నేనెందుకు డాక్టర్ని అవ్వాలనుకున్నానంటే?....           (14-Aug-2020)


 గుర్తుకొస్తున్నాయి....21

కాలేజీ రోజులు

 

*‘నేనెందుకు డాక్టర్ని అవ్వాలనుకున్నానంటే?’*

 

నా చిన్నప్పుడు మా బంధువుల కుటుంబంలో మా పెద్ద మావయ్య గారే బాగా చదువుకున్నవారు. మా వాళ్లంతా ఆయన ‘ ఇంజనీరు’ అని గొప్ప గా అనుకునేవారు. ‘జూనియర్ ఇంజనీరుగా’ ఆంధ్రప్రదేశ్ విద్యుత్ సంస్థ (APSEB) లో పనిచేస్తుండేవారు. పిల్లలందరం ఆయన్ను ఆరాధనగా చూసేవాళ్లం.

 

నేను ఇంకా బాగా చదివి ‘ సీనియర్ ఇంజనీరు’ కావాలనుకునేవాణ్ణి. (సీనియర్ ఇంజనీర్ అనేది వేరే చదువు కాదని, ప్రమోషన్ తో ఆ ర్యాంక్ వస్తుందని నాకప్పటికి తెలీదు).

 

నాన్నగారు డ్రిల్ మాష్టారు. ఆయన కైకలూరు స్కూల్లో పనిచేస్తున్నప్పుడు మేం ఆ ఊరికి దగ్గర్లో ఉన్న గోపవరం అనే ఊళ్లో ఉండేవాళ్లం.

 

అప్పటికి నేనింకా హైస్కూల్లో చేరలేదు. ఒక రోజు రోడ్డు మీద నడుస్తుంటే ‘ ఒరేయ్ డ్రిల్ మాష్టార్ గారబ్బాయ్! ‘నువ్వు పెద్దయిన తర్వాత ఏం అవుతావు?’ అని అడిగాడు ఒక పెద్ద మనిషి.

 

‘ఇంజనీర్నవుతా’ అన్నాను
‘ఇంజనీర్లకు ఉద్యోగాలు లేవురా అబ్బాయ్’ అని నవ్వి ఆయన వెళ్లిపోయాడు.


అయితే డాక్టర్నవుతా అని మనసులో అనుకున్నాను.

 

బాగా చదువుకోవడం అంటే నాకు తెలిసింది ‘ఇంజనీరు గానీ, డాక్టరు గానీ’ అవడం అనే!

 

నేను బాగా చదువుకోవాలనుకుంటున్నాను కాబట్టి నాకు మరో ఆలోచన ఏమీ రాలేదు. పెద్దాయన ఇంజనీర్లకు ఉద్యోగాలు లేవన్నాడని ‘డాక్టరు’ అవ్వాలనే అనుకున్నాను.

 

నేను డాక్టరు అవ్వాలనుకోవడానికి మొదట్లో పడిన బీజం అది.

 

కేరళ నుంచి వచ్చిన ‘ పీటర్‘ గారనే ఆయన ఆ ఊళ్లో వైద్యం చేస్తుండేవారు. ఊరందరికీ ఆయనే దిక్కు.

ఊళ్లో వాళ్లు కూడా ఆయన్ను బాగా చూసుకునేవారు.

 

డాక్టర్ కావాలనే కోరిక ‘ బలంగా ఉండి’ మెడికల్ ఎంట్రన్స్ లో సీటు తెచ్చుకుని గుంటూరు మెడికల్ కాలేజీ లో చేరాను.


చేరిన మొదటి వారంలోనే ఒక సోషల్ ఆర్గనైజేషన్ వారు (బహుశా ప్రజా సేవా సమితి తరుపున మా సీనియర్ అయిన కోనేరు సత్య ప్రసాద్ అనుకుంటా) మా క్లాసుకు వచ్చి ఒక కొశ్చనీర్ ఇచ్చారు. అందులో ఒక ప్రశ్న “ మీరెందుకు డాక్టరవ్వాలనుకుంటున్నారు?” అని.

 

నాకు ఏం సమాధానం రాయాలో తెలియలేదు. నా మిత్రులు చాలా మందికి గూడా ఇదే సమస్య వచ్చింది.

 

ఎందుకు డాక్టరవ్వాలనుకున్నానో అర్థం కావడం లేదు. ఎంత ఆలోచించినా సమాధానం రాలేదు.

 

ఏం తోచక “ సేవ చేయడానికి “ అని రాశాను. కానీ నాకు అది సరైన సమాధానం కాదని తెలుసు. అంత చిన్న వయసులో అంత గొప్ప ఆలోచనలు రావు. డబ్బు కూడా ఎక్కువ సంపాదించగలమని, సంపాదించాలని గానీ ఎక్కువ మందికి తెలియని రోజులు. కానీ ఎందుకు డాక్టరవ్వాలనుకున్నాను? క్లారిటీ లేదన్నమాట.

 

చిన్నప్పట్నుంచీ ‘ నువ్వేమవుతావని’ ఎవరడిగినా ‘నేను డాక్టర్నవుతానని’ చెప్తుండేవాడిని. టీచర్లు, బంధువులు అందరూ నన్ను ప్రోత్సహించేవారు. ప్రత్యేకంగానూ చూసేవారు.

 

హౌస్ సర్జన్సీ లో కానీ నాకు అర్థం కాలేదు చిన్నప్పుడే ఎందుకు డాక్టర్ని అవ్వాలి అనుకున్నానో!

‘గౌరవం కోసం’ అని అప్పటికి తెలిసింది.

 

మనిషి తిండి, బట్ట, నీడ తర్వాత కోరుకునే ముఖ్యమైన కోరిక- ‘గౌరవం’. ఇది రెండు రకాలుగా ఉంటుంది.

మొదటిది - బయట సమాజం నుండీ వచ్చేది. మెచ్చుకోళ్లు, గుర్తింపు రావడం లాంటివి.

 

రెండవది - తనను తాను గౌరవించుకునేది.

 

మనం ఎంత మంచి చేస్తున్నా బయట సమాజం అప్పుడప్పుడు అపార్థం చేసుకోవచ్చు.

 

బయట నుండీ వచ్చే గౌరవం కోసం అర్రులు చాచకుండా ‘మనను మనం గౌరవించుకునేటట్లు బ్రతికితే చాలు’.

 

మా తర్వాతి తరంలో మెడిసిన్ లో చేరిన వారిని చాలా మందిని అడిగాను ‘ఎందుకు మెడిసిన్ లో చేరుతున్నారని?’.


‘డబ్బు, మంచి జీవితం’ వస్తాయి గదండీ డాక్టరైతే!’ అనే సమాధానం ఎక్కువ మంది నుండి వచ్చింది.

 

మేం చేరినప్పుడు మాత్రం వైద్య విద్యార్థులలో ఎక్కువ మందికి డాక్టరు అవ్వడం అనేది ముఖ్యంగా సమాజంలో దొరికే ‘ గౌరవం కోసమే’ ! ఆర్థికంగా మంచి జీవితం అనేది అంతర్లీనంగా మనసులో ఉండేదేమో గాని క్లియర్ గా అప్పట్లో మాలో ఎక్కువ మందికి తెలీదు.

 

నిజమే కదా! డాక్టర్లం దేశంలో చాలా మంది ప్రజలకన్నా ఆర్థికంగా, సామాజికంగా బాగున్నాం కదా!

 

మరి సమాజానికి తిరిగి ఇవ్వకపోతే ‘లావైపోమూ !...'

 

- డి ఆర్ కె
14.08.2020