గిట్టుబాటు కాని దొంగతనం....           (21-Aug-2020)


గుర్తుకొస్తున్నాయి... 27

గిట్టుబాటు కాని దొంగతనం

 

మెడికల్ కాలేజీ లో చదువుతున్నప్పుడే నాకు లండన్ చూడాలనే కోరిక గాఢంగా ఉండేది. మా సీనియర్ ‘డా. జగన్’ (ప్రస్తుతం నాగార్జునా హాస్పిటల్ ఛైర్మెన్ ) లండన్ నుండి వచ్చినప్పుడు అక్కడ పరిస్థితులన్నీ మాకు చెబుతుండేవాడు. గుంటూరు వీధుల్లో తిరుగుతూ జగన్, సాంబిరెడ్డి, నేను చర్చించుకునేవాళ్లం.


ఒకరోజు మాటల్లో ‘ నేను లండన్ చూడాలయ్యా’ అన్నాను.


‘టికెట్ నువ్వు కొనుక్కో డి.ఆర్.కె నేను లండన్ లో ఖర్చులు భరిస్తాను’ అన్నాడు.

 

‘కాణీ లేదు మన దగ్గర. ఈ ఆలోచన ఏంటి డి. ఆర్.కె’ అని సాంబిరెడ్డి ఆశ్చర్యపడ్డాడు.

 

నిజంగానే మాకు రూపాయి సంపాదన కూడా లేని రోజులు కదా. అందుకే వింత ఆలోచన అనిపించేది. అసాధ్యమని తెలిసినా కోరిక మాత్రం పోలేదు.

 

1988 లో నేను, పద్మ చల్లపల్లిలో ప్రాక్టీసు మొదలుపెట్టాము. 1991 లో హాస్పటల్ కు సొంత బిల్డింగ్ కట్టుకుందామనుకొని ఆర్కిటెక్ట్ మిత్రుడు శరత్ కుమార్ తో ప్లాన్ వేయించాము. నిర్మాణానికి ఎంత ఖర్చు అవ్వవచ్చు అని అడిగితే 25 లక్షలు అవుతుందని చెప్పాడాయన. మా వద్ద ఉన్నవి 2 లక్షలే. అందుకే హాస్పటల్ కట్టడం మావల్ల కాదు అనుకున్నాము.

 

నిద్రాణమై ఉన్న లండన్ కోరిక మళ్లీ బయటకు వచ్చింది. లండన్ చూసి వద్దామని పద్మను ఒప్పించాను. సాంబిరెడ్డికి నా ఆలోచనను చెబితే తానొక విలువైన సూచనను చేశాడు.

 

హైదరాబాద్ లో SITA ట్రావెల్స్ వారు యూరప్ టూర్లు నిర్వహిస్తున్నారు. 15 రోజులు వాళ్ళు 5 దేశాలు తిప్పి చివరకు లండన్ చూపిస్తారు. మీరు లండన్ లో మరో 15 రోజులు ఉండవచ్చు అని ఆయన సలహా.

 

బావుందనిపించి సీతా ట్రావెల్స్ లో యూరప్ టూరుకు బుక్ చేసుకున్నాం. జగన్ వాళ్ల ఇంట్లో మరో 15 రోజులు ఉండటానికి మొహమాటంగా అడిగాను. ఎందుకంటే అప్పుడు జగన్ , శ్రీలక్ష్మి లకు పాప పుట్టి ఉంది. వాళ్లింట్లో ఉండటం అంటే వారిని ఇబ్బంది పెట్టినట్లే కదా! కానీ ఆ ఇద్దరూ గట్టిగా రమ్మని చెప్పారు.

 

U. K వీసా కోసం మద్రాసు వెళ్లవలసి వచ్చి ‘ సీతా’ వారు ఫ్లైట్ బుక్ చేశారు. మొదటిసారి విమానం ఎక్కడం, భయంభయంగా ఉంది. విమానం పైన ఎగురుతుండగా బాగా కుదుపులతో శబ్దం చేస్తోంది. 'ఐపోయాం ఇది కూలిపోతోంది 'అనుకున్నాను. చుట్టూ చూస్తే ఎవరూ కంగారు పడటం లేదు. నా ప్రక్కనున్నాయన తాపీగా పుస్తకం చదువుకుంటున్నారు. నా కంగారు గమనించి నన్ను పలకరించారు.


‘ మొదటిసారి విమాన ప్రయాణమా’ అని అడిగారు.


అవునన్నాను.


‘మేఘాలలో నుంచి వెళ్తున్నప్పుడు ఇలా కుదుపులుగా అనిపిస్తుంది కంగారు పడవద్దు’ అని ధైర్యం చెప్పారు. హమ్మయ్య అనుకున్నాను.

 

మా యూరప్ ప్రయాణం బొంబాయి నుండే మొదలు. హైదరాబాద్ నుండీ బొంబాయి వెళ్లే విమానంలో మా ప్రక్కనే యూనివర్సిటీ ప్రొఫెసర్ ఒకాయన కూర్చున్నారు. మా టూరు గురించి తెలుసుకుని ‘ హ్యాండ్ లగేజి ‘లో ఒక జత బట్టలు పెట్టుకోండి. ‘చెక్ ఇన్ లగేజ్’ ఒక్కోసారి మిస్ అవ్వవచ్చు. ఎలాగో ట్రేస్ చేసి మళ్లీ మన బ్యాగ్ మనకు అందజేస్తారు కానీ 3-4 రోజులు పట్టవచ్చు. ఆ నాల్రోజులు మనం బట్టలు లేకుండా ఇబ్బంది పడతాం. అందుకే హ్యాండ్ బ్యాగ్ లో కూడా ఒక జత బట్టలు పెట్టుకోండి అని సలహా ఇచ్చారు. అప్పట్నుంచీ ఆ సలహాను పాటిస్తూనే ఉన్నాం.

 

మా ప్రయాణంలో మొదటి మజిలీ ‘రోం’. ‘రోం’ ఎయిర్ పోర్ట్ లో దిగగానే మా గ్రూప్ లో ఒక సర్దార్జీ సూట్ కేస్ రాలేదు. కంప్లైంట్ ఇచ్చి హోటల్ కు వచ్చేశాం. అందరూ బాధపడ్డారు. 3 రోజుల తర్వాత మేం ఉన్న నగరానికి ఆ లగేజ్ వచ్చింది. ఆ 3 రోజులు ఆయన చాలా ఇబ్బంది పడ్డాడు.

 

ప్రతిరోజూ ఉదయం బ్రేక్ ఫాస్ట్ కు వచ్చేటప్పుడు లగేజ్ సర్దుకుని తీసుకువచ్చి హోటల్ రెసెప్షన్ హాల్ లో పెట్టి బ్రేక్ ఫాస్ట్ అయిన తర్వాత వాటిని తీసుకుని బస్సు వద్దకు వెళ్లే వాళ్లం. డ్రైవర్ అందరి సూట్ కేసులను బస్సులో సర్దేవాడు.

 

ఇలా సరదాగా మా టూర్ సాగుతూ ఉంది. పారిస్ లో రెండు రోజులు గడిపాము. తర్వాత ఆమ్ స్టర్ డాం వెళ్లాలి. ముందు రోజే మా టూర్ లీడర్ ‘కష్మీరా’ మర్నాటి కార్యక్రమం చెప్పి అందరూ సూట్ కేస్ లు తీసుకువచ్చి Waiting Hall లో పెట్టి బ్రేక్ ఫాస్ట్ కు రండి అని చెప్పింది. బ్రేక్ ఫాస్ట్ తర్వాత బస్సులో ఆమ్ స్టర్ డాం వెళ్లాలి.

 

గత రాత్రి చూసిన ‘ మౌలీన్ రూ షో’ గురించి చెప్పుకుంటూ అందరం సరదాగా బ్రేక్ ఫాస్ట్ చేశాం. హాల్ లో ఉన్న సూట్ కేస్ లు ఎవరివివారు బస్సు వద్దకు తీసుకు వెళ్తున్నారు. మా ఇద్దరి సూట్ కేస్ లు కనపడలేదు. ఎంత వెతికినా, ఎందర్ని అడిగినా దొరకలేదు. కత్తి వేటుకు నెత్తురు చుక్క లేదు మా ఇద్దరి మొహాల్లో! కట్టుకున్నవి, హ్యాండ్ లగేజ్ లో ఉన్న మరొక జత తప్పితే మా బట్టలన్నీ ఆ రెండు సూట్ కేసుల్లోనే ఉన్నాయి. డబ్బు, పాస్ పోర్ట్ లు మాత్రం మా దగ్గరే ఉన్నాయి. సమయమైపోతోంది. బస్సు బయలు దేరింది. మాతో పాటు వేరే దేశాల గ్రూపుల వాళ్లు కూడా ఆ సమయంలో బ్రేక్ ఫాస్ట్ కు వచ్చారు. వాళ్లు పొరపాటున తీసుకువెళ్లారేమోనని వేరే బస్సులలో కూడా చెక్ చేశాం.

 

ఎక్కడా దొరకలేదు. ఆమ్ స్టర్ డాం, ఆ తర్వాత లండన్ ఆ బట్టలతోనే దిగులుగా తిరిగాం. లండన్ లో టూర్ అయిన తర్వాత అందరూ తిరిగి బొంబాయి వెళ్లిపోయారు.

 

నేను, పద్మ జగన్, శ్రీలక్ష్మి ల వద్దకు వెళ్లి మరో 15 రోజులు వాళ్ల ఇంట్లోనే ఉండి లండన్ అంతా చూశాం.

 

జగన్ బట్టలు నేను, శ్రీలక్ష్మి బట్టలు పద్మ వేసుకుని తిరిగేవాళ్లం. ఆ రెండు వారాల తర్వాత తిరిగి వచ్చేశాం. కానీ మాకు ఇది పెద్ద బాధాకరమైన అనుభవం.

 

కొస మెరుపు:

 

‘పాపం ఆ దొంగకు ఏమీ గిట్టుబాటు అయి ఉండదు కదా! మన బట్టలు వాళ్లకు ఉపయోగపడవు. వాళ్లకు కావల్సిన విలువైన వస్తువు లేవీ లేవు’ అంటుంది పద్మ ఈ సంఘటన గుర్తుకువచ్చినప్పుడల్లా.....

 

డి. ఆర్.కె
21.08.2020