వదిలించుకోవాలనుకున్నా వదలని ‘బ్రీఫ్ కేస్’....           (22-Aug-2020)


 గుర్తుకొస్తున్నాయి.... 28

కాలక్షేపానికి కబుర్లు

 

వదిలించుకోవాలనుకున్నా వదలని ‘బ్రీఫ్ కేస్’

 

నా దగ్గర ఒక VIP ‘బ్రీఫ్ కేస్’ ఉండేది. చాలాకాలం నుండి వాడడంతో అది గీతలతో బాగా పాడైపోయింది. ‘ఈ బ్రీఫ్ కేస్ ను చూడలేకపోతున్నాం మార్చవయ్యా అనేవారు మిత్రులు’. బాగానే పనిచేస్తున్నప్పుడు ఎందుకు మార్చడం అనిపించేది నాకు. కానీ మిత్రుల బలవంతంతో ఆ బ్రీఫ్ కేస్ ను తీసివేసి కొత్త బ్రీఫ్ కేస్ కొనుక్కోవాలనుకున్నాను.

 

ఒకరోజు విజయవాడ షాపింగ్ కు వెళ్లాను. కారు రోడ్డు ప్రక్కన పెట్టి డ్రైవర్ కారు ముందు నుంచుని నా కోసం ఎదురుచూస్తున్నాడు. ఒకతను ఎదురొచ్చి ‘నీ జేబులో డబ్బులు పడిపోయాయి, చూసుకో బాబూ’అన్నాడట మా డ్రైవర్ తో. క్రిందకు చూస్తే 20 రూపాయల నోటు కారు ముందు చక్రం వద్ద ఉందట. నా జేబులో నుండీ ఎలా పడింది అని అనుమానం వచ్చినా వంగుని తీసుకుని జేబులో వేసుకున్నాడు.

 

కాసేపున్న తరువాత కారులో చూస్తే నా బ్రీఫ్ కేస్ లేదు. కంగారుగా వచ్చి నాకు చెప్పాడు. వెంటనే వెళ్లి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చి రమ్మన్నాను. పోలీస్ కానిస్టేబుల్ అంతా విని ‘ఏది ఆ 20 రూపాయలు’ అని మా డ్రైవర్ నుండి తీసుకుని జేబులో పెట్టుకుని కంప్లైంట్ రాసుకున్నాడు.

 

20 రూపాయల నోటును ఎర వేసి డ్రైవర్ ఆలోచన ప్రక్కకు మళ్లించాడు ఒకతను. మరో అతను కారు రెండో ప్రక్క వెనుక తలుపు తెరిచి బ్రీఫ్ కేస్ తీసుకుని వెళ్లిపోయాడు. ఇది టీం వర్క్ అని ఆ పోలీస్ చెప్పాడు.

 

ఒక జత బట్టలు, నా లెటర్ పాడ్, కొన్ని ఎమర్జన్సీ మందులు తప్పితే విలువైనవి ఏమీ లేవు. పోనీలే బ్రీఫ్ కేస్ మార్చాలనుకున్నాం గదా పోతే పోయిందిలే అనుకున్నాను.

 

మరో గంటలో నా మొబైల్ కు ఫోన్ వచ్చింది. 'మీ బ్రీఫ్ కేస్ ఏమైనా పోయిందా 'అని అడిగారు అటునుంచి ఎవరో.

 

'అవునండీ కాసేపటి క్రితమే నా కారులో నుంచీ ఎవరో కొట్టేశారు ' అని చెప్పాను.


‘మాకు దొరికింది, వచ్చి తీసుకువెళ్ళండి ’ అని వారి షాపు అడ్రసు చెప్పారు.

 

ఆ షాపు ప్రక్కన ఒకతను బ్రీఫ్ కేస్ క్రింద పెట్టి యూరిన్ పాస్ చేసి బ్రీఫ్ కేస్ తీసుకోకుండా వెళ్లిపోయాడట . ముఠా కూలీలు గమనించి పిలిచే లోపలే కనుమరుగైపోయాడు. వాళ్లు దాన్ని తీసుకువచ్చి ఈ షాపు స్వంతదారునికి ఇచ్చారు. సూట్ కేస్ తాళం వేసిలేదు. భయం భయంగానే తెరిచారట.

 

లోపల నా లెటర్ పాడ్ లో ఫోను నంబరు చూసి నాకు ఫోన్ చేశారు. నా బట్టల వరకూ తీసుకొని సూట్ కేస్ వదిలి వెళ్ళిపోయాడాదొంగ.


పాపం ఈ దొంగకూ పెద్దగా గిట్టుబాటుకాలేదు.

 

'వదిలించుకుందామన్నా నన్ను ఈ బ్రీఫ్ కేసు వదలడం లేదు' అనుకొని థ్యాంక్స్ చెప్పి తెచ్చుకున్నాను.

భేతాళుడు మళ్లీ చెట్టెక్కాడు.


కొసమెరుపు


ఇది జరిగి పదిహేనేళ్ళయింది .
ఇంకా ఆ సూట్ కేస్ నా దగ్గరే ఉంది.

 

డి.ఆర్.కె
22.08.2020.