నా జీవితంలో అద్భుతమైన Thrill పొందిన రోజు........           (10-Aug-2020)


 గుర్తుకొస్తున్నాయి.... 18

కాలేజీ కబుర్లు

 

నా జీవితంలో అద్భుతమైన Thrill పొందిన రోజు....

 

మేం MBBS మొదటి సంవత్సరం చదువుతున్నప్పుడు ప్రముఖ హేతువాది డా. A.T కోపూర్ గుంటూరు విచ్చేశారు. వేంకటేశ్వర విజ్ఞాన మందిరంలో ఆయన ఉపన్యాసాన్ని ఏర్పాటు చేశారు. ఆ హాలు ఆరోజు జనంతో కిటకిటలాడిపోయింది. మెడికల్ స్టూడెంట్స్ చాలా మందిమి ఆ కార్యక్రమానికి వెళ్లాము.

 

ఎందుకు హేతువాదిగా ఉండాలో చక్కటి అనుభవపూర్వకమైన ఉదాహరణలతో ప్రసంగించారాయన. మాలో కొంతమందిమి అప్పటికే ఆయన రాసిన వ్యాసాలను చదివాం.

 

ఆయన ఉపన్యాసం విన్న తర్వాత నా ఆలోచనా విధానానికి ఒక స్పష్టత వచ్చింది. పూర్తిగా హేతువాదిగా మారిపోయాను. మా వయస్సు వాళ్ళలో ఎంతోమందిపై ఆయన ప్రభావం ఉంది.

 

ఆయన ఉపన్యాసం పూర్తయిన తర్వాత ఆయనతో పాటు వచ్చిన ప్రొఫెసర్ మలాయత్ ‘ హిప్నోటిజం’ కార్యక్రమం మొదలు పెట్టాడు. కొంతమందిని స్టేజ్ మీదకు పిలిచాడు. వెళ్ళిన వాళ్ళలో మా క్లాస్మేట్ ‘రాధాకృష్ణ’ కూడా ఉన్నాడు.

 

కళ్ళు మూయించి కాసేపు ఏవో సజషన్స్ ఇచ్చాడు. ఇద్దరు ముగ్గురు తప్ప అందరూ హిప్నోటైజ్ అయ్యారు. అవ్వని వాళ్లను క్రిందకు పంపేశాడు.

 

చూస్తున్న వాళ్లందర్నీ అస్సలు మాట్లాడవద్దు, చప్పట్లు కొట్టద్దు, శబ్దం చేస్తే వాళ్లు నిద్ర లేస్తారు. అని ఒకటికి పది సార్లు మాకు అప్పీల్ చేశాడు.

 

హిప్నోటైజ్ అయ్యిన వాళ్ళతో రకరకాల ఫీట్లు చేయించాడు. అందరం ఆసక్తి గా చూస్తున్నాం.


You are in a railway platform అని ఒక సజషన్ ఇస్తే ఒకతను
‘ వేప పుల్లా, వేప పుల్లా ‘ అని వేప పుల్లలు అమ్మే వానిలాగా ప్రవర్తించాడు. ఆ కాలంలో రైల్వే ప్లాట్ ఫాంలపై ఉదయం పూట పళ్ళు తోముకోవటానికి వేప పుల్లలు అమ్మేవారు.

 

ఇదంతా చాలా సరదాగా ఉంది మాకు.

 

*మరొక అద్భుతం జరిగింది*

 

దయచేసి నిశ్శబ్దంగా ఉండండి. మీరు ఏ మాత్రం శబ్దం చేసినా హిప్నోటైజ్ అయిన వాళ్లు లెగుస్తారు అని మళ్లీ మళ్లీ అభ్యర్ధించాడు.

 

You are in a paris
You are in a paris
You are in a paris

You are in a night club
You are in a night club
You are in a night club

 

ఇలా సజషన్లు ఇస్తూ ఒక్కసారిగా పెద్ద సౌండ్ తో మ్యూజిక్ ఆన్ చేశాడు.

 

అంతే! స్టేజ్ మీద ఉన్న వారంతా డాన్స్ చేయడం మొదలు పెట్టారు. ఇద్దరిద్దర్ని కలిపాడు. ఇంగ్లీష్ సినిమా లో హీరో హీరోయిన్లు డాన్స్ చేస్తున్నట్లుగా వాళ్లు చక్కగా డాన్స్ చేస్తున్నారు. ఇందులో మా క్లాస్ మేట్ రాధాకృష్ణ కూడా ఉన్నాడు.


మా ఆనంద్రోద్రేకాన్ని అణుచుకోవడం దుర్భరం అయింది.

 

చప్పట్లు కొట్టకుండా, ఈలలు వేయకుండా, అరవకుండా ఉండటం చాలా కష్టం అయింది.

 

ఈ హిప్నోటిజం కార్యక్రమం పూర్తయిన తరువాత అరుపులు, కేకలు, ఈలలు, చప్పట్లతో హాలు దద్దరిల్లిపోయింది.

 

నా జీవితంలోఅత్యంత థ్రిల్ పొందిన సంఘటనలలో ఇది ఒకటి.

 

డి. ఆర్.కె
10.08.2020.

 

మరో thrill ఇంకోసారి ....