నేను – నా ఆర్మీ ఉద్యోగం.......           (07-Aug-2020)


 గుర్తుకొస్తున్నాయి...15

కాలేజీ కబుర్లు

 

నేను – నా ఆర్మీ ఉద్యోగం...

 

నాకు మిలటరీలో ఉద్యోగం చేయాలనే కోరిక ఉండేది. అప్పట్లో Armed forces లోని మెడికల్ విభాగంలో ఒక తెలుగు డాక్టరే అందరికంటే పెద్ద అధికారిగా ఉండేవాడు. ఆయన పేరు భాస్కరరావు గానీ, భాస్కర్ రెడ్డి గానీ అని గుర్తు (Director general of…). మిలటరీ లోకి డాక్టర్లు ఎక్కువగా రావాలని అప్పీల్ చేసేవాడు. Armed forces లో చేరాలని Air wing లో ఐతే ఇంకా బాగుంటుందని మా కాలేజీలో కొద్ది మందికి ఉండేది.

 

మిలటరీలో ఉద్యోగాలు రిక్రూట్ చేయడానికి SSC (Short service commission) ఆధ్వర్యంలో పరీక్షలు నిర్వహించేవారు. ఆ పరీక్షలో సెలెక్ట్ ఐతే మన ఆప్షన్ ను బట్టి 5 సంవత్సరాలు కానీ పర్మనెంట్ సర్వీస్ క్రింద 20 సంవత్సరాలు కానీ ఉద్యోగం చెయ్యాలి.

 

మా సర్జరీ ప్రొఫెసర్ డా. E.N.B శర్మ గారిని కలిసి మిలటరీ ఉద్యోగంలో చేరాలనుకుంటున్నానని చెప్పాను. ఆయన సంతోషపడ్డారు. చైనా యుద్ధసమయంలో ఆయన కొంతకాలం మిలటరీ లో పని చేశారు.

 

‘సర్ నాకో అనుమానం’ అన్నాను.

 

‘అడుగు ప్రసాద్’ అన్నారాయన.

 

‘మిలటరీ లో చేరితే కచ్చితంగా డ్రింక్ చేయాలా? నేను డ్రింక్ చెయ్యను సార్’ అని అన్నాను.

 

‘లేదు ప్రసాద్ మిలటరీలో కూడా చాలా మంది డ్రింక్ చేయరు. నేనూ డ్రింక్ చేసే వాణ్ణి కాదు. అలవాటు లేని వాళ్ళని అక్కడ ఎవ్వరూ బలవంత పెట్టరు కూడా’ అన్నారు.

 

హమ్మయ్య అనుకున్నాను.

 

థీరీ పరీక్షలు ‘మిలటరీ హాస్పిటల్ మద్రాసు’లో రాశాం. అవి పాసయ్యిన తర్వాత క్లినిక్స్, ఓరల్స్ ఢిల్లీ మిలటరీ హాస్పిటల్ లో జరిగాయి. బాగానే చేశాం.

 


ఇంటర్వ్యూ లో ‘ఏం చేస్తున్నావిప్పుడు?’ అని అడిగారు.

 

'సర్జరీ లో సీనియర్ హౌస్ సర్జన్సీ చేస్తున్నాను' అని చెప్పాను.

 

'ఎంత లంచం ఇచ్చి చేరావు?' అని ఒకరకంగా నవ్వారు.

 

ఆంధ్రప్రదేశ్ లో ఆ కాలంలో ఉన్న చెన్నారెడ్డి ప్రభుత్వం లంచగొండి ప్రభుత్వంగా దేశంలో ప్రఖ్యాతి గాంచింది.

 

సీనియర్ హౌస్ సర్జన్సీ అంటే వాళ్ల దృష్టిలో P.G first year అని.


P.G సీటు తెచ్చుకున్నాన౦టే లంచం ఇచ్చి తెచ్చుకున్నట్లే అని ఆయన ఉద్దేశ్యం.

 

మన దగ్గర సీనియర్ హౌస్ సర్జన్సీ కి P.G.కి సంబంధం లేదు. M.B.B.S అయిన తర్వాత అనుభవం కోసం మెడికల్ కాలేజీ ఆసుపత్రులలో 6 నెలలు సీనియర్ హౌస్ సర్జన్సీ చేయవచ్చు. దీనికి stipend ఏమీ ఉండదు. P.G లో సీటు వచ్చే వరకు ఖాళీగా ఉండడం ఎందుకని నేను సర్జరీ లో S4 యూనిట్ లో సీనియర్ హౌస్ సర్జన్సీ చేరాను.

 

‘P.G entrance మా ఆంధ్రప్రదేశ్ లో పక్కాగా జరుగుతుంది. అస్సలు కరప్షన్ ఉండదు’ అని చెప్పాను.

‘is it?’ అని ఆశ్చర్యపోయాడాయన.


ఇంటర్వ్యూ పూర్తి చేసి గుంటూరు వచ్చేశాం.

 

ఆ తర్వాత Army లో select అయినట్లు congratulate చేస్తూ official letter వచ్చింది.

 

Police enquiry లో భాగంగా ఒక పోలీసు కాన్ స్టేబుల్ వచ్చి 11/A లో నాతో మాట్లాడి వెళ్లాడు.

 

మిలటరీలో అప్పటికే మా క్లాస్ మేట్ ధీరానంద్ army లోను, మా జూనియర్ శ్రీనివాస మూర్తి Air wing లోనూ జేరి సికిందరాబాదు మిలటరీ హాస్పిటల్ లో ఉన్నారు. వాళ్ళతో మాట్లాడదామని సికిందరాబాదు MH కు వెళ్లాను.

 

లోపలకు వెళ్లి ఒకాయన్ని “డా. ధీరానంద్ ఎక్కడ ఉంటారు?” అని అడిగాను.

 

‘డా. ధీరానంద్’ అని ఉచ్ఛరించి నా వంక అదో రకంగా చూశాడు.

 

నేనేం తప్పు మాట్లాడానో అర్థం కాలేదు.

 

తానే మళ్ళీ ' ఓ! కెప్టెన్ ధీరానంద్’ అని దారి చూపించాడు. మిలటరీ వాళ్లు ర్యాంకులతో తప్పితే డాక్టర్ అని పిలుచుకోరని అర్థమయింది. అలా ధీరానంద్ ని కలుసుకున్నాను. కాస్సేపు మాట్లాడి వెళ్లిపోవాలని అనుకున్నాను గాని ఆ రోజు అక్కడే ఉండమని గట్టిగా అనడంతో ఒకరోజు తనతో గడిపే అవకాశం వచ్చింది.

 

తన రూంలో ‘మెస్ లో ప్రవర్తించాల్సిన మర్యాదలు’ ఉన్న పుస్తకం ఉంది. దాన్ని చదివిన తర్వాత ‘బాబోయ్ మీ మెస్ లో నేను భోం చేయనయ్యా. ఈ పద్ధతులన్నీ సరిగ్గా పాటించలేనేమోనని’ భయంగా ఉంది అన్నాను. ‘నువ్వు గెస్ట్ వి. ఫ్రీ గా ఉండు ఏం ఫర్వాలేదు’ అని మెస్ కు తీసుకువెళ్లాడు. భోం చేశాం.

 

రెండవ రోజు Air force hospital కు వెళ్లాను. శ్రీనివాసమూర్తిని కలుసుకున్నాను. తనని ‘ఫ్లైట్ లెఫ్ట్ నెంట్ P.S. మూర్తి’ అని పిలుస్తున్నారక్కడ. నేను వచ్చినందుకు సంతోషపడ్డాడు. ఆ కాలంలో సెల్ ఫోన్లు లేవు. ల్యాండ్ లైన్ నెంబర్లు కూడా తెలీదు. సరాసరి వెళ్లి కలవడమే! శ్రీనివాస్ మాత్రం మిలటరీలో జేరడాన్ని encourage చేయలేదు.

 

‘పర్మినెంట్ సర్వీస్ అయితే ఫర్వాలేదు కాని షార్ట్ సర్వీస్ కమీషన్ పరీక్ష రాసి వచ్చిన వాళ్లు 5 సం॥ తర్వాత రిటైర్ మెంటే కదా. ఇక్కడ అంతా ఆరోగ్యంగా ఉంటారు. స్పెషలిస్టులకే professional satisfaction ఉంటుంది. MBBS డాక్టర్లు గా mess, hygiene maintenance చూసుకోవడమే మన పని. Subject కూడా మర్చిపోతాం’ అని చెప్పాడు.

 

ధీరానంద్ ఆర్మీ లోనూ, శ్రీనివాసమూర్తి ఎయిర్ వింగ్ లోనూ పూర్తిగా సర్వీస్ చేసి రిటైర్ అయ్యారు. మా క్లాస్ మేట్స్ బి. రామకృష్ణ, సుధాకర్ బాబు కూడా మిలటరీ లో చేరారు. కాకపోతే నేను వెళ్లినప్పుడు సికిందరాబాదు మిలటరీ హాస్పిటల్ లో లేరు.

 

ఇదంతా 1982 లో సంగతి. నేను మిలిటరీ ఉద్యోగ పరీక్షలో సెలెక్ట్ అయ్యాను అని వారు పంపిన ఉత్తరం నా దగ్గర ఉండాలి. ఇంకా నాకు Posting ఇవ్వలేదు.

 

‘పోలీస్ ఎంక్వైరీలో బహుశా నువ్వు దేశానికి ప్రమాదకరమైన వ్యక్తి అని రాశారేమో!’ అని ఒక మిత్రుడు అన్నాడు.

 

నేను ఫాలో అప్ చేయలేదు. వారూ పోస్టింగూ ఇవ్వలేదు.

 

ఇదండీ నా మిలటరీ ఉద్యోగం కథ. 😆

 

బి. రామకృష్ణ ఢిల్లీలో ఉన్నాడు. మొన్ననే ఫోన్ చేశాడు.

 

వైజాగ్ లో స్ధిరపడిన సుధాకర్ బాబు అందరితో రెగ్యులర్ గా టచ్ లోనే ఉన్నాడు.

 

శ్రీనివాస మూర్తి ఎక్కడ ఉన్నాడో తెలియదు. కానీ ఎప్పటికైనా కలవగలమనే నమ్మకం ఉంది.

 

కల్నల్ ధీరానంద్ మాత్రం ఎప్పటికీ కలువలేనంత దూరం వెళ్లిపోయాడు.

 

- డి.ఆర్.కె
07.08.2020.