‘అన్నగారి’ కబుర్లు....           (18-Aug-2020)


 గుర్తుకొస్తున్నాయి...25

 

‘అన్నగారి’ కబుర్లు

 

1976 లో మద్రాసు వెళ్ళాను. NTR గారి వద్ద మా బావ పనిచేస్తుండేవాడు. NTR ను చూడాలని ఉందంటే విజయా స్టూడియోస్ లో షూటింగ్ ఉంది రమ్మన్నాడు. ‘సతీ సావిత్రి’ షూటింగ్ జరుగుతోంది. B.A. సుబ్బారావు గారు డైరెక్టర్. లవకుశ తీసిన ఎ. శంకర్ రెడ్డి ఆ సినిమా నిర్మాత.

 

యమలోకం సెట్టు వేసి ఉంది. NTR యముడి వేషంలో ఉన్నారు. జగ్గారావు, చలపతిరావు యమభటులు. యమలోకంలో ఉన్న ఒక స్థంభానికి అటు తిరిగి ఆనుకొని డైరెక్టర్ స్టార్ట్ చెప్పగానే NTR ఇటు తిరిగి ముందుకి నడుస్తూ ఒక డైలాగ్ చెప్పే సీను అది. ఆ సీన్ ను ఎందుకో చాలా సార్లు తీశారు. ఒక టేక్ లో NTR స్థంభానికి ఆనుకుని చాలాసేపు ఎదురుచూశారు. డైరెక్టర్ స్టార్ట్ అని చెప్పడం లేదు. ‘గురువు గారూ నేను రెడీ’ అన్నారు గంభీరమైన గొంతుతో. వెంటనే స్టార్ట్ చెప్పారు డైరక్టర్.

 

యమభటులిద్దరూ బయట కూర్చొని ‘అరేయ్ టీ’ అని అరిచేవారు. ‘టీ’ లు తీసుకువచ్చి ఇచ్చేవారు. అలా వారిని మధ్యాహ్నం దాకా షూటింగ్ కు పిలవలేదు. అప్పటివరకు మేకప్ లో అలాగే టీ లు తాగుతూ కూర్చునే ఉన్నారు.

 

నేను కాసేపు వాళ్ల దగ్గర కూర్చొన్నాను. ‘ఏం చదువుతున్నావు బాబూ’ అని అడిగారు. ‘మెడిసిన్’ అని చెప్పాను. ‘మరి నీకిదేం బుద్ధి బాబూ’ అన్నారు. డాక్టరు కాబోయే వాడికి నీకీ సినిమా షూటింగు లెందుకు అని వారి ఉద్దేశ్యం. నిజంగానే అటువంటి పరిస్థితిలోనే ఉన్నాను. ఈ షూటింగ్ చూసి చూసి నాకు విపరీతమైన తలనొప్పి వచ్చింది.

 

చంకలో బ్యాగ్ పెట్టుకున్న ఒకాయన అటూ ఇటూ హడావిడిగా తిరుగుతూ అందరికి పనులు పురమాయిస్తున్నాడు. ‘మీరేనా శంకర్ రెడ్డి గారు’ అని అడిగాను. నేను శంకర్ రెడ్డి నయితే ఇలా ఎందుకు ఉంటాను బాబూ నేను ప్రొడక్షన్ మేనేజర్ని అన్నాడాయన.

 

షూటింగ్ గాప్ లో ఒక సినీ జర్నలిస్టు వచ్చి NTR కు చెప్పకుండా ఫోటో తీసుకున్నాడు. పెద్దాయన పర్మిషన్ తీసుకోకుండా ఫోటో తీస్తే ఆయనకు కోపం వస్తుంది కదా అని జగ్గారావు, చలపతిరావు బాగా కోప్పడ్డారు అతన్ని. కానీ NTR ఏమీ అనలేదు. అతన్ని పిలిచి కొన్ని ఫోజులిచ్చి ఫోటో తీసుకోమన్నారు. నువ్వు అదృష్టవంతుడివి అన్నారు వాళ్లు.

 

బజుల్లా రోడ్, టి.నగర్ :

 

NTR నివాసం T. నగర్ లోని బజుల్లా రోడ్ లో ఉండేది. మర్నాడు 5 గం.లకు అక్కడకు వెళ్లాను. ఆయన అప్పటికే మేకప్ వేసుకుని సిద్ధంగా ఉన్నారు. తిరుపతి నుండి బస్సులో జనం వచ్చారు. అందరూ గుండు చేయించుకుని ఉన్నారు. వారు NTR ను చూడాలని ఇంటి బయట ఉన్నారు. NTR బయటకు వచ్చి వారందరికీ నమస్కరించి ‘ఎక్కడ్నుంచి వస్తున్నారు,


తిరుపతి ప్రయాణం బాగా జరిగిందా!’ అని కుశల ప్రశ్న లేసి ‘హరిని చూడండి అని ‘బాబూ హరీ’ అని హరికృష్ణ ను పిలిచారు. హరికృష్ణ వచ్చి అందరికీ నమస్కరించాడు.

 

ఇలా రోజూ ఉదయాన్నే జనం ఆయన్ను చూడడానికి వస్తారని మా బావ చెప్పాడు. ఆ కాలంలో తిరుపతి వెళ్లిన వారు మద్రాసు కూడా వెళ్లి సినిమా యాక్టర్లను చూసేవారు. ముఖ్యంగా అన్నగార్ని.

 

Emotional ecstasy:

 

ఒకసారి పాట రికార్డింగ్ చూడడానికి జెమినీ స్టూడియోకు వెళ్ళాను.


కోటేశ్వరరావు గారు సౌండ్ ఇంజనీర్.


పాట రాసింది దేవులపల్లి కృష్ణ శాస్త్రి గారు. భార్య తో సహా కృష్ణ శాస్త్రి గారు ఆ రికార్డింగ్ కు హాజరయ్యారు.


గాయకుడు రామకృష్ణ.


పెండ్యాల నాగేశ్వరరావు గారు సంగీత దర్శకులు.


రామారావు గారు నిర్మించే సినిమాలో ఒక పాట అది. కాస్సేపటికి రామారావు గారు వచ్చారు. రికార్డింగ్ మొదలయ్యింది. నాలుగుసార్లు రికార్డింగ్ జరిగిన తరువాత రామారావు గారు రామకృష్ణ ని పిలిచారు.

 

‘నాయనా రామకృష్ణా' అని ఆ పాట సందర్భాన్ని వివరించారు.

 

భరతుడు తన అన్న రాముడి పాదుకలను తన తలపై పెట్టుకుని ఆనందంలో

 

‘అన్నా ఇది నిజమేనా!


ఇంత భాగ్యమీ భరతుడిదేనా!’

 

అని పాడుకుంటున్నాడు.

 

‘Emotional ecstasy రావాలి బాబూ’ అని చెప్పారు.


అలానే అని రామకృష్ణ మళ్ళీ పాడారు. 11 సార్ల తర్వాత పాట OK అయింది.

 

అందరూ తిరిగి వెళ్ళి పోయిన తర్వాత ‘రామకృష్ణ గారూ మా వాణ్ణి ఫలానా చోట దించగలరా’ అని అడిగాడు మా బావ. అలానే అని సంతోషంగా ఆయన తన ఫియట్ కారులో నన్ను తీసుకెళ్లారు. ఆయనే డ్రైవ్ చేశారు. ఏం చేస్తున్నావు బాబూ అని అడిగారు. గుంటూరు లో MBBS చదువుతున్నాను అని చెప్పాను. అవునా! డాక్టరా! అన్నారు ఇలా మాట్లాడుతూనే అకస్మాత్తుగా ఒక చోట కారు ఆపేశారు. ‘ఆపేశారేమండీ’ అని అడిగాను.

 

‘పెద్దాయన వస్తున్నారు. ఆయన వెళ్ళిపోయిన తర్వాత వెళ్దాం’ అన్నారు. ప్రక్క రోడ్డులో నుండీ ఒక పాత కారులో NTR మెయిన్ రోడ్డు ఎక్కి వెళ్లారు.

 

పెద్దాయన మొట్టమొదటిగా కొన్న కారు బాబూ అది అన్నారు రామకృష్ణ.

 

హౌరా మెయిల్ లో పెద్దాయనతో :

 

మద్రాసు నుండీ హైదరాబాదు హౌరా మెయిల్ లో వెళ్తున్నారని తెలిసింది. అది ఉదయం విజయవాడకు 5.30 కు వచ్చి అరగంట ఉండేది. మా బావను కలుద్దామని స్టేషన్ కు వెళ్లాను.


‘పెద్దాయన్ను కలుస్తావా?’ అని అడిగాడు మా బావ.


‘అమ్మో వద్దులే’ అన్నాను.


ఏం ఫర్వాలేదు అని నన్ను లోపలికి తీసుకుని వెళ్లాడు.


AC First class లో బెర్తు మీద బాసింపట్టు వేసుకొని ‘విరాట్ పోతులూరి వీర బ్రహ్మం’ గారి పద్య కావ్యం చదువుతున్నారు.

 

మా మేనమామ గారి అబ్బాయి అని పరిచయం చేశాడు మా బావ.

 

నమస్కరించాను.

 

‘ఏం చదువుతున్నారు?’ అన్నారాయన

‘MBBS అండీ’ అన్నాను.

 

‘బాగా చదువుకోండి’ అని దీవించినట్లు చెప్పారు.

 

పెద్దాయనతో అంతకన్నా ఏం మాట్లాడగలం

మళ్లీ నమస్కరించి వచ్చేశాను.

 

రాష్ట్ర పర్యటన :

 

ఒకరోజు సాయంత్రం నేనూ, పద్మ గుంటూరు నుండీ విజయవాడకు స్కూటర్ మీద వెళ్తున్నాం. మంగళగిరి దగ్గర మెయిన్ రోడ్డు ప్రక్కనే వేల కొద్దీ జనం ఉన్నారు. అన్న గారు వచ్చి ప్రసంగిస్తారని తెలిసి వచ్చిన జనం అని అర్ధమయింది. ఆయన రావడం ఆలస్యం అయిందని ఎదురుచూస్తున్నారు. మేం విజయవాడ వెళ్లిపోయాం.

 

మర్నాడు ఉదయం మళ్ళీ గుంటూరు బయలుదేరాం. మంగళగిరి దగ్గర ముందు రోజు కంటే ఎక్కువ జనం కనపడ్డారు. వరుసగా సభలు నిర్వహిస్తూ వస్తున్నారు అన్నగారు. మంగళగిరికి రాత్రి రాలేకపోయారు. కాసేపట్లో వస్తున్నారాయన అని ఒకాయన చెప్పాడు. క్రితం రోజు సాయంత్రం నుండీ ఆయన్ను చూడడానికి ఎదురు చూస్తున్నారు ఆ జనం అంతా.


12 గంటలకు పైగా!


ఓరి నాయనో అనిపించింది.

 

స్వాతంత్రోద్యమంలో గాంధీ గారి కోసం ఇలా ఎదురు చూసే వారని విన్నాం. ఇప్పుడు తమ అన్నగారిగా భావిస్తున్న NTR కోసం ఎదురుచూడడం చూశాం.

 

రాజకీయాల్లో అన్నగారు :

 

ఆ నెలలోనే పని మీద హైదరాబాదు వెళ్ళాను. మా బావను కలుసుకోవడానికి రామకృష్ణా స్టూడియోస్ వెళ్ళాను. NTR సభలకు వచ్చిన కవరేజిని, ఫోటోలను చూసి మురిసిపోతున్నారు.

 

‘ఏంటి బావా మీరు ఎలక్షన్స్ లో గెలుస్తారనుకుంటున్నారా?’ అని అన్నాను.

 

‘ఆ..తప్పకుండా గెలుస్తాము’ అన్నాడు.

 

“పిచ్చి బావా అన్నగారి మీద అభిమానంతో చూడడానికి జనం వస్తున్నారు గానీ ఓట్లు వేయరు. మీకు అర్ధం కావడం లేదు” అన్నాను.

 

‘లేదురా గెలుస్తాం’ అన్నాడు.

 

‘పాపం వీళ్ళకి రాజకీయాలు తెలియదుగా’ అనుకొని నవ్వి ఊరుకొన్నాను.

 

దేవుడు బాబూ ఆయన :

 

మా అమ్మమ్మ గారికి గాంధీ గారంటే భక్తి. మా చిన్నప్పుడు రాట్నం వడకటం కూడా చూశాము. కాంగ్రెసు కు తప్పితే వేరే పార్టీకి ఎప్పుడూ ఓటు వెయ్యలేదు. అటువంటి ఆవిడ MLA కు అన్నగారి కాండిడేట్ కు, M.P. కు కాంగ్రెసు కాండిడేట్ కు తన ఓటు వేస్తానన్నారు.

 

‘అదేమిటండీ మీరు పక్కా కాంగ్రెసు కదా!’ అని అడిగాను. ‘రామారావుని చూస్తే నాకు దేవుడు అనిపిస్తుందబ్బాయ్’ అని ఆవిడ సమాధానం.

 

అఖండ విజయం :

 

1983 ఎలక్షన్లు. కమ్యూనిస్ట్ పార్టీలకు అన్నగారి పార్టీ కి సర్దుబాటు చర్చలు జరిగాయి కానీ సఫలం అవ్వలేదు. సత్తెనపల్లిలో CPIM సభ్యులు పుతంబాక వెంకటపతి గారికి ప్రచారం చేయడానికి వెళ్ళాను. వారం రోజులు అక్కడే ఉన్నాను.

 

‘తెలుగుదేశం తరపున నన్నపనేని రాజకుమారి’ పోటీ చేశారు. అప్పటికి 30 సంవత్సరాలుగా ప్రజాసేవలో నిమగ్నమయిన అత్యంత నిజాయితీపరుడు వెంకటపతి గారు. ఆయనకు సరైన ప్రత్యర్ధి లేరని మా అభిప్రాయం. ప్రచారంలో రాజకుమారి గారు చాలా సార్లు మాకు ఎదురయ్యేవారు. మమ్మల్ని కూడా నవ్వుతూ పలకరించేవారు. ఆవిడ ప్రక్కన చిన్న పిల్లలు సైన్యం ఉండేది (అన్నగారి ఫాన్స్).

 

పాపం ఈవిడ కొత్తగా రాజకీయాల్లోకి అనవసరంగా వచ్చారు. ఎవరు ఓటు వేస్తారు అనుకునే వాళ్ళం. కానీ ఆవిడ ఏ వీధికి వెళ్ళినా స్త్రీలు ఇళ్ళల్లోకి సాదరంగా ఆహ్వానించి బొట్టు పెట్టి, చీర పెట్టేవారు.

 

ఫలితాలొచ్చాయి. ఏ మాత్రం రాజకీయానుభవం లేని రాజకుమారి గారు, కాకలు తీరిన యోధుడు వెంకటపతి గారిపై పెద్ద మెజారిటీతో గెలుపొందారు.

 

తలపండిన రాజకీయవేత్తల అంచనాల్ని తుత్తునియాలు చేస్తూ అన్నగారు ముఖ్యమంత్రి ఆయ్యారు.

 

మళ్ళీ జనంలోకి :

 

అన్నగార్ని దించి నాదెండ్ల భాస్కర్ రావు గారు ముఖ్యమంత్రి అయినపుడు మళ్ళీ రాష్ట్ర యాత్ర చేశారు. ఎక్కడకు వెళ్ళినా ప్రజలు బ్రహ్మరధం పట్టారాయనకు.

 

అందులో భాగంగానే గుంటూరు బ్రహ్మ్మానందరెడ్డి స్టేడియంలో సభ ఏర్పాటుచేశారు. కమ్యూనిస్ట్ పార్టీలు కూడా ఈ ఉద్యమానికి మద్ధతు ప్రకటించాయి. బ్రహ్మానందరెడ్డి స్టేడియం పూర్తిగా నిండిపోయి కోలాహలంగా ఉంది. నేను మార్కిస్ట్ కమ్యూనిస్ట్ పార్టీ తరపున పనిచేస్తున్న వాలంటీర్లలో ఒకణ్ణి. ప్రజలకు కావలసినవి సమకూర్చడం, సీట్లు చూపించడం, క్రమశిక్షణ పాటింపజేయడం మా పని.

 

అన్నగారు అక్కడకు రావడానికి ఇంకా సమయం పడుతుంది. ప్రజలు ఉద్వేగంతో పెద్దపెద్దగా అరుస్తున్నారు. వారిని ప్రశాంతంగా ఉండమని ఒకరి తర్వాత ఒకరు నాయకులు వేదికపై నుండి అభ్యర్ధిస్తున్నారు. అన్న గారికి జరిగిన అన్యాయానికి జనం ఆవేశంగా ఉన్నారు.

 

ఆఖరుగా జూపూడి యజ్ఞనారాయణ గారు వేదిక ఎక్కారు. ‘రామారావు గారు ఎంతో క్రమశిక్షణ కలిగిన వ్యక్తి. ఆయన మరికాస్సేపట్లో ఇక్కడకు వచ్చేస్తారు. మరి మనమంతా క్రమశిక్షణగా లేకపోతే ఎలా?’ అన్నారు. ఈ రెండు మాటలతోనే అప్పటి వరకూ కేకలతో దద్దరిల్లుతున్న ఆ స్టేడియం ప్రశాంతంగా అయిపోయింది. మేమందరం ఆశ్చర్యపోయాం. మరి కాస్సేపట్లో రామారావు గారు వచ్చారు. ఉద్వేగంగా ప్రసంగించారు. ప్రజలందరూ ఆయనకు నీరాజనాలు అర్పించారు.

 

తిరిగి బరిలోకి :

 

అప్పటి ప్రభుత్వాన్ని రద్దు చేసి మళ్ళీ 1985 లో ఎలక్షన్లు పెట్టారు. ఈ సారి కమ్యూనిస్ట్ లకు, రామారావు గారికి ఒప్పందం కుదిరింది. ఆ ఒప్పొందంలో భాగంగా సత్తెనపల్లెలో CPM తరపున పుతుంబాక వెంకటపతి గారు పోటీ చేశారు. మళ్ళీ ఒక వారం రోజులు అక్కడకు వెళ్ళి ప్రచారం చేసి వచ్చాను.

 

అప్పటి ప్రచారంలో భాగంగా


‘ఢంకా మీద దెబ్బ కొట్టి’ – అని ఒకళ్ళు నినాదమిస్తే


‘గెలుస్తాడు వెంకటపతి’ అని మిగతా వాళ్ళు మరింత గట్టిగా అరిచేవారు.

 

అన్నగారి పార్టీ సహకారంతో వెంకటపతి గారు గెలిచారు. ఆ నియోజకవర్గానికి చక్కటి సేవలందించారు.

 

ఆఖరి మాట :

 

జగమెరిగిన అన్నగారి గురించి నేను ప్రత్యేకంగా చెప్పవలసిందేమీ లేదు. నేను ఆయన్ని దగ్గరగానూ, దూరంగానూ చూసిన కొద్ది సంఘటనలను మిత్రులతో పంచుకోవడానికే ఈ ప్రయత్నం.

 

- డి.ఆర్.కె
18.08.2020.