నాకు తెలిసిన రెండు యధార్ధ సంఘటనలను ఈరోజు మీతో పంచుకుంటాను.....           (16-Aug-2020)


 గుర్తుకొస్తున్నాయి...23


నాకు తెలిసిన రెండు యధార్ధ సంఘటనలను ఈరోజు మీతో పంచుకుంటాను.

 

మొదటిది :

 

అది ఒక పల్లెటూరు. ఆ ఊళ్ళో ఒక కుర్రవాడు బాగా చదువుకునేవాడు. ఊరందరూ అతన్ని మెచ్చుకునేవారు. అతడి తండ్రి చిన్న రైతు. కాయకష్టం చేసుకునేవాడు.

 

చదువులోని ప్రతిభను చూసి ఆ కుర్రాడిని ఊరంతా గౌరవంగా చూసేవారు. అతను MBBS చదివి డాక్టరు అయ్యి ఆ తరువాత వేరే దేశంలో ఉద్యోగానికి వెళ్లాడు.

 

కొడుకు ప్రయోజకత్వాన్ని చూసి తండ్రి గర్వపడేవాడు. మా ఊరి నుండీ ఒక డాక్టరు తయారయ్యాడు, ఫారిన్ వెళ్లి ఉద్యోగం చేస్తున్నాడని ఊరి వారంతా సంతోషపడ్డారు.

 

మొదట్లో కొన్నాళ్లు ఉత్తరాలు వచ్చాయి. ఉత్తరం వచ్చినప్పుడల్లా ఆ తండ్రి సంతోషంతో ఊళ్లో వాళ్లకు కూడా ఆ విశేషాలు చెప్పేవాడు. అందరికీ సంతోషంగానే ఉండేది. కొన్నాళ్లకి ఉత్తరాలు ఆగిపోయాయి. ఆ డాక్టరు అక్కడే ఒక అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడని ఎవరి ద్వారానో తెలిసింది. అలా 15 సంవత్సరాలు గడిచిపోయాయి. అతని గురించి ఎటువంటి సమాచారం లేదు.

 

తండ్రి జబ్బు పడ్డాడు. ప్రమాదకర స్థితిలోనికి వెళ్లాడు. ఊళ్లో వారు ఎలాగో కష్టపడి ఆ డాక్టరు ఫోను నెంబరు సంపాదించారు. తండ్రి మరో 15 రోజుల కంటే బ్రతికేటట్లు లేడు వచ్చి చూసుకోవాలని చెప్పారు.

 

ఆ డాక్టరు వచ్చాడు. 15 రోజులు ఇంట్లోనే ఉన్నాడు. ఆ తండ్రి చనిపోలేదు కానీ మంచం మీదే ఉన్నాడు.

 

‘15 రోజుల కంటే ఎక్కువ బ్రతకడని చెప్పారు. బాగానే ఉన్నాడు గదా’ అని ఊళ్ళో వాళ్ళను కసురుకున్నాడు. అందరూ నోళ్లు వెళ్ళబెట్టారు. ‘రేపు సాయంత్రం నేను బయలుదేరుతున్నాను. ఈ లోపు ఏమన్నా జరిగితే నేను నిర్వహించాల్సిన కార్యక్రమం చేస్తాను లేకుంటే లేదు’ అని ఖరాఖండిగా చెప్పేశాడు.

 

ఆ మర్నాడు తండ్రి చనిపోలేదు. అతను టాక్సీ ఎక్కి Airport కి వెళ్లి పోయాడు. Airport లో ఉండగా ఆయన చనిపోయాడు. అతి కష్టం మీద ఊరి పెద్దలు airport లో ఉన్న ఆ కొడుక్కి ఫోన్ లో సమాచారం అందించారు.

 

‘సారీ నాకు సెలవు లేదు’ అని విమానం ఎక్కేశాడు. కార్యక్రమాన్ని ఊరి పెద్దలు పూర్తి చేశారు.

 

***

 

రెండవది :

 

మా కాలేజీలో ఒక జూనియర్ నాకు మంచి ఫ్రెండు. నిజాయితీ, వృత్తి పట్ల అంకితభావం కలిగిన వ్యక్తి. వాళ్ళ అబ్బాయి నాన్నలాగే డాక్టరు కావాలనుకొన్నాడు. ఆంధ్రప్రదేశ్ లో ఎంసెట్ కూడా కోచింగ్ ఇచ్చే కాలేజీ లో ఇంటర్ మీడియట్ చేరాడు. తెలివిగలవాడు, కష్టజీవి. కాలేజీ వాళ్ళు పెట్టే పరీక్షలలో మార్కులు బాగా వస్తుండేవి. ఇతడు ఎంసెట్ లో అప్పటి అవిభక్త ఆంధ్రప్రదేశ్ లో మొదటి పది ర్యాంకులలో ఉంటాడని అంచనా.

 

పరీక్షలకు మూడు నెలల ముందు ఆ కుర్రవాడి తాతగారు జబ్బు పడ్డారు. ఇతను తాతగారి దగ్గర కొంతకాలం పెరిగాడు. కాలేజీ యాజమాన్యం వద్దకు వెళ్లి తాతగారిని చూసుకుంటానికి వెళ్లాలని అనుమతి అడిగాడు.

 

ఆ సమయంలో తను కాలేజీ వదిలితే ర్యాంకు రాదు. యాజమాన్యం అంత సుముఖత వ్యక్తం చేయకపోయినా పట్టుబట్టి తాతగారి దగ్గరకి వెళ్ళాడు. ఆరోగ్యం బాగాలేనప్పుడు దగ్గరుండి చూసుకోవడం తన బాధ్యత అనుకుని కాలేజీ నుండి వెళ్లాడు. పరీక్షల ముందు నెల రోజుల పాటు తన తాతగారికి సేవ చేసి వచ్చాడు.

 

అనుకున్నట్లుగానే స్టేట్ ర్యాంక్ రాలేదు. అతను కొద్దిగా కూడా బాధపడలేదు. మూడు వందల లోపు ర్యాంకు వచ్చి మెడిసెన్ సీటు వచ్చింది. డాక్టరయ్యాడు. జనరల్ మెడిసెన్ లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశాడు. ఆ తరువాత సూపర్ స్పెషాలిటి కూడా చేశాడు. ప్రభుత్వోద్యోగంలో చేరి ప్రతిభావంతం గానూ, అత్యంత నిజాయితీతోనూ ఉద్యోగం చేస్తున్నాడు.

 

***

 

నా మాట :

 

ఫారిన్ వెళ్లిన ప్రతి డాక్టరు మొదటి డాక్టర్ లాగా ఉండడు. వేరే దేశంలో ఉండి కూడా ప్రతి రోజూ తన తల్లి తండ్రులకు ఫోన్ చేసి పలకరించే డాక్టర్లు ఉన్నారు. ప్రతి ఆరు నెలలకు ఒకసారి తల్లి తండ్రులను చూడడానికి వచ్చి వెళ్లే డాక్టర్లు, తల్లి తండ్రులకు ఏ సమస్య వచ్చినా వెంటనే ఇక్కడకు వచ్చి చూసుకునే డాక్టర్లు నాకు చాలా మంది తెలుసు.

 


మన దేశంలోనే ఉద్యోగం చేసే ప్రతి డాక్టరు రెండవ డాక్టరు లాగా ఉండాలని లేదు. దగ్గరలోనే ఉండి కూడా తల్లి తండ్రులను పట్టించుకోని వారిని మనం చూడడంలేదా!


మరెందుకు రాశాను?

 

నేను స్కూలు పిల్లలతో అప్పుడప్పుడూ మాట్లాడుతూ ఉంటాను. ఈ ఇద్దరి డాక్టర్ల గురించి చెప్పి ‘వీరిలో ఎవరు నచ్చారు’ అని అడిగే వాణ్ణి.

 

అందరూ రెండవ డాక్టరే నచ్చాడు అంటారు. కాబట్టి గొప్ప చదువులు చదవాలనుకోవడమే కాదు, భవిష్యత్తులో ఏ వృత్తిలో ఉన్నా ఆ వృత్తి లోనే కాక సమాజం పట్ల, కుటుంబం పట్ల కూడా ‘సరైన దృక్పథం’ ఉండటం ముఖ్యం అని ముగించేవాణ్ణి.

 

- డి.ఆర్.కె
16.08.2020