తాత – మనవడు....           (15-Aug-2020)


 గుర్తుకొస్తున్నాయి.... 22

 

*తాత – మనవడు*

 

1988 లో చల్లపల్లిలో ప్రాక్టీస్ పెట్టిన కొత్తలో ఒకాయన తన భార్యను తీసుకువచ్చి చూపించారు. ఆవిడకి ఇంట్లో ఫిట్ వచ్చింది. ప్రాథమిక చికిత్స చేశాను. పెద్ద వయసులో మొదటి సారి వచ్చింది కదా న్యూరాలజిస్ట్ కి చూపించమని చెప్పాను.

 

న్యూరాలజిస్ట్ కు చూపించడమంటే ఆ కాలంలో గుంటూరు వెళ్లవలసిందే. విజయవాడ లో ఎవ్వరూ లేరు. మా క్లాస్ మేట్ ’ డా. రాంతారక్ నాథ్’ గుంటూరు జనరల్ హాస్పటల్ లో న్యూరాలజీ ప్రొఫెసర్ గా ఉండేవాడు. అతని దగ్గరకు వెళ్లమన్నాను.

 

నావల్ల కాదని ఆయన మొండికేశారు. ఆయన మంచి రైతే. ఆ కాలంలో దివిసీమ లో చాలా మంది పొలాలను రొయ్యల చెరువులుగా మార్చి రొయ్యలను సాగు చేసేవారు. మొదట్లో అందరికీ లాభాలే వచ్చాయి కానీ ఆ తరువాత వైరస్ జబ్బులు వచ్చి చాలామంది నష్టపోయారు. ఈ సారి నష్టపోయినా వచ్చేసారన్నా లాభం రాకపోతుందా అనే ఉద్దేశ్యంతో మళ్లీ మళ్లీ పంట వేసేవారు. అలా మళ్లీ మళ్లీ నష్టపోయిన వాళ్లల్లో ఈయన కూడా ఒకరు.

 

ఈ రకమైన ఆర్థిక ఇబ్బందులు ఉండే గుంటూరు వెళ్లలేనన్నారు అని అర్థమైంది. నేను 1500/- వారికి ఇచ్చి ‘ఈ డబ్బుతో గుంటూరు తీసుకువెళ్లి చూపించుకొని, పరీక్షలు చేయించుకొని, న్యూరాలజిస్ట్ అభిప్రాయాన్ని తెలుసుకురండి. ఆ తరువాత ఇక్కడే వైద్యం చేయించుకోవచ్చు. నా డబ్బు మీరు తరువాత ఇద్దురుగానీ’ అని నచ్చజెప్పాను. అయిష్టంగానే డబ్బు తీసుకుని బయలుదేరారు. వెళ్లేటప్పుడు ‘ మరో 1500/- ఇస్తారా డాక్టరు గారు దూరం వెళ్తున్నాము కదా’ అని మొహమాటంగానే అడిగారు. మరో 1500/- లు కూడా ఇచ్చాను.

 

డాక్టర్ తారక్ నాథ్ వద్దకు వెళ్ళి పరీక్షలు చేయించుకుని ప్రమాదకరమైన తేడా ఏమీ లేదని తెలుసుకుని మందులు రాయించుకుని వచ్చారు. ఆ తరువాత ఆవిడ బాగానే ఉన్నారు.

 

కొన్ని సంవత్సరాల తరువాత మేం కొత్త హాస్పటల్ కట్టుకోవడం మొదలుపెట్టాం. అప్పుడు డబ్బు అవసరమైంది. 3000/- లు కూడా పెద్ద మొత్తమే అప్పుడు. డబ్బు కోసం ఆయనకు కబురు చేశాను. ‘రొయ్యల సాగులో ప్రతిసారీ నష్టమే వస్తోంది. వచ్చేసారి పంట చేతికి రాగానే బదులు తీరుస్తాను’ అన్నారట. ఆయన ఇవ్వలేని పరిస్థితులలోనే ఉన్నారని నాకర్థమయింది. నేను ఆ విషయం మర్చిపోయాను.

 

రొయ్యల చెరువుల వలన ఆర్థికంగా బాగా దెబ్బతిన్నారు. అందుకే నేను మళ్లీ ఎప్పుడూ ఆయన వద్ద ఈ విషయాన్ని ప్రస్తావించలేదు. ఆయన కమ్యూనిస్ట్ పార్టీలో పని చేసేవారు. ఒకరోజు కమ్యూనిస్ట్ పార్టీ జనరల్ బాడీ మీటింగ్ లో స్టేజి మీద ఉండి అకస్మాత్తుగా కుప్పకూలిపోయారని ఆయన్ని నా దగ్గరకు తీసుకువచ్చారు. కానీ అప్పటికే ఆయన చనిపోయారు. మంచి వ్యక్తి చనిపోయారని అందరం బాధపడ్డాం.


*****

 

20 సంవత్సరాల తరువాత ఒకరోజు వాళ్ల అమ్మాయి, మనవడు మా హాస్పటల్ కు వచ్చి నాతో మాట్లాడతానని కబురు చేశారు. మనవడు ఇంజినీరింగ్ చేసి ఉద్యోగం చేస్తున్నాడట. ‘తాతగారు మీ దగ్గర అప్పు తీసుకున్నారట. అప్పటి పరిస్థితులలో మా తాతగారు మీ బదులు తీర్చలేకపోయారు ‘ అని 3000/- లు నా చేతిలో పెట్టబోయాడు.

 

‘మీ కుటుంబంతో నాకు మంచి అనుబంధం ఉంది. తాతగారు ఇవ్వలేని పరిస్థితుల వలనే ఇవ్వలేదు. నేనెప్పుడో ఆ విషయం మర్చిపోయాను. వద్దు బాబూ ఆ డబ్బు గురించి ఇప్పుడు ప్రస్తావించవద్దు’ అని చెప్పాను.

 

అప్పుడు వాళ్లిద్దరూ కళ్ల నీళ్లు పెట్టుకున్నారు.

 

‘మీరు తీసుకోకపోతే మా తాతగారి అప్పు అలాగే ఉండిపోతుందండి. అది మాకెప్పటికీ బాధే. దయచేసి కాదనకండి’ అని బలవంతంగా నా చేతిలో 3000/- లు పెట్టాడు.

 

గట్టిగా తీసుకోవద్దనుకున్నవాణ్ణి కూడా ఆ మాటతో తీసుకోవాల్సివచ్చింది. ఈ సారి నేను కళ్ల నీళ్ల పర్యంతం అయ్యాను. వాళ్ల మంచితనంతో కాసేపు నా నోట మాట రాలేదు. పది నిముషాలు మా మధ్య నిశ్శబ్దం రాజ్యం చేసింది. ఆ తరువాత వెళ్లొస్తామని నమస్కారం పెట్టి వెళ్ళిపోయారు.

 

ఎన్నాళ్ల నుంచీ ఈ అప్పు భారాన్ని మోస్తున్నారో కదా. వారిద్దరూ కాస్త తేలిక పడి వెళుతున్నట్టుగా అనిపించింది. ఎన్నో సంవత్సరాల క్రితమే నేను మర్చిపోయాను కానీ వారు మర్చిపోకుండా ఎప్పటికైనా తిరిగి ఇవ్వాలనుకోవడం వారి నిజాయితీకి నిదర్శనం.

 

జనంలో మంచితనం ఉంది. ఎప్పటికీ ఉంటుంది కూడా...

 

- డి ఆర్ కె
15.08.2020.