బాకీ....           (12-Aug-2020)


 గుర్తుకొస్తున్నాయి..... 20

 

*బాకీ*

 

‘ఉంటాను ప్రకాష్’ అన్నాను భారంగా.

 

‘బై డి.ఆర్.కె.’ అన్నాడు ప్రకాష్.

 

‘మోహన్’ జాగ్రత్తగా తీసుకువెళ్లు

పాల్ఘాట్ రైల్వే స్టేషన్ లో రైలు బయలు దేరే ముందు మా ముగ్గురికీ జరిగిన సంభాషణ.

 

***

 

హౌస్ సర్జన్సీ పూర్తవగానే మా క్లాస్ మేట్ ‘ప్రకాష్’ కేరళ లో ఉద్యోగానికి వెళ్లిపోయాడు. పాల్ఘాట్ లో ఉద్యోగం చేస్తూ మాకు ఉత్తరాలు రాస్తుండేవాడు. నేనూ కేరళలో ఉద్యోగం చేద్దామని పాల్ఘాట్ లో దిగాను.

 

‘డా. కృష్ణన్స్ హాస్పిటల్’ లో ‘రెసిడెంట్ డాక్టరు’ గా ప్రకాష్ పని చేస్తూ ఉండేవాడు. ఆ హాస్పటల్ లోనే రెండవ అంతస్థులో ఒక గదిలో ఉండేవాడు. నన్ను తన గదిలోనే అట్టిపెట్టి చుట్టుప్రక్కల ఉన్న ఊళ్లలో నా ఉద్యోగం కోసం ప్రయత్నిస్తుండేవాడు.

 

పది రోజులు సరదాగా గడిపేశాం. మా ఉద్యోగ ప్రయత్నాలేవీ ఫలించలేదు. నా హైస్కూల్ మిత్రుడు ఒకతను కేంద్ర ప్రభుత్వ ఉద్యోగిగా’ త్రిచూర్’ లో పని చేస్తున్నాడు. ఆతని దగ్గరకు వెళ్లి త్రిచూర్ లో గానీ, చుట్టు ప్రక్కలగానీ ఉద్యోగ ప్రయత్నాలు చేస్తాను అని చెప్పాను ప్రకాష్ కి.

 

నేను దూరంగా వెళ్లడం ప్రకాష్ కి ఇష్టం లేదు. పాల్ఘాట్ కు 40 కి.మీ. దూరంలో ఓ ఊళ్లో ఉద్యోగం ఉన్నట్లుగా తెలుసుకున్నాడు. అక్కడకు వెళ్లి ప్రయత్నిద్దాం అన్నాడు.

 

తను పనిచేసే హాస్పటల్ మేనేజర్ రామకృష్ణ గారి స్కూటర్ తీసుకొని నన్ను ఎక్కించుకొని బయలుదేరాడు. నా ఒరిజినల్ సర్టిఫికెట్లున్న ఫైలును స్కూటర్ లో పెట్టి వెనుక కూర్చోన్నాను.

 

దాదాపు 30 కిలోమీటర్ల ప్రయాణంలో మమ్మల్ని నాలుగు చక్రాల బండి ఏదీ ఓవర్ టేక్ చేయలేదు. ఎదురుగానూ రాలేదు. దాదాపు ట్రాఫిక్ లేదు. నున్నటి తారు రోడ్డు. ప్రకాష్ బండి నడుపుతుంటే నాకు భయంగా ఉంది. అదే తనతో చెప్పాను. ‘లేదు డి. ఆర్. కె. 40 కి.మీ. స్పీడు నేను దాటడం లేదు’ అన్నాడు.

 

మా 150 మంది క్లాస్ మేట్స్ లో ఒకరికో ఇద్దరికో స్కూటర్ ఉండేది. అందరూ సైకిల్ వాలాలమే!
మోజు కొద్దీ స్కూటర్ నేర్చుకునే వాళ్లం కొంతమంది. ప్రకాష్ కూడా ఆ బాపతే! స్కూటర్ మీద పూర్తి కంట్రోల్ లేదని నా అభిప్రాయం. మళ్లీ అదే చెప్పాను.

 

‘నీ ప్రాణానికి నా ప్రాణం అడ్డు వేస్తాగా’... అని నవ్వాడు.

 

అప్పుడు హిందూ దిన పత్రికలో వచ్చిన ‘కోతి కథ’ చెప్పాను. సైంటిస్టులు ఒక గాజు తొట్టెలో కోతినీ, దాని పిల్లనూ ఉంచి నీళ్లతో తొట్టెను నింపడం మొదలు పెట్టారట. పిల్ల మునిగేంత నీరు రాగానే తల్లి పిల్లను తన భుజాల మీదకు ఎక్కించుకుంది. నీళ్లు ఇంకా పెరుగుతున్నాయి. తల్లి ముక్కు మునిగిపోయే సమయం వచ్చినప్పుడు భుజాల పై ఉన్న పిల్లను దించి దానిపై నుంచుందట. తన ప్రాణమే ప్రమాదంలో పడినప్పుడు పిల్ల ప్రాణాన్ని త్యాగం చేసింది.

 

“ఎవరి ప్రాణం వారికి తీపి” అని ఈ ప్రయోగం చెప్తోంది గదా అన్నాను.


ఇలా స్కూటర్ ప్రయాణం చేస్తూనే కబుర్లు చెప్పుకుంటూ ఉన్నాం. ఒక కాలువ ఎడమ ఒడ్డునే మేం వెళ్తున్న రోడ్డు ఉంది.

 

అకస్మాత్తుగా కాలువపై వంతెన కనపడింది. మేం ప్రయాణిస్తున్న ఆ రోడ్డు వంతెన వైపు తిరిగి కుడి పక్కకు వెళ్లింది. ఈ మార్పును గమనించి కుడి ప్రక్కకు స్కూటర్ ను తిప్పినా వంతెన పిట్ట గోడను ఢీ కొనడం ఖాయం అనిపించింది.

 

పిట్టగోడ ప్రక్కనే తాడిచెట్టు ఉంది. పిట్టగోడకు మా స్కూటర్ గుద్దుకొని మేం తాడిచెట్టుకు తగిలి నా తలకు దెబ్బ తగులుతుంది. నేను కాలవ నీళ్లలోకి పడిపోవడం ఖాయం. నాకు ఈత బాగానే వచ్చినా తల దెబ్బ వలన కోమాలోకి వెళ్లి నీళ్లల్లో మునిగిపోయి చనిపోతాను అని తీర్మానించుకున్నాను. బంధువులు, మిత్రులు అందరూ గుర్తుకొచ్చారు. చివరకు ఇలా చనిపోతున్నానా అనిపించింది.

 

ఈ ఆలోచనలన్నీ మేం ఆ పిట్టగోడకు ఢీ కొనక ముందు ఎంతో వేగంగా10 సెకన్లలో వచ్చినవే!

 

'drk we are out 'అని అరిచాడు ప్రకాష్ .

 

మా స్కూటర్ పూర్తిగా కుడి ప్రక్కకు తిరగలేక పిట్ట గోడను ఢీ కొంది. అదృష్టవశాత్తు తాడిచెట్టుకు తగలకుండా దాని ప్రక్కనుండీ ఎగిరి కాలవలో పడ్డాం. సగం నీళ్ళలో, సగం ఒడ్డున ఉన్నాం. నాకు కాస్త దూరంలో ప్రకాష్ కనిపించాడు. అయితే ఇద్దరం బ్రతికే ఉన్నామన్నమాట. బ్రతికే ఉన్నామన్న ఆలోచన ఆ క్షణంలో ఎంత సంతోషాన్నిచ్చిందో చెప్పలేను.

 

“అలాగే ఒడ్డున పడుకో ప్రకాష్! మనం బానే ఉన్నాం” అన్నాను. బహుశా మా ఒళ్లంతా ఫ్రాక్చర్లు అయి ఉంటాయి అనుకొన్నాను.

 

ముందుగా కుడి చెయ్యి లేపాను. లేచింది. ఫ్రాక్చరు లేదు. ఎడమ చెయ్యి చూసుకొన్నాను. ఫ్రాక్చర్ లేదు. అయితే కాళ్లు విరిగి ఉంటాయి అనుకొన్నాను . ఒక్కొక్క కాలు కదిపి చూస్తే కదులుతున్నాయి. నుంచుని చూద్దాం అని ప్రయత్నిస్తే నుంచోగలిగాను. అయితే నాకు ఒక్క ఫ్రాక్చర్ కూడా అవ్వలేదన్నమాట. నా ఆనందం రెట్టింపయ్యింది.

 

నెమ్మదిగా ప్రకాష్ దగ్గరకు వచ్చి ‘we are alive Prakash’ అని సంతోషంగా అన్నాను. ప్రకాష్ లేవలేక పోయాడు. మోకాలు నొప్పిగా ఉందన్నాడు.

 

బిలబిలమంటూ జనం వచ్చేశారు. స్కూటర్ పిట్టగోడకు గుద్దుకున్న శబ్దం విని వచ్చేశారట. గబగబా ప్రకాష్ ను పైకి లాగి ఒడ్డున పడుకో పెట్టి నొప్పిగా ఉందని కాలు పిసకబోయారు. అలా చేయకూడదని చెప్పాలి. నాకు మలయాళంలో ‘ఇల్లె, వేండా’ అనే రెండు పదాలు తప్ప ఏమీరావు. సూర్య ప్రకాష్ మలయాళంలో పండితుడు. కేరళ వాళ్లకే వాళ్లు మాట్లాడిన తప్పులను ఎత్తి చూపేవాడు. ఈ 10 రోజులలో ఎప్పుడూ తన ప్రక్కనే ఉండటంతో నాకు ఆ భాష నేర్చుకోవలసిన అవసరం రాలేదు.

 

ప్రకాష్ కు నొప్పి ఎక్కువగా ఉంది. పిసకద్దు అని చెప్పలేకపోతున్నాడు. పాపం స్థానికులు చాలా మంది సపర్యలు చేస్తున్నారు.

 

ఈ కాలు మర్దనా ఎలా ఆపాలో తెలియక ‘ డాక్టరై, డాక్టరై’ అని చెప్పాను. మనం డాక్టరు అంటాం కదా. వాళ్లు ‘డాక్టరై’ అంటారు. మొత్తానికి ఈయన డాక్టరు అని వాళ్లకు అర్థం అయింది. మర్దనా ఆపారు.

 

అక్కడకు కాస్త దూరంగా కొద్ది ఇళ్లు ఉన్నాయి. మనలాగా ఒక ఊరు అంటే వందల, వేల మంది ఉండరక్కడ. మనిషి తోక్కే రిక్షాలు ఉండవు. ఎంత మారుమూల పల్లెటూరైనా టాక్సీ ఉంటుంది.

 

స్కూటరు మాకంటే దూరంగా పడిపోయి ఉంది. అందులో నుండి నా ఒరిజినల్ సర్టిఫికెట్ల ఫైలు పడిపోయింది. వాటన్నిటినీ ఏరి నాకిచ్చారు. ‘స్కూటరు గురించి దిగులు పడకండి. మా ఇంటి దగ్గర అట్టిపెడతాను’ అని ఒకతను చెప్పాడు.

 

అందరూ కలసి ప్రకాష్ ని కారు ఎక్కించారు. ఫాల్ఘాట్ లోని కృష్ణన్స్ హాస్పటల్ లో డాక్టరుగా పనిచేస్తున్నాడని తెలుసుకుని అక్కడికే తీసుకువెళ్లారు. హాస్పటల్ లో దింపి X- Ray తీసేవరకూ అక్కడే ఉన్నారు. మోకాలు చిప్ప (Patella) మూడు ముక్కలయిందని తెలుసుకుని బాధ పడ్డారు. వెళ్లేటప్పుడు టాక్సీ ఖర్చులు ఇవ్వబోయాను. వద్దంటే వద్దని వెళ్లి పోయారు. కళ్లల్లో నీళ్లు తిరిగాయి.

 

ప్రకాష్ వాళ్ల ఇంటికి STD చేసి విషయం చెప్పాను. అదే హాస్పటల్ లో ఒక గదిలో ఉంచి చక్కటి సేవలందించారు అక్కడి సిబ్బంది. ఆ హాస్పటల్ లో ‘ శ్రీ వాత్సన్’ అనే సర్జన్ ఉండేవాడు. ప్రకాష్ తో, నాతో చాలా ఫ్రెండ్లీగా ఉండేవాడు. చేతికి రెండు అంగుళాల గాయం అయింది ప్రకాష్ కి. ఆయనే సూచరింగ్ చేశాడు.

 

రామకృష్ణ గారికి స్కూటర్ సంగతి ఎలా చెప్పాలి అని దిగులు. వెస్పా స్కూటరు అది .బాగా దెబ్బతింది. ఆయన్ను ఫేస్ చేయాలంటే భయం వేసింది. ఆయన వచ్చి ప్రకాష్ ను పలకరించాడు. రేపు మెకానిక్ ను తీసుకు వెళ్లి స్కూటర్ తీసుకువస్తాను. రిపేర్ కూడా చేయిస్తాను అన్నాను. ఆయన మమ్మల్ని ఏమీ అనలేదు. ఫర్వాలేదు రిపేర్ నేనే చేయించుకుంటాను అని మాకు ధైర్యం చెప్పారు.

 

మర్నాడు ఉదయం రామకృష్ణ గారు చెప్పిన మెకానిక్ ను తీసుకుని ఆ ఊరు వెళ్లాను. ఒకరు తన ఇంటి ఆవరణలో స్కూటర్ని జాగ్రత్తగా అట్టిపెట్టారు. వెళ్లగానే గుర్తుపట్టి కుర్చీలో కూర్చోమన్నారు. చాలా మర్యాదగా మాట్లాడుతున్నారు. ప్రకాష్ ఎలా ఉన్నాడని అడిగారు. టీ ఇచ్చారు.

 

ఒక్కదానికీ నేను సమాధానం చెప్పలేకపోతున్నాను. దేహ భాష పట్టి వారు చెప్పేది కొంత అర్థం అవుతోంది. నాకు మలయాళం రాదు. నాకు అర్థమయ్యే తెలుగు, ఇంగ్లీషు వారికి రావు. తీసుకువెళ్లిన మెకానిక్ పరిస్థితి కూడా ఇంతే.

 

ఆ ఊరి వారు మాకు చేసిన సహాయానికి ఎలా ధన్యవాదాలు చెప్పాలో అర్థం కాక భోరున ఏడ్చాను. అదే నా కమ్యూనికేషన్. కాసేపు ఏడ్చి నమస్కారం పెట్టి ఆ స్కూటర్ని ఫాల్ఘాట్ కు తెచ్చుకున్నాం. ఈ సంఘటన గుర్తుకొచ్చిన ప్రతిసారీ నా కళ్లు చెమరుస్తాయి. ఇప్పుడు కూడా అదే పరిస్థితి.

 

ప్రకాష్ తమ్ముడు మోహన్ గుంటూరు నుండీ వచ్చాడు. 1st class లో టికెట్ బుక్ చేసి ట్రైన్ లో గుంటూరు పంపాము.


నేను త్రిచూర్ బయలుదేరాను.

 

*ఉప సంహారం*

‘మానవ విలువలు’ అంటే

- శ్రమిస్తూ జీవించడం
- నిజాయితీగా ఉండటం,
- తన పనులు తాను చేసుకోలేని వారికి ఉన్నంతలో సహాయం చేయడం,

అని ఒక పెద్దాయన చెప్పాడు.

 

సహాయం చేసిన వారికి ‘మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పడం’ కూడా మానవ విలువలలో భాగమేనని నా ఉద్దేశం.

 

ఎప్పటికైనా ఆ ‘చుంగమన్నం’ ఊరికి వెళ్లి ఆ ఊరి వారు మాకు చేసిన సహాయానికి థ్యాంక్స్ చెప్పాలని నాకు గట్టి కోరిక.

 

1982 లో మాకు అప్పుడు సహాయం చేసినవారందరూ ఇప్పుడు లేకపోవచ్చేమో గాని ఆ ఊరి పెద్దలనైనా కలవాలి.

 

ప్రకాష్, నేను ఇద్దరం వెళ్ళాలి అనుకున్నాము. కానీ ఇప్పటిదాకా కుదరలేదు.

 

కరోనా కాలం పూర్తి కాగానే మేమిద్దరం ఆ ఊరు వెళ్లాలి. నిస్వార్థంగా వారు చేసిన సహాయానికి నమస్కారం చెప్పి రావాలి.


వీలయితే అక్కడ Press కు కూడా మాకు జరిగిన ఉపకారం చెప్పాలి. నా బరువు దించుకోవాలి.

 

అప్పుడే మేం ఆ ఊరి ‘బాకీ’ తీర్చుకోగలం.

 

డి.ఆర్.కె
12.08.2020

 

ఆటోగ్రాఫ్ స్వీట్ మెమొరీస్

 

1983 లో పద్మను పెళ్లి చేసుకొన్న తరువాత హనీమూన్ కి ఊటీ వెళ్లాం. అప్పుడు కూడా ముందుగా పాల్ఘాట్ లోనే దిగాము.

 

కృష్ణన్స్ హాస్పటల్ ను, నేనూ ప్రకాష్ తిరిగిన ప్రదేశాలన్నింటినీ పద్మకు చూపించాను.

 

కృష్ణన్స్ హాస్పటల్ ముందు నేను ఉన్న ఫోటో పద్మ తీసిందే!

 

రామకృష్ణ గారి ఇంటికి వెళ్ళి ఆయన్ను కలిశాం.


ఆయన వాళ్ల పిల్లలు చాలా చక్కగా రిసీవ్ చేసుకున్నారు మమ్మల్ని.


వాళ్ల అమ్మాయి పేరు సుస్మిత. పేరుకు తగ్గట్టే చక్కటి నవ్వుగల ముఖం.

 

‘మలంబురా’ డ్యాం చూశాం. పాల్ఘాట్ లో ఒక హోటల్ లో తిన్న చికెన్ బిరియానీ ను పద్మ ఇప్పటికీ మరిచిపోదు.

 

పద్మను చాలా దూరం నడిపించి ఒక పోస్టు బాక్సు దగ్గరకు తీసుకువెళ్లి ‘పోస్టు డబ్బా’ చూపించాను.

 

‘ఎందుకు ఇక్కడకు తీసుకువచ్చావ్?’ అని అడిగింది.

 

ఇక్కడ ఉన్నప్పుడు మా ఫ్రెండ్స్ కు రాసిన ఉత్తరం ఈ పోస్టు డబ్బాలోనే వేశాను. నీకు చూపిద్దామని... అన్నాను.

 

నన్ను తినేట్లు చూసి తల పట్టుకుంది. ‘దీనికోసం ఇంత దూరం నడిపిస్తావా’ అంది.

 

కొద్దికాలం క్రితం ‘ ఆటోగ్రాఫ్ స్వీట్ మెమొరీస్’ అనే సినిమా వచ్చింది. ఆ సినిమా చూసినప్పటినుండే పద్మ ఇవన్నీ గుర్తు చేసి...

 

‘ బాబూ! నీ ఆటోగ్రాఫ్ స్వీట్ మెమొరీస్ ‘ ఇవి అని ఆట పట్టిస్తుంది.

 

నాకు , ప్రకాష్ కు జరిగిన యాక్సిడెంట్ అప్పట్లో చేదు అనుభవమే అయినా ఇప్పుడు స్వీట్ మెమొరీయే కదా 🙂

 

-డి ఆర్ కె