వద్దు... వద్దు. నా గురించి తగాదా పడకండి.....           (06-Aug-2020)


 గుర్తుకొస్తున్నాయి...14

కాలేజీ రోజులు.

 

వద్దు... వద్దు. నా గురించి తగాదా పడకండి.

 

ఒకసారి మా కాలేజీ డే Open Air Theater లో జరుగుతోంది. స్టేజీ మీద ప్రోగ్రాంలు జరుగుతున్నాయి. మా ఫ్రెండ్స్ లో చాలా మందిమి జనం వెనుక నుంచొని చూస్తున్నాం.


మా సీనియర్ 'నాగార్జున రెడ్డి' వచ్చి ‘డి ఆర్ కె నేను నా రెండు చేతులను అడుగు దూరంలో ఉంచుతాను. ఆ ఖాళీలో నువ్వు కళ్ళు మూసుకొని నా చేతులు తగలకుండా పాతిక సార్లు పైకి కిందకు నీ చేతిని ఆడించగలవా?’ అని అడిగాడు.

 

‘ఆ, ఇదేం కష్టం’ అన్నాను.

 

‘నువ్వు కళ్ళు తెరవకూడదు మరి’ అన్నాడు

 

ఇంతలో 'గోపీచంద్ 'వచ్చాడు.

 

‘ఏంటయ్యా DRK ని అనుమానిస్తున్నావా!’ అన్నాడు గట్టిగా.

 

‘కళ్ళు తెరిచి ఎవరైనా చేస్తారు. అందుకే మూసుకోమన్నాను’ అన్నాడు నాగార్జున రెడ్డి

‘డి ఆర్ కె చాలా సిన్సియర్. ఒకసారి మాట ఇచ్చాడంటే అంతే!’ అని గోపీచంద్ రెచ్చిపోయి మాట్లాడాడు.

 

వారిద్దరికీ మాటామాటా పెరిగింది.

 

గట్టి గట్టిగా పోట్లాడుకుంటున్నారు.

 

నా గురించి, నా నిజాయితీ గురించి, నాకు బాగా కావలసిన ఇద్దరు ఫ్రెండ్స్ పోట్లాడుకోవడం embarrassing గా ఉంది.

 

నేను వాళ్ళిద్దరి మధ్యకు వెళ్ళి ‘ఇదిగో నా గురించి తగదా పడకండి. నేను చేస్తాగా’ అని విడదీశాను.

 

ఈ గొడవ జరుగుతుంటే అనేకమంది పోగయ్యారు. అందరూ ఆసక్తిగా గమనిస్తున్నారు మమ్మల్ని.

 

‘ఎవ్వరూ మాట్లాడకూడదు. DRK ని disturb చేయగూడదు’ అని అందరికీ వార్నింగ్ ఇచ్చాడు నాగార్జున రెడ్డి.

నాగార్జున రెడ్డి తన రెండు చేతులను ప్రక్క ప్రక్కన ఒక అడుగు దూరంగా పెట్టాడు.

 

ఇక ఆట మొదలయ్యింది.

 

నేను కళ్ళు మూసుకొని నా చేతిని పైకి క్రిందకీ ఆడిస్తున్నాను.

 

నాగార్జున రెడ్డి వార్నింగ్ తో ఎవ్వరూ మాట్లాడడం లేదు. Pindrop సైలెన్స్.

 

ఒక్కసారి కూడా తగలకుండా నా టాస్క్ పూర్తి చేసి విజయ గర్వంతో కళ్ళు తెరిచాను.

 

ఆశ్చర్యపోవడం నా వంతు అయ్యింది.


నా కళ్ల ముందు ఎవ్వరూ లేరు. చుట్టూ తిరిగి చూశాను. ఒక్కళ్ళు కూడా లేరు.

 

అంటే ఇప్పటిదాగా నేను ఒక్కణ్ణే కళ్ళు మూసుకొని నా చేతిని పైకి కిందకి గాలిలో ఆడిస్తూ ఉన్నాను పిచ్చివాడిలాగా....


స్టన్ అయి అలానే చూస్తూ ఉంటే ఎక్కడో దూరంగా ఫ్రెండ్స్ అందరూ నవ్వుతూ కనిపించారు.

 

అర్ధం అయింది. ఇది నన్ను ‘బకరా ‘చేసి నాగార్జునరెడ్డి, గోపీచంద్ పోట్లాడుకుంటున్నట్లుగా ఆడిన ఒక నాటకం అని.

 

నేనూ నవ్వక తప్పలేదు.

 

ఆ తర్వాత ఒక సినిమాలో ఇటువంటి సంఘటనను చూపించారు.

 

నాగార్జునరెడ్డి, గోపీచంద్ లు ఎక్కడున్నా, అప్పుడైనా, ఇప్పుడైనా సందడే సందడి 😆

 

- డి.ఆర్.కె
06.08.2020.