అక్కడ నీళ్లిస్తే పాలు ఇస్తారు....           (11-Aug-2020)


 గుర్తుకొస్తున్నాయి....19

కాలేజీ కబుర్లు


అక్కడ నీళ్లిస్తే పాలు ఇస్తారు

 

గుంటూరులో 1971-73 లో JKC కాలేజీ లో ఇంటర్మీడియట్, ఆ తరువాత MBBS, DGO గుంటూరు మెడికల్ కాలేజీ లో చదివాను. నా కాలేజీ చదువులన్నీ 1971 - 1985 మధ్య గుంటూరులోనే గడిచాయి.

 

గుంటూరు రైల్వే స్టేషన్ ప్రక్కనే రైల్వే క్వార్టర్స్ ఉండేవి.

 

నాకు ఇంటర్ లోనూ, మెడిసిన్ లోనూ క్లాస్ మేట్ అయిన ‘సూర్య ప్రకాష్’ ఆ క్వార్టర్స్ లోనే ఉండేవాడు. వాళ్ల నాన్నగారు రైల్వే స్టేషన్ లో Asst. Station master గా పనిచేసేవారు. నేను ఇంటర్ చదువుతున్నప్పటి నుండీ అప్పుడప్పుడు వాళ్ల ఇంటికి వెళ్తుండేవాడిని.

 

ఒకసారి సూర్య ప్రకాష్ ‘ మేం నీళ్లిస్తే మాకు పాలిస్తారు తెలుసా’ అని ఒక రకంగా నవ్వాడు.

 

నీళ్ళు ఆ కాలంలో “ఫ్రీ” గానే దొరికేవి.

 

‘ సీసాల్లో నీళ్లు,
ఆక్వా గార్డులు,
R.O. నీళ్లు ‘

ఇటువంటివేమీ తెలియవు.

 

తాగే నీళ్లయినా, వాడే నీళ్లయినా కొనుక్కోవడం అనేదే లేదు.

 

పాలకోసం ఉదయం 3 గంటలకే క్యూలలో నుంచునే రోజులు.

 

అటువంటిది నీళ్లిస్తే ఎంతో విలువైన పాలు ఇవ్వడం ఏమిటి? ఆశ్చర్యంగా అనిపించింది నాకు.

 

చుట్టుప్రక్కల ఊళ్ల నుండీ ఉదయం తెనాలి రైల్లో ‘క్యానుల్లోను, బిందెల్లోనూ’ పాలు తీసుకువచ్చేవారు. ఆ అమ్మకందారులందరూ ఈ రైల్వే క్వార్టర్స్ కు వచ్చేవారు. అక్కడ శుభ్రమైన తాగు నీరును ఈ పాల బిందెల్లో కలిపేవారు.

నీళ్లు ఇచ్చిన ఇంటి వారికి పాలు ఉచితంగా ఇచ్చేవారు!

 

వ్యాపారులందరూ ఈ కార్యక్రమాన్ని శ్రద్ధగా పూర్తిచేసి అప్పుడు హోటళ్లకు పాలను అమ్మడానికి బయలుదేరేవారు.

 

ఉదయాన్నే అక్కడకు వెళ్తే-
పాలవాళ్లు,
బిందెల్లో పాలు,
వాటిలో నీళ్లు పోయడం,
పాలల్లో నీళ్లు సరిపోతాయా లేదా అని’ చూపుడు వేలు’ పాలల్లో ముంచి పైకి లేపి వేలు నుండీ పడే పాల చుక్కలను పరిశీలించడం

 

- ఈ దృశ్యం అంతా వింతగా ఉండేది.

 

ప్రస్తుతం అక్కడ రైల్వే క్వార్టర్స్ లేవు.

 

మరి ఈ పాలు, నీళ్లు కార్యక్రమం ఏమైందో తెలీదు.

 

డి.ఆర్.కె.
11.08.2020.

 

అయితే మా ప్రకాష్ వాళ్ళ నాన్నగారు ఈ పద్ధతికి వ్యతిరేకం.

వీళ్ళ ఇంటి నుండీ ఎప్పుడూ నీళ్ళు ఇవ్వలేదు ,పాలు పోయించుకోనూలేదు.