తొందరగా మీ గొంతు మళ్లీ వినాలి బాలూ గారూ.......           (23-Aug-2020)


 గుర్తుకొస్తున్నాయి... 29

 

తొందరగా మీ గొంతు మళ్లీ వినాలి బాలూ గారూ...

 

‘స్వచ్చ భారత్’ లో భాగంగా ‘స్వచ్చ చల్లపల్లి’ ఉద్యమాన్ని 2014 నవంబరు 12 వ తేదీన మొదలు పెట్టాం. గ్రామంలో ‘పరిశుభ్రత, పచ్చదనం, సుందరీకరణ’ మా ధ్యేయాలు.

 

ప్రతిరోజూ ఉదయం 4.30 నుండే 40-50 మందిమి 6 గం. ల వరకూ గ్రామంలో రోడ్లు ఊడ్చి చెత్తను ట్రాక్టరు లో లోడు చేసి డంపింగ్ యార్డుకు చేర్చడం, డ్రైన్లు శుభ్రం చేయడం, రోడ్ల ప్రక్కన కలుపు తీసి పూల మొక్కలను, నీడనిచ్చే మొక్కలను పెట్టడం మాపని.

 

మా ఉదయం కార్యక్రమానికి బాసటగా ఉండడానికి ఒక ట్రస్టు స్థాపించమని మిత్రుడు డా. గురవారెడ్డి సలహా.
ట్రస్టు ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి.


అధ్వాన్నంగా ఉన్న బస్ స్టాండ్ ను సుందరీకరించడానికి RTC వారి అనుమతి తీసుకున్నాం.

గుంటూరులోని ప్రముఖ ఆర్కిటెక్ట్ కె. ఎస్. కుమార్ గారితో RTC ఆవరణను అందంగా చేయడానికి ప్లాను వేయించుకున్నాం.

 

ఆవరణ అంతా శుభ్రం చేసి, కొత్త మట్టి వేసి, నాలుగు తోటలుగా అభివృద్ధి చేశాం. బస్ స్టాండ్ భవనానికి రంగులు వేసి, ఫర్నీచర్ ను సమకూర్చి చూడముచ్చటగా తయారుచేశాం.

 

ఈ నవీకరించబడిన RTC ప్రాంగణాన్ని ,


‘ మనకోసం మనం’ పేరుతో మేము ఏర్పాటు చేసిన ట్రస్టును స్వచ్చ భారత్ బ్రాండ్ అంబాసిడర్ అయిన S.P. బాల సుబ్రహ్మణ్యం గారితో ప్రారంభింపచేయాలని మా కోరిక.

 

ఎంతో పని ఒత్తిడిలో ఉండే బాలూ గారి వంటి ప్రముఖుడిని మా కార్యక్రమానికి పిలవాలనుకోవడం అత్యాశే అని ఊరుకున్నాం. కానీ గురవారెడ్డి మాత్రం
‘ ఆయన్ను నేను తీసుకు వస్తాగా’ అని వారితో మాట్లాడాడు.

 

పాడుతా తీయగా కార్యక్రమం చేయడానికి బాలూ గారు అమెరికా వెళ్లబోతున్నారు. కాలెండర్ చూసుకుని తిరిగి వచ్చిన తర్వాత ఖాళీగా ఉండే సెప్టెంబరు , 26, 2015 రోజును మా ఊరికి కేటాయించారు.

 

స్వచ్చ చల్లపల్లి వేడుకలు అన్నీ ఉదయం 5.30 కే మొదలవుతాయి. ‘అంత పెద్ద వ్యక్తి ఉదయాన్నే ఎలా రాగలరండీ ? ఉ. 10 గం.కు తర్వాత ఏర్పాటు చేసుకోండి’ అని ఒక పెద్దాయన అనడంతో మాకు భయం వేసింది. ఉదయం 5.30 – 12 గం. ల మధ్య కార్యక్రమం పూర్తవ్వాలని మా కోరిక. ‘గురవారెడ్డి మాత్రం ఆయన్ను తీసుకువచ్చే బాధ్యత నాది, నాకు వదిలేయండి’ అన్నాడు.

 

‘బాలూ గారు మీరు వందల కార్యక్రమాలకు వెళ్ళి ఉంటారు కానీ స్వచ్చ చల్లపల్లి విభిన్నమైనది. మనం ఉదయమే వెళ్దాం’ అని గురవారెడ్డి చెప్పాడట. వారు ఒప్పుకున్నారు.

 

ముందు రోజే బాలసుబ్రహ్మణ్యం గారూ, శాంతా బయోటెక్నిక్స్ అధినేత డా. కె. వర ప్రసాద్ రెడ్డి గారు విజయవాడ విచ్చేశారు. ఉదయం 4 గంటలకు బాలూ గారు రెడీ అయి హోటల్ హాలులోనికి వచ్చేశారు. 5.30 కే చల్లపల్లి చేరుకున్నారు. దాదాపు 10 కి.మీ. ముందు నుండీ స్వచ్చ చల్లపల్లి యూనిఫాం వేసుకున్న మా కార్యకర్తలు వారికి ఎస్కార్ట్ గా ఉన్నారు. ఒక ఊరేగింపుగా వస్తూ ఉండగా ప్రతి ఊరి మొదట్లో వారికి పుష్ప గుచ్చాలు అందించడం జరిగింది.

 

గ్రామంలోనికి రాగానే వారిని పూలమాలలతో అలంకరించిన టాపులేని జీపులో ఎక్కించి ఊరంతా వారికి చూపించాము. కార్యకర్తలంతా ముందు నడుస్తుంటే వెనుక జీపులో బాలూ గారు, డా. వరప్రసాద్ రెడ్డి గారు, బుద్ధప్రసాద్ గారు, గురవారెడ్డి గారలు ఉన్నారు. ఎన్నోచోట్ల ఈ జీపును ఆపి అనేక మంది గ్రామస్తులు, Rotary, Lions, వర్తక సంఘం వంటి సంస్థలు వారికి పుష్ప గుచ్చాలందించారు. ‘మా ఊరు వచ్చినందుకు ధన్యవాదాలు’ అని చెప్పారు.

 

కార్యకర్తలతో పాటు గురవారెడ్డి కుమారుడు డా. ఆదర్శ్, అల్లుడు డా. కుశాల్ గ్రామం అంతటా పాదయాత్రలో పాల్గొన్నారు. పాదయాత్ర ఎక్కువ సమయం పట్టి ఉక్కబోసి ఇబ్బందిగా ఉన్నప్పటికీ బాలూ గారు, వరప్రసాద్ రెడ్డి గారు సంతోషంగానే పాల్గొన్నారు. నవీకరించబడిన బస్ స్టాండ్ ను బాలూ ప్రారంభించారు. RTC అధికారులు కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.

 

గ్రామ యాత్ర పూర్తి అవగానే బాలూ గారు, వరప్రసాద్ రెడ్డి గారు, బుద్ధప్రసాద్ గార్లతో పాటు అతిథులందరికీ మా ఇంటిలో అల్పాహారం ఏర్పాటు చేశాం. బాలూ గారు మా ఊరికి రావడమే విశేషం. మా ఇంటికి కూడా వచ్చారు .ఇంటిలో ఉన్నప్పుడు చాలామంది వీరితో ఫోటోలు దిగారు. మిత్రురాలు డా. భార్గవి ఒక పాట కూడా పాడి వారికి వినిపించింది.

 

అల్పాహార విందు తర్వాత చల్లపల్లి రాజా గారి కాలేజీలో బహిరంగ సభ జరిగింది. ఆ స్థలమంతా జనంతో పూర్తిగా నిండిపోయింది. జనవిజ్ఞాన వేదిక నాయకులు వి. బాల సుబ్రహ్మణ్యం గారు, శ్రీమంతు రాజా యార్లగడ్డ అంకినీడు ప్రసాదు గారు కూడా ఆ కార్యక్రమంలో పాల్గొన్నారు.

 

ముందుగా నేను చేసిన ప్రసంగంలో....

 

“బాలూ గారు అద్భుతమైన గాయకులని అందరికీ తెలిసిన విషయమే.


అంతకంటే గొప్ప విషయం రెండు దశాబ్దాలుగా పాడుతా తీయగా కార్యక్రమాన్ని నిర్వహించడం ద్వారా వందలాది మంది గాయకులను తయారు చేయడం మీరు తెలుగు సమాజానికి చేసిన అత్యున్నత సేవ.

 

నేను టి. వి. వారానికి గంటన్నర మాత్రమే చూస్తాను. ప్రతి సోమవారం రాత్రి 9.30 నుండీ 11గంటల వరకూ వచ్చే పాడుతా తీయగా కార్యక్రమమే నేను T.V లో చూసేది.

 

అందులో మీ మాటల కోసం ఎదురు చూస్తూ ఉంటాం.


కొత్త గాయకులను మీరు ప్రోత్సహించే విధానం, పాత సంగతులను మీరు చెబ్తుంటే ఎంతో పరవశంగా ఉంటుంది.

 

స్వచ్చ చల్లపల్లి కార్యక్రమం మొదలయిన తర్వాత ఉదయం 4 గంటలకు ముందే నిద్రలేవవలసి ఉండటంతో ఇప్పుడు ఆ కార్యక్రమం చూడలేకపోతున్నాను.

 

తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడ, హిందీ పాటలను పాడడమే కాక అనర్గళంగా ఈ భాషలన్నీ మాట్లాడగలుగుతున్నారు. ఇది మీ పట్టుదలకు, కృషికి నిదర్శనం.

 

ఒకసారి క్రికెట్ ఆటల పోటీ జరుగుతున్నప్పుడు మీరు ఇలా 4-5 భాషలలో అనర్గళంగా వ్యాఖ్యానించడం నాకు బాగా గుర్తు. మీరు మా ఊరు రావడం మా కార్యకర్తలకు, చల్లపల్లి ప్రజలకు ఎంత సంతోషంగా ఉందో చెప్పలేను”.

 

ఈ నాలుగు మాటలను ఆ రోజు వేదికపై నుండి చెప్పాను.

 

ఉదయం 5.30 నుండీ మా అందరితో ఎంతో సంతోషంగా గడిపారు. చాలామంది వారితో ఫోటోలు దిగారు.

వేటూరి సుందర రామ మూర్తి గారి విగ్రహం ఆవిష్కరణకు పెదకళ్లేపల్లి వచ్చినప్పుడు ఒక్క నిముషం వారితో మాట్లాడటం కుదిరింది.

 

మేము స్వచ్చ చల్లపల్లి గురించి ఎప్పుడు మెసేజ్ పెట్టినా తప్పకుండ సమాధానమిచ్చేవారు.

 

చివరగా మాకు వారు పంపించిన Voice message ఇది (6.05.2020)

 

“సాహో చల్లపల్లి

సాహో చల్లపల్లి వాస్తవ్యులు

మీకు సాహో ”

కరోనా వైద్యం చేస్తున్న డాక్టర్లను అభినందిస్తూ రికార్డు చేయించిన పాటను ఏప్రిల్ 23 న మాకు కూడా పంపారు.

 

అయ్యా!

 

డాక్టర్లు అనేకమంది మీ అనారోగ్యాన్ని సరి చేయాలని అహర్నిశలూ శ్రమ పడుతున్నారు.

 

మీరు ఇంకా బాలుడే! చాలా ఆయుష్షు ఉంది. కోట్లాది మంది మీ గొంతు వినాలని ఆశగా ఎదురుచూస్తున్నారు.

తొందరగా కోలుకొని ఇంటికి వచ్చేస్తారుగా....

 

-మీకు ఉన్న కోట్లాది మంది అభిమానుల్లో ఒకడు.

 

- డా. దాసరి రామకృష్ణ ప్రసాదు

23.08.2020.