మరోసారి జలగండం........           (05-Aug-2020)


 గుర్తుకొస్తున్నాయి...13

కాలేజీ కబుర్లు

 

మరోసారి జలగండం....

 

1981లో నాగార్జునా యూనివర్సిటీ వారు ప్రకాశం జిల్లా కారంపూడిలో భారీ NSS Camp ను నిర్వహించారు. కొన్ని వందల మంది విద్యార్ధులను తీసుకువెళ్లారు. వారికి వైద్య సౌకర్యం కోసం నలుగురు హౌస్ సర్జన్లం కూడా వెళ్లాం. నేను మా జూనియర్లు ‘సత్యభాను, శివప్రసాదు, సుబ్బారావు’ లు ఈ టీంలో ఉన్నాం.

 

సత్యభాను బాగా సరదా చేసేవాడు. గట్టిగా నవ్వుతుండేవాడు. చాలా దూరానికి కూడా ఆ నవ్వు వినపడేది. తన జీవితంలోని ఒక సంఘటన చెప్పాడు. తనకు పుట్టుకతోనే గుండెలో రంధ్రం ఉందట(ASD అని గుర్తు). అది పూడ్చడానికి Open Heart surgery చేయించుకోవాలి.

 

ఆ కాలంలో పెరంబూరు రైల్వే హాస్పిటల్ లోనూ, బొంబాయిలోనూ, ఢిల్లీ లోని AIIMS లాంటి కొద్ది చోట్ల మాత్రమే Open Heart సర్జరీ లు జరిగేవి. MBBS చదువుతున్నప్పుడు AIIMS లో చూపించుకుంటే ఆపరేషన్ కు పోస్ట్ చేశారట. ఇటువంటి గుండె ఆపరేషన్లు చేసే ఆసుపత్రులు తక్కువగా ఉండడంతో waiting period ఎక్కువగా ఉండేది. కొంతమంది తమ ఆపరేషన్ తేదీ వచ్చే లోపలే ఏదో ఒక కాంప్లికేషన్ తో చనిపోతూ ఉండేవారు.

 

ముగ్గురు చనిపోయారు :

 

సత్యభాను AIIMS లో చేరిన తర్వాత తనకంటే ముందు ఇదే ఆపరేషను చేయించుకొన్న వారు ముగ్గురు ఆస్పత్రిలోనే చనిపోయారట. సత్యభానుకు వాయిదా వేద్దామని సర్జన్స్ అనుకొంటే వద్దు చేసేయ్యమన్నాడట. ఆపరేషన్ థియేటర్ కు తీసుకు వెళ్లబోయే ముందు సర్జన్ వచ్చి “భగవంతుణ్ణి ప్రార్థించుకో” అన్నారట. ‘నాకు దేవుడిపై నమ్మకం లేదు. మీకు అవసరం అయితే ప్రార్థించుకోండి’ అని తన సహజ ధోరణిలో నవ్వాడట. అంతా సవ్యంగా జరిగి ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యాడట.

 

గజ ఈతగాణ్ణి :

 

నాగార్జునసాగర్ కుడి కాల్వ' కారంపూడి' ప్రక్కగా వెళ్తుండేది. క్యాంపు పూర్తవబోయే రెండు రోజుల ముందు నేను, సత్యభాను ఈతకు బయలుదేరాం. చాలా వెడల్పయిన కాల్వ అది. గతంలో అమరావతి వద్ద కృష్ణానదిలో కొట్టుకుపోయిన సంఘటన గుర్తున్నా నేను ‘గజ ఈతగాడినని’ నా మీద నాకు గట్టి నమ్మకం. సత్యభాను, నేను అవతలి ఒడ్డుకు వెళ్లడానికి ఈదటం మొదలుపెట్టాం.

 

తప్పుడు నిర్ణయం :

 

సత్యభాను కొద్ది దూరమే ఈది వెనక్కు తిరిగి గట్టు ఎక్కేశాడు. నేను అవతలి ఒడ్డుకు ఈదాలనే పట్టుదలతో ఉన్నాను. ప్రవాహ ఉరవడి ఎక్కువగా ఉంది. అయినా ఈదుతూనే ఉన్నాను. కాసేపు ఈదిన తర్వాత ఎంత దూరం వచ్చానో అని వెనక్కి తిరిగి చూశాను. చుట్టూ నీళ్ళు. రెండు గట్లూ ఎంతో దూరంలో ఉన్నాయనిపించింది. ఒక నది మధ్యలో ఉన్నట్లుంది. ఆవలి ఒడ్డు వరకు వెళ్ళలేను అనుకొని వెనక్కి తిరిగాను. ఇది నా తప్పుడు నిర్ణయం. 60% దూరం వెళ్లాను. ఆవలి ఒడ్డుకు వెళ్ళడమే దగ్గర. కానీ నాకు ఆ విషయం అప్పుడు తెలియలేదు.

 

చనిపోవడం ఖాయం :

 

వెనక్కి ఈదుతుంటే నా శక్తి అయిపోవచ్చింది. ఇంకా ఒడ్డు దూరంగానే ఉంది. నెమ్మదిగా మునుగుతూ ఉన్నాను. తలను నీళ్ల పైకి ఉంచడానికి శక్తి చాలడం లేదు. గడ్డం వరకూ మునిగిపోయాను. ఆఖరి ATP అణువు కూడా అయిపోతోంది అనిపించింది. ‘ఇక చనిపోవడం ఖాయం’ అని డిక్లేర్ చేసుకున్నాను. వార్డు మేట్స్, ఫ్రెండ్స్ తో సహా ఎంతోమంది గుర్తుకువచ్చారు. మూతి వరకూ మునిగి ఉన్నాను. మరో అంగుళం మునిగితే నా జీవిత ప్రయాణం ముగిసినట్లే!

 

బోడి సలహా :

 

ఆ సమయంలో ఒక ఆశ కనిపించింది. ఒడ్డున లెట్రిన్ కు వెళ్ళిన ఒకతను కాలవ నీళ్ళతో కడుక్కుంటున్నాడు. నాకు అడగటానికి మొహమాటంగా అనిపించినా ఆ.....ఆ... అని సహాయం చేయమని పిలిచాను. అతను నింపాదిగా కడుక్కుని ‘ఆ। రా। వచ్చేయ్’ అని వెళ్లి పోయాడు. ‘బోడి సలహా’ అంటే ఏమిటో ఆ క్షణంలో అర్థం అయింది.

 

ఆ ఆశ కూడా పోయింది. చావు తప్పదు. ముక్కును నీటి ఉపరితలం పైన అట్టిపెట్టే శక్తి అయిపోయింది. నేల ఏమన్నా తగులుతుందేమోనని ఆశతో ఆఖరి ప్రయత్నంగా కాలు క్రిందకు ఆన్చాను. కాలుకు నేల అందలేదు సరికదా ముక్కులోకి నీళ్లు వెళ్లి భయంకరమైన తలనొప్పి వచ్చింది.

 

బ్రతకడానికి చేసిన ప్రయత్నంలో నీళ్లలో కొట్టుకుంటుంటే ఒడ్డుకు 4 అడుగుల దూరంలోకి వచ్చాను. ఒడ్డుకు చేతులు ఆనాయి. అలాగే సగం నీళ్ళల్లో పడుకున్నాను. బయలుదేరిన చోటునుంచి దాదాపు ఫర్లాంగు ఆవల ఉన్నాను నేను. నీటి ఉరవడి అంత ఉంది.

 

సత్యభాను వచ్చి నన్ను ఒడ్డుపైకి లాగి పడుకోపెట్టాడు. అరగంట వరకూ అలానే నేల మీద పడుకొని ఉన్నాను. “నీళ్ల స్పీడును గమనించి నేను ఈదలేను అని అర్థమయ్యి వెనక్కు వచ్చేశాను. నువ్వు అలాగే ఈదుకుంటూ వెళ్లిపోయావు” అన్నాడు. ఆ కాలవ దగ్గర్నుండీ మా గదికి నడిచి వెళ్లడం చాలా కష్టమయ్యింది. ఏ మాత్రం ఓపిక లేదుకదా! తర్వాత రెండు రోజులూ క్యాంపు లో రూమ్ లో పడుకునే ఉన్నాను. దగ్గు మొదలయ్యింది.

 

గుంటూరు వచ్చిన తర్వాత కూడా 6 వారాలకు కానీ ఆ దగ్గు తగ్గలేదు. నీరసం, ఒళ్ళు నొప్పులు పది రోజులకు తగ్గాయి.

 

మొత్తానికి మరో జలగండాన్ని తప్పించుకొన్నాను. సత్యభాను హౌస్ సర్జన్సీ అవగానే US వెళ్ళిపోయాడు. ఆ తరువాత మళ్ళీ మాట్లాడటం కుదరలేదు. సుబ్బారావు ఎనస్ధీషియా P.G చేసి ఆస్ట్రేలియా లో పని చేస్తున్నాడు. శివ ప్రసాద్ విజయ నగరంలో ప్రాక్టీసు చేస్తున్నాడు. బాగా పాపులర్ డాక్టర్. ఆంధ్రప్రదేశ్ IMA లీడర్. రాజకీయాలలో కూడా ఉత్సాహంగా పాల్గొంటున్నాడు.

 

ఆఖరి పలుకు :

 

ఈదడంలో నాటెక్నికల్ పొరబాటుని ఒక మిత్రుడు వివరించాడు. సరైన టెక్నిక్ తో ఈదితే ఇంత అలుపు వచ్చేది కాదు, ఈ ప్రమాదం జరిగి ఉండేది కాదని అర్ధమయ్యేట్లు చెప్పాడు.

 

ఈ కధ అంతా విన్న మరో మిత్రుడు ‘అదేంటి ఆ సమయంలో నీకు దేవుడు గుర్తు రాలేదా, మొక్కుకోవాలని అనిపించలేదా’ అని అడిగాడు. అంతక ముందు కొన్ని సంవత్సరాల క్రితమే ప్రకృతిని తప్పితే దేవుణ్ణి నమ్మడం మానేశాను. ఐతే దేవుడు ఉన్నాడు - లేడు అనే వాదనలకి వెళ్ళను. ఆ వాదనల వల్ల ఉపయోగం లేదని నా అభిప్రాయం.

 

చావబోతున్నాను అని నిర్ణయించుకొన్న తరువాత కూడా నాకు దేవుడు గుర్తు రాకపోవడం ‘నాలో ఉన్న భౌతిక వాది’ సంతోషపడ్డాడు.


......... .....

 

చావబోయి బ్రతికిన మరో సంఘటన ఇంకోసారి చెప్పుకుందాం.....

 

- డి.ఆర్.కె.
05.08.2020