స్కానింగు – ట్రైనింగు....           (17-Aug-2020)


 గుర్తుకొస్తున్నాయి...24

 

స్కానింగు – ట్రైనింగు

 

ఆనందోద్రేకం

1983 లో DGO లో చేరాను.


డా. C. సావిత్రి గారు మా ప్రొఫెసర్.

 

ఇప్పుడైతే గర్భిణీ స్త్రీలకు ఎప్పుడు అవసరమైతే అప్పుడు స్కానింగ్ చేయిస్తున్నారు గానీ అప్పుడు మా గుంటూరు గవర్న్ మెంట్ హాస్పిటల్ లో స్కానింగ్ మిషనే లేదు.

 

గర్భిణీ స్త్రీలకు స్కానింగ్ పరీక్ష అత్యంత ప్రయోజనకరము, అవసరము. గర్భస్థ శిశువు గురించిన విలువైన సమాచారాన్ని స్కానింగ్ ద్వారా రాబట్టవచ్చు. స్కానింగ్ లేకుండా ఈ రోజులలో గర్భిణీ స్త్రీకి వైద్యం చేయడం ఊహించలేము.

 

ప్రొఫెసర్ సావిత్రి గారు మా పోస్ట్ గ్రాడ్యుయేట్ లలో ముగ్గుర్ని ‘అల్ట్రాసౌండ్ స్కానింగ్’ అవగాహన కోసం పాండిచ్చేరి JIPMER ఆసుపత్రికి పంపారు. దక్షిణ భారత దేశంలో JIPMER అత్యంత పేరు ప్రతిష్టలు కలిగిన కేంద్ర ప్రభుత్వ సంస్థ. అంతకు ముందు నుండే అక్కడ స్కానింగ్ మిషన్ ను వాడుతున్నారు. నేను, మా సీనియర్ డా. ఆళ్ళ సత్యన్నారాయణరెడ్డి మరో P.G అక్కడ కు వెళ్ళిన బృందంలో ఉన్నాం.

 

వారం రోజుల మా ట్రైనింగ్ లో భాగంగా ముందుగా అక్కడ గైనిక్ హెడ్ ఆఫ్ ది డిపార్ట్ మెంట్ డా. రాజారాం గారిని కలుసుకున్నాం. ఆయన చాలా ఫ్రెండ్లీ ప్రొఫెసర్. విద్యార్ధులతో చాలా సన్నిహితంగా ఉండేవారు. అప్పట్లో తెలుగు సినిమాలలో ప్రఖ్యాతిగాంచిన విలన్ ‘త్యాగరాజు’కు తమ్ముడే ఈ రాజారాం గారు.

 

డా. బారోత్ అనే మరొక ప్రొఫెసర్ స్కానింగ్ లు చేస్తున్నారు. ఆయనకు మమ్మల్ని అప్పజెప్పారు. డా. బారోత్ ముందుగా ‘థియరీ’ చెప్పి ఒక రోజు స్కానింగ్ చూపించారు.

 

అదే మొదటిసారి స్కానింగ్ చూడడం. అస్సలు స్కానింగ్ మిషన్ని చూడడమే తొలిసారి. ఒక గర్భిణీ స్త్రీ కి స్కానింగ్ చేస్తూ మాకు వివరిస్తున్నారు. తల్లి పొట్టలో శిశువును చూస్తుంటే మాకు విచిత్రం గానూ, ఆశ్చర్యం గానూ ఉంది. కళ్ళతో పాటు నోరు కూడా తెరిచి చూస్తున్నాము.

 

శిశువు తల, వెన్నెముక, కాళ్ళు, చేతులు కనిపించాయి. కాస్సేపటికి ‘ఇది ఫీటల్ హార్ట్’ అన్నారాయన. శిశువు గుండె కొట్టుకోవడాన్ని live గా చూడడం – తట్టుకోలేనంత ఆనందం, సంభ్రమాశ్చర్యం కలిగాయి. అక్కడితో ఆగకుండా ఇది foetal mitral valve అని చూపించారు.

 

మాకు అదొక emotional ecstasy. అంత ఆనందోద్రేకం నేను మొదటి సంవత్సరం మెడికల్ స్టూడెంట్ గా ఉండగా గుంటూరు వెంకటేశ్వరా విజ్ఞాన మందిరంలో హిప్నోటిజం ప్రదర్శన చూసినప్పుడు కలిగింది.

 

ఇప్పుడయితే గైనకాలజిస్ట్ లకు స్కానింగ్ మిషన్ లేకుండా ఒక్క రోజు కూడా గడవదు. మా సీనియర్ అయిన డా. N.V.K. ప్రసాదు గారి వద్ద నా భార్య ‘పద్మ’ స్కానింగ్ చేయడంలో శిక్షణ పొందింది. గత 30 సంవత్సరాలుగా మా ఆసుపత్రిలో తానే స్కానింగ్ లు చేస్తోంది.


ఇంత చిన్న విషయానికే పోస్ట్ పెట్టాలా అనిపించవచ్చు. కొత్త టెక్నాలజీ వచ్చినప్పుడు ఎంతో Thrill ఫీల్ అవుతాం. తల్లి కడుపులోని ‘శిశువు గుండెను ,అందులో వాల్వ్ ను’ తొలిసారి చూడడం నేను మర్చిపోలేని సంఘటన.

 

సైన్స్ ఆవిష్కరించిన ఎటువంటి టెక్నాలజీ అయినా మంచికీ ఉపయోగించవచ్చు, దురాశకు పోయి స్వార్ధానికీ వాడవచ్చు.

 

అల్ట్రా సౌండ్ స్కానింగ్ మన దేశంలో మొదట్లో కొంత దుర్వినియోగం అయినా ప్రభుత్వ నియంత్రణతో సరిదిద్దబడింది.

 

ప్రతి టెక్నాలజీ కి కొన్ని పరిమితులు ఉంటాయి. గర్భిణీ స్త్రీ లోపల ఉన్న ప్రతి తేడాను స్కానింగ్ ద్వారా తెలుసుకోవడం సాధ్యపడదని కూడా గమనించాలి.

 

కొసమెరుపు :

 

తాను ఎంతో పెద్ద పదవి లో ఉన్నప్పటికీ మేం తెలుగు వాళ్ళమని డా. రాజారాం గారు అక్కడ ఉన్న వారం రోజులూ మమ్మల్ని చాలా అభిమానంగా చూశారు. తిరిగి వచ్చే రోజు బ్రేక్ ఫాస్ట్ కు వారి ఇంటికి పిలిచి మాకోసం ప్రత్యేకంగా వారి శ్రీమతి తో ‘MLA పెసరట్టు’ చేయించి వడ్డించారు.

 

ఇది కూడా మాకు మర్చిపోలేని సంఘటనే!

 

డా. రాజారాం గారు ఆ తర్వాత కేంద్రప్రభుత్వంలో అనేక పెద్ద బాధ్యతలను నిర్వహించారు.

 

డా .ఆళ్ళ సత్యన్నారాయణ రెడ్డి గారు పాండిచ్చేరి లోని ఓ మెడికల్ కాలేజీ లో గైనిక్ HOD గా పనిచేస్తున్నారు .

- డి. ఆర్. కె
17.08.2020.