ఞానానందం” ఫోటో తీసి తనపై వ్యాసం వ్రాసి ప్రజాశక్తికి పంపుదామనుకున్నాను. దేశం వదిలి వెళ్ళవలసి కాస్త వాయిదా వేశాను. సరిగ్గా నేను తిరిగి వచ్చిన రోజే జీవం లేని దేహాన్ని చూడవలసి వచ్చింది.

 

అతను రాష్ట్రస్థాయి నాయకుడు కాదు, కనీసం జిల్లా స్థాయి నాయకుడూ కాదు, నిరుపేద కుటుంబంలో పుట్టి జీవిత తత్వాన్ని అర్థం చేసుకుని, పార్టీ క్రమశిక్షణను జీవితాంతం పాటించాడు కాబట్టే ఈ నాలుగు మాటలూ వ్రాయాలనిపించింది. కాకపోతే సైకిలుతో ఉన్న జ్ఞానానందం ఫోటో తీయలేకపోయాను.

 

కొల్లూరి జ్ఞానానందానికి జోహార్లు అర్పిస్తూ….

 

డా. దాసరి రామకృష్ణ ప్రసాదు
అక్టోబర్, 2013