మత్తు డాక్టర్లకు వందనాలు....           (19-Aug-2020)


 గుర్తుకొస్తున్నాయి…26

కాలేజీ రోజులు

 

*మత్తు డాక్టర్లకు వందనాలు*

 

DGO పూర్తయిన తర్వాత మరింత అనుభవం కోసం ఎవరి దగ్గరన్నా పనిచేయాల్సిందేనని అనుకున్నాను. ఒంగోలులో బెతూన్ నర్సింగ్ హోం నిర్వహిస్తున్న డా. రంగారావు గారు జూనియర్ డాక్టర్లకు ట్రైనింగ్ ఇస్తుండేవారు. ఆ ట్రైనింగ్ 3 సం. లు ఉండేది. వారి హాస్పిటల్ లో చేరడానికి ఒంగోలు వెళ్ళి వారి అనుమతి కోరాను. అప్పటికే అక్కడ ఇద్దరు డాక్టర్లు శిక్షణ పొందుతున్నారు. మా క్లాస్ మేట్ ‘డా. ప్రసన్న’ అప్పుడు అక్కడ పనిచేస్తున్నాడు. అతనికి ఇంకా 9 నెలల శిక్షణ మిగిలి ఉంది. ఆ తర్వాత నన్ను చేరమని వారు చెప్పారు. అయితే DGO పూర్తి చేసినందువలన 2 సం.లు శిక్షణ సరిపోతుంది అన్నారు.

 

నాకు ఎనస్థీషియా అంటే చాలా ఇష్టం. P.G లో D.A. (Diploma in Anesthesia) సీటు వచ్చింది. కానీ ఆపరేషన్లలో ఉండే ఆసక్తి మరింత ఎక్కువ ఉండడం వల్ల DGO తీసుకున్నాను. రంగారావు గారి దగ్గర చేరే ముందు మత్తు వైద్యంలో కొంత అనుభవం సంపాదించుకోవాలనుకున్నాను. గుంటూరు జనరల్ హాస్పిటల్ లో ఎనస్థీషియాలో సీనియర్ హౌస్ సర్జన్సీ కి ధరకాస్తు పెట్టాను. MBBS లో నాకంటే ఎక్కువ మార్కులు వచ్చినతనికి ఆ సీటు కేటాయించారు. కానీ అతను చేరనే లేదు.

 

*ఎనస్థీషియా లో సీనియర్ హౌస్ సర్జన్సీ*

 

అప్పుడు ఎనస్థీషియా లో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా పనిచేస్తున్న డా. గంగాధర్ గారి వద్దకు వెళ్ళి ‘నాకు ఎనస్థీషియా నేర్చుకోవాలని ఉంది సర్! సర్టిఫికేట్ అక్కర్లేదండీ, నేను డిపార్ట్మెంట్ లో పని చేస్తాను’ అని అడిగాను. ఆయన అప్పటి ప్రొఫెసర్ సుబ్బారావు గారి వద్దకు నన్ను తీసుకెళ్లి నాతరపున పర్మిషన్ అడిగారు. వారు అనుమతి ఇచ్చారు.

 

ఆ మర్నాటి నుండీ ఎనస్థీషియా డిపార్ట్మెంట్ లో పనిచేయడం మొదలుపెట్టాను. భోజనానికి, బాత్రూంకు, నిద్రకు తప్పితే ఎప్పుడూ డిపార్ట్మెంట్ లోనే ఉండేవాడిని. ఉదయం 8.30 కు వెళ్ళి లిస్టు పూర్తయ్యే వరకు ఉండి భోజనానికి వెళ్ళి, మళ్ళీ ‘డ్యూటీ ఎనస్థీషియా అసిస్టెంట్’ తో డ్యూటిలో ఉండేవాడిని. నిద్రకు మాత్రం హౌస్ సర్జన్ క్వార్టర్స్ కు వెళ్ళేవాడిని.

 

అసిస్టెంట్లు, పీజీ లు అందరూ చాలా ఫ్రెండ్లీ గా ఉండేవారు. N. సూర్యారావు గారు, S. సూర్యారావు గారు, గంగాధర్ గారు, ప్రభాకర్ గారు నాపై ప్రత్యేక శ్రద్ధ తీసుకునేవారు. నాకు ఎప్పటికీ గుర్తుండే మధురమైన రోజులవి. ఆ కాలంలో జనరల్ ఎనస్థీషియా ఇవ్వాలంటే Boyles apparatus తోనే. ఆ తరువాత Major Boyles, ఇప్పుడు Work station లు వచ్చాయి. నా అనుభవం అంతా Boyles F తోనే!

 

Spinal Anaesthesia గురించిన జాగ్రత్తలు, ప్రమాదాలు, గర్భిణీ స్త్రీలకు spinal ఎలా ఇవ్వాలి, ఎంత dose ఇవ్వాలి - ఇవన్నీ వివరంగా చెప్పి నేర్పించారు.

 

Intubate చేయడమే కాక, జనరల్ ఎనస్థీషియా Maintain చేయడం, extubate చేయడం, వీటిల్లో కాంప్లికేషన్స్, జాగ్రత్తలు నేర్పించారు.

 

సర్క్యూట్ డిస్ కనెక్ట్ చేశావా?

 

ఏ కేసుకైనా మత్తు ఇవ్వకముందే ఆక్సిజన్ సిలిండర్లలో ఎంత ఆక్సిజన్ ఉందో చెక్ చేసుకునేవారు. స్పేర్ సిలిండర్ లేకుండా మత్తు ఇవ్వడం మొదలుపెట్టేవారు కాదు. ఒక రోజు నేను ఉన్న ధియేటర్ లో కేసు పూర్తవడంతో వేరే ధియేటర్ కు వెళ్ళాను. ఆ కేసుకు పూర్తి మత్తు ఇస్తున్న P.G. నాకు బాగ్ అప్పగించి బయటకు వెళ్ళాడు. ఆక్సిజన్ సిలిండర్ అయిపోవచ్చింది. Spare Cylinder లేదు. ఎండోట్రేఖియల్ ట్యూబ్ నుండి ‘బాయిల్స్’ కు ఉన్న కనెక్షన్ తీసి నోటితో ఊదుతూ అర్జంటుగా ఆక్సిజన్ కావాలి అని staff కి అరిచి చెప్పి, ఆ O.T. in-charge అయిన డా. గంగాధర్ గార్కి కబురు చేశాను.

ఆయన వచ్చేటప్పటికే ఆక్సిజన్ సిలిండర్ వచ్చింది. సిలిండర్ ను బిగించి మత్తును కొనసాగిస్తున్నాను.

గంగాధర్ గారు నా చెవిలో “ఊదావా?” అన్నారు.

 

‘ఊదానండీ అన్నాను.

 

‘అయితే ఫర్వాలేదులే’ అన్నారు.

 

ఎప్పుడన్నా ఇటువంటి ఎమర్జన్సీ లో ఆక్సిజన్ సిలిండర్ అయిపోవడం లాంటివి జరిగితే ‘Open Circuit అయితే ట్యూబ్ ను disconnect చేస్తే చాలు. రోగి గాలి పీల్చుకోగలడు కాబట్టి వాతావరణంలో ఉండే ఆక్సిజన్ సరిపోతుంది. ప్రాణానికి ప్రమాదం ఉండదు.

 

‘Closed Circuit’ లో అయితే tube ను disconnect చేసిన తర్వాత మనం ఊదుతూ ఉండాలి. పేషెంట్ తనంతట తాను పీల్చుకోలేడు కాబట్టి మనం ఊదిన గాలిలో ఉన్న ఆక్సిజన్ ప్రాణం కాపాడుతుంది.

ఈ సూత్రాలను ఆయన నాకు అంతక ముందే చెప్పారు కాబట్టి ఆ రోగికి ప్రమాదం జరగలేదు.

 

ఇష్టం లేని వారికి మత్తు ఇవ్వవద్దు.

 

గుంటూరు గవర్నమెంట్ ఆసుపత్రిలో పనిచేసే ఒక స్టాఫ్ నర్స్ వాళ్ల అక్క కు హిస్టరెక్టమీ ఆపరేషన్ చేయవలసి వచ్చింది. వెన్నుపూసకు మత్తు ఇంజక్షన్ చేస్తుండగా ఆపరేషన్ టేబుల్ దిగి పారిపోయింది.

‘నాకు ఆపరేషన్ వద్దు’ అని ఆవిడ మొత్తుకుంది.

 

‘నేను నీ దగ్గరే ఉంటాను. నీకు వెన్నుకు ఇంజక్షన్ చేయరులే. పూర్తి మత్తును అడుగుతాను’ అని ఆ నర్సు వాళ్ళ అక్కను ఒప్పించింది.

 

అయిష్టంగానే టేబుల్ ఎక్కింది ఆవిడ.

 

పూర్తి మత్తు ఇచ్చారు.

 

ఆపరేషన్ అంతా సాఫీగా జరిగిపోయింది.

 

సర్జన్ చేతులు కడుక్కుంటున్నారు.

 

మత్తు డాక్టరు గారు రోగిని మత్తు నుంచి బయటకు తీసుకువచ్చే క్రమంలో అకస్మాత్తుగా ఆవిడ గుండె ఆగిపోయింది(కార్డియాక్ అరెస్ట్). వెంటనే చేయవలసిన ప్రక్రియలన్నీ చేశారు.

 

అప్పడు ఒక్కటే వెంటిలేటర్ ఉండేది. ఇప్పటి వెంటిలేటర్లలా అధునాతనమైనది కాదు. ఆ వెంటిలేటర్ కు కనెక్ట్ చేశారు. కానీ బ్రైన్ డెడ్ అయ్యి 24 గంటల తర్వాత ఆవిడ చనిపోయింది.

 

ఇది మాకొక బాధాకరమైన అనుభవం.

 

“పేషెంట్ ఇష్టపడకుండా ఎప్పుడూ ఆపరేషన్ టేబుల్ ఎక్కించవద్దు. ఇలా ఒప్పించి బలవంతంగా మత్తు ఇచ్చిన వాళ్ళకే కాంప్లికేషన్స్ ఎక్కువగా వస్తాయి” అని ప్రొఫెసర్ సుబ్బారావు మాతో చెప్పారు.

.

మాలో ఎవరో అడిగారు. ‘సార్ ఏమన్నా Study ఉందా?’ అని.

 

‘లేదయ్యా చాలా మంది అనుభవం ఇదే?’ అన్నారు.

 

థియేటర్ లో ఒక టేబుల్ ను నాకు అప్పగించేవారు. ఇలా 5 నెలలు పగలు రాత్రీ డిపార్ట్మెంట్ లో పనిచేశాను.

గంగాధర్ గారితో ఇక సెలవు తీసుకుంటానని చెప్పినప్పుడు ‘సర్టిఫికేట్ తీసుకొందువుగాని రా ప్రొఫెసర్ గారి దగ్గరకు వెళ్దాం’ అన్నారు. ‘లేదండీ నేను సర్టిఫికేట్ అడగనని చెప్పి చేరాను కదా’ అన్నాను.

 

‘పిచ్చోడివా ! సిన్సియర్ గా చేసి సర్టిఫికేట్ వద్దంటావేంటి’? అన్నారాయన.

 

అయినా సర్టిఫికేట్ తీసుకోకుండానే వచ్చి ఒంగోలులో డా. రంగారావు గారి దగ్గర చేరాను.

 

నాకు మత్తు ఇవ్వడంలో ఉన్న అనుభవంతో ఒంగోలులో ఉన్న రెండు సంవత్సరాలూ నేను కూడా Anaesthesia ఇస్తుండేవాణ్ణి.

 

నేను, పద్మ 1988 లో చల్లపల్లిలో ప్రాక్టీసు మొదలుపెట్టాం. అప్పుడు మా ఊరు ప్రక్కనే ఉన్న ఘంటసాలపాలెం PHC లో మా జూనియర్ డా. సత్యవతి పనిచేస్తుండేవారు. ఆవిడ మత్తు డాక్టరు. 10 నెలల తర్వాత తాను బదిలీ అయ్యేవరకూ మా హాస్పిటల్ లో ఆపరేషన్లకు మత్తు డాక్టరు గా వస్తుండేవారు. మాకు చాలా ఉపయోగపడ్డారావిడ.

 

ఆవిడ వెళ్ళిపోయిన తరువాత ఎనస్థీషియా కోసం మత్తు డాక్టర్ మిత్రులను విజయవాడ నుండి పిలుచుకొనేవాళ్లం. విజయవాడ నుండి రావడం అంటే స్కూటర్ పై గానీ, బస్సులో గానీ రావాలి. ఆ కాలంలో రోడ్లు భయంకరమైన గోతులతో ఉండేవి. 3 గంటలు రావడానికి, 3 గంటలు వెళ్లడానికి 3 గంటలు ఇక్కడ ఉండడానికి మొత్తం ఒక్క కేసు కోసం 9 గంటల సమయం ఖర్చు పెట్టవలసి వచ్చేది. మా మీద అభిమానంతో రావడం తప్పితే వారికెవరికీ గిట్టుబాటు అయ్యే కార్యక్రమం కాదు ఇది.

 

వారిని ఇబ్బంది పెట్టకూడదని ఆ తర్వాత మేమే మత్తు ఇచ్చుకుంటూ ఆపరేషన్లు చేసుకునేవాళ్ళం. బందరు లో మత్తు డాక్టర్లు వచ్చారు. కానీ ప్రతి కేసుకీ రావడానికి వారికి వీలయ్యేది కాదు. తప్పనిసరి పరిస్థితులలో మాత్రమే బందరు నుండి మత్తు డాక్టర్ల ను పిలుపించుకునేవాళ్ళం.

 

మత్తు డాక్టరు ఆపరేషన్ థియేటర్లో ఉంటే సర్జన్లకు ఆ సౌకర్యమే వేరు. అవకాశం లేక మాత్రమే మేమే మత్తు ఇచ్చి మేమే ఆపరేషన్ చేసుకునేవాళ్ళం. గత 3 సంవత్సరాలుగా బందరు నుండీ డా. కృష్ణ మా ఆసుపత్రిలో మత్తు డాక్టరు గా సేవలందించడంతో మాకు చాలా సౌకర్యంగా ఉంటోంది.

 

మత్తు డాక్టర్లు ఆపరేషన్ చేయడానికి మత్తు ఇవ్వడమే కాకుండా, ఆపరేషన్ తర్వాత Post operative care ను కూడా నిర్వహిస్తారు.


ఆధునిక వైద్యంలో మత్తు డాక్టర్లది కీలకమైన పాత్ర.

 

నాకు మత్తు ఇవ్వడం నేర్పించిన గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి మత్తు డాక్టర్లకు ఎప్పుడూ కృతజ్ఞతలు చెప్పుకుంటూనే ఉంటాను. ముఖ్యంగా Ectopic pregnancy, Eclampsia , పాముకాటు వంటి ఎమర్జెన్సీ కేసులలో వారిచ్చిన ఈ అనుభవం లేకపోతే కొన్ని ప్రాణాలను రక్షించగలిగే వాళ్ళం కాదు. అందుకే వారందర్నీ ఎప్పుడూ స్మరించుకుంటాం.

 

మత్తు డాక్టర్లందరికీ వందనాలు. 🙏

 

- డి.ఆర్. కె
19.08.2020