మాధవరావు, సలీంలకు సెండాఫ్- మా బొంబాయి యాత్ర....           (04-Aug-2020)


 గుర్తుకొస్తున్నాయి.......12

కాలేజీ రోజులు

 

మాధవరావు, సలీంలకు సెండాఫ్-
మా బొంబాయి యాత్ర

 

హౌస్ సర్జన్సీ అవగానే ఎక్కువ మంది P.G entrance కు తయారయ్యేవారు. కొంత మంది Job కోసం ప్రయత్నించేవారు. ‘రోజ్ గార్ సమాచార్’ పత్రిక ఒకటి కొనుక్కొని అందులో డాక్టర్ల ఉద్యోగాల ప్రకటనలు ఆసక్తిగా చూసేవాళ్లం. టీ ఎస్టేట్స్ లోనో, ఏదన్నా ఫాక్టరీ లోనో MBBS డాక్టర్లకు ఒకటో, అరో ఉద్యోగాలు ఉండేవి. అవి కూడా వేరే రాష్ట్రాలలో. ఆ ఉద్యోగాలలో జీతం ఎంత ఆఫర్ చేశారో తెలుసుకుని సంతోష పడేవాళ్లం. APPSC, UPSC పరీక్షల ప్రకటనల కోసం ఎదురు చూసే వాళ్ళం.

 

మన రాష్ట్రంలో ప్రైవేటు ఉద్యోగాలు అస్సలు ఉండేవి కాదు. ఏ హాస్పిటలూ జూనియర్ డాక్టర్లకు జీతానికి ఉద్యోగం ఇచ్చేవారు కాదు. కొంతమంది కేరళ వెళ్లి ఉద్యోగాలు చేసేవారు. అక్కడ కనీసం వెయ్యి రూపాయల జీతం వచ్చేది. మలయాళం బాగా నేర్చుకొంటే భోజనం పెట్టి, గది ఇచ్చి 1500 రూ. నుండి 1700రూ. వరకు కూడా ఇచ్చేవారు. ఆ కాలంలో వెయ్యి రూపాయలే మంచి జీతం. 1700 రూ. అంటే ఏం చేసుకోవాలో తెలియనంత డబ్బు అన్నమాట.

 

మా క్లాస్మేట్ మాధవరావు, మా జూనియర్ సలీం కలిసి ‘జాంబియా’ దేశంలో ఉద్యోగానికి ఏర్పాట్లు చేసుకున్నారు. బొంబాయి లో విమానం ఎక్కాలి. వారిద్దరికీ సెండాఫ్ ఇవ్వడానికి నేను, రుద్ర, సూర్య ప్రకాష్, మరో ముగ్గురుమి సిద్ధమయ్యాం. సలీం వాళ్ళ నాన్న గారు కూడా మాతో కలిసి బయలుదేరారు. సలీం వేరే దేశం వెళ్ళడం వాళ్ళ నాన్న గారికి సుతరామూ ఇష్టం లేదు. కొడుకు మాట కాదనలేక ఒప్పుకున్నారు. కానీ జాంబియాలో ఉద్యోగం రాకూడదని మనస్ఫూర్తిగా అల్లాను ప్రార్థించేవారు. ఆయనతో కలిసి ఆ ప్రయాణం చేయడం మాకొక మంచి అనుభవం.

 

ఫాస్ట్ సిటీ :

 

మొట్ట మొదటగా బొంబాయిలో ‘దాదర్’ స్టేషన్ లో దిగాం. ఒక్కొక్క local train నుండీ వేలాదిమంది జనం దిగడం, చకచకా నడుచుకుంటూ వెళ్ళిపోవడం, ఒక్క నిమిషంలో స్టేషన్ మొత్తం ఖాళీ అయిపోవడం మాకు విచిత్రంగా ఉంది. మగవాళ్ళు గొడుగును మెడ వెనుక కాలర్ కు తగిలించుకుని వెళుతుండేవారు. ‘మారియో’ కార్టూన్లు గుర్తుకువచ్చాయి. బాంబే ‘ఫాస్ట్ సిటీ’ ఇక్కడ అంతా ఉరుకులు పరుగులే అని సినిమా యాక్టర్ల స్టేట్ మెంట్లు చదువుతూ ఉండేవాళ్ళం. కానీ దాదర్ స్టేషన్ లో దిగే వరకూ ‘ఫాస్ట్ సిటీ’ అంటే ఏమిటో మాకు అర్ధం కాలేదు. ఒక్క అరగంట స్టేషన్లోనే కూర్చొని వచ్చేపోయే లోకల్ ట్రైన్లనూ, జనాన్ని చూస్తూ గడిపాం. అదో పెద్ద వింత మాకప్పుడు.

 

కసాటా ఐస్ క్రీం :

 

మొదటిరోజు మాధవరావు వాళ్ళ అన్న గారి ఇంటికి వెళ్లాం. ఆయన బాంబే లోనే ఉద్యోగం చేసేవారు. ఆయన మాకు ‘కసాటా’ అనే ఐస్ క్రీం పెట్టించారు. వెనిల్లా, టూటీ ఫ్రూటీ తప్పితే నాకు వేరే ఐస్ క్రీం ఉంటుందని కూడా అప్పటి దాకా తెలీదు. కసాటా ఖరీదెక్కువ అని కూడా తెలుసుకున్నాం!

 

ఫ్లాట్ ఫాం టికెట్ :

 

మాధవరావు, సలీం లను విమానం ఎక్కించాం. సలీం వాళ్ళ నాన్నగారు తిరిగి గుంటూరు వెళ్ళిపోయారు. ఆయన్ను రైలు ఎక్కించడానికి బోంబే V.T (విక్టోరియా టర్మినస్ – ఇప్పుడు ఛత్రపతి శివాజీ టర్మినస్) రైల్వే స్టేషన్ కు వెళ్లాం. పుష్కరాల్లో ఉన్నట్టు ఉన్నారు జనం ఆ ప్రాంతమంతా.

 

ఆయన్ను రైలు ఎక్కించి తిరిగి వస్తుంటే నా జబ్బ పట్టుకుని ఎవరో లాక్కెళ్తున్నారు. ఇంకా మాలో ఇద్దరు ముగ్గుర్ని కూడా పట్టుకున్నారు. మాతో రండి అని మా 6 గురిని ఒక రూంలోకి తీసుకువెళ్లి ‘ఫ్లాట్ ఫాం టికెట్ ఏది?’ అని అడిగారు. మేం ఒకళ్ల మొఖం ఒకళ్ళు చూసుకొని “ఇది ఫ్లాట్ ఫామా?” అని అడిగాం. పక్కనే రోడ్డు మీద ఆటోలు, కార్లు తిరుగుతున్నాయి. గేటు ఎక్కడా లేదు కదా “ఇది ఫ్లాట్ ఫాం ఏమిటి?” అని మా మదిలో ఉన్న ప్రశ్న. అదిగో అక్కడ్నుంచి ఫ్లాట్ ఫాం క్రిందే లెక్క అని ఒక పాయింట్ చూపించాడు. మన లెక్కలో అది ఫ్లాట్ ఫాం కానే కాదు.

 

ఒకొక్కళ్ళకి ప్లాట్ ఫాం టికెట్టు కాక 10 రూ. జరిమానా అన్నాడు. 60 రూపాయలు మాకు చాలా పెద్ద ఎమౌంటే!
ఇక అక్కడ్నుంచి బ్రతిమిలాడడం మొదలుపెట్టాం. సూర్య ప్రకాష్ దగ్గర ఎప్పుడూ ఒక ఆయుధం ఉండేది. ‘My Father is ASM’ (Asst. Station Master) అన్నాడు. నేనూ రైల్వే కుటుంబంలో వాణ్ణే అని వాళ్ళకు చెప్పడం అన్నమాట. దేశంలో ఎక్కడకు వెళ్ళినా అవసరం వచ్చినప్పుడు ఈ అస్త్రం వాడుతుండేవాడు. ‘మేమంతా డాక్టర్లం బొంబాయి చూడడానికి వచ్చాం’ అని బ్రతిమిలాడుకున్నాం. మొత్తానికి అతను దయతలచి మమ్ముల్ని వదిలేశాడు. మన రైల్వే స్టేషన్ లలో లాగా ప్లాట్ ఫాం బయటకు వచ్చే వారందర్నీ టిక్కెట్ అడగకుండ Random Samples తీస్తారన్నమాట. అందులో మేం దొరికి తప్పించుకొన్నాం.

 

లోకల్ ట్రైన్లో సంగతి :

 

మేం ఉన్న చోటుకు వెళ్లడానికి రెండు లోకల్ ట్రైన్లు మారాలి. ఈ లోకల్ ట్రైన్లు చాలా స్పీడుగా పరుగెత్తేవి. బయలుదేరిన వెంటనే స్పీడందుకునేవి. స్టేషన్లో చాలా తక్కువ సేపే ఆగేవి. విపరీతమైన రష్ గా ఉండేవి. దిగడం ఎక్కడం టెన్షన్ గా ఉండేది. ఒక స్టేషన్లో మేం దిగే లోపే ట్రైన్ కదిలిపోయింది. ఎంతో కష్టపడి తరువాత స్టేషన్లో దిగాం. అక్కడ దిగగానే మళ్ళీ స్టేషన్ మాష్టరు మా టిక్కెట్లడిగి ఆ స్టేషన్ కు మాకు టికెట్ లేదని తెలుసుకుని మళ్ళీ మా 6 గురికి ఫైన్ వేస్తానన్నాడు. మేం డాక్టర్లని చెప్పుకోవడం, ప్రకాష్ నటనా సామర్ధ్యం మమ్మల్ని రక్షించాయి.

 

చచ్చేట్టు తిట్టాడు :

 

మర్నాడు ఉదయం రోడ్డు ప్రక్కన ఉన్న తోపుడు బండి వద్ద అరటి పండ్లు కొన్నాను. తిన్న తర్వాత తొక్కలను ఫుట్ పాత్, ప్రహరీగోడ కలిసే అంచున పడవేశాను. అరటి పళ్ళు అమ్మినతను నావంకే వేలు చూపిస్తూ కోపంగా గట్టి గట్టిగా అరుస్తున్నాడు. నన్నే తిడుతున్నాడని అర్ధమైంది. మరాఠీ లో కాబట్టి వాటి అర్థాలు తెలియలేదు. నేను చేసిన తప్పేంటో తెలియడం లేదు. నేనేమీ రోడ్డు మీద తొక్కలు వేయలేదు కదా రోడ్డు మూలనే వేశాను కదా అనుకున్నాను. అతనే వెళ్ళి ఆ తొక్కలను ఏరి, తన తోపుడు బండి క్రింద ఉన్న బుట్టలో వేసుకున్నాడు. తరువాత అన్ని బళ్ళనూ చూశాను. అందరూ తమ బళ్ళ క్రింద అరలో చెత్త వేయడానికి పెద్ద బుట్ట పెట్టుకున్నారు. బళ్ళ మీద ఉన్న పళ్లను కొన్న వాళ్ళు తిన్న తరువాత ఆ తొక్కలను క్రింద ఉన్న బుట్టలో వేయడం అక్కడి కల్చర్. ఇది 1981 మాట. 40 సంవత్సరాల తరువాత కూడా ఇప్పటికీ మన తెలుగు రాష్ట్రాలలో ఈ కల్చర్ రాకపోవడం విషాదం. ఈ సంఘటన మా ‘స్వచ్చ చల్లపల్లి’ ఉద్యమంలో ఎన్నో సార్లు చెప్పాను.

 

మళ్ళీ దొరికాం :

 

ఆ మర్నాడు సికిందరాబాదుకు ట్రైన్లో బయలుదేరాం. కానీ ట్రైను సికిందరాబాదు వచ్చినప్పుడు మేము నిద్రలో ఉండి హైదరాబాదు వచ్చిన తరువాత దిగాం. అక్కడ దిగి బయటకెళ్ళేటప్పుడు నాంపల్లి కు మాకు టికెట్ లేదు అని మా అందరికీ Fine వేస్తానన్నాడు T.C. మేం డాక్టర్లమయినా, ప్రకాష్ నటనా కౌశల్యమయినా మా Fine నూ ఆపలేదు. తగ్గించగలిగింది. 6గురికి కాకుండా ఇద్దరి కన్నా fine వెయ్యాల్సిందే అని పట్టుబట్టి మాతో కట్టించాడు. మెడిసిన్ చదివిన వాళ్ళమై ఉండి రైల్వే స్టేషన్ లలో ఇన్ని సార్లు పట్టుబడడం ఏమిటని తల కొట్టుకున్నాం.

 

స్టేషన్ నుండీ Pass Port office కు వెళ్ళి మేం తయారుచేసుకొచ్చిన Passport application ను ఆఫీసు బయట ఉన్న పోస్టు డబ్బాలో వేసి వచ్చాం. ఆరువారాల తర్వాత 11/A కు అందరికీ పోస్టులో పాస్ పోర్టులు వచ్చాయి. బ్రోకర్ కు రూపాయి ఇవ్వకుండా పాస్ పోర్ట్ తెచ్చుకోగలిగాం కానీ అవి expire అయ్యేలోపు ఉపయోగించగలిగింది ప్రకాష్ ఒక్కడే అనుకుంటా!

 

చివరి మాట :

 

ఈ టూర్లో మా దగ్గర కెమెరా లేదు. అందుకే ఫోటో తీసుకోలేకపోయాం.

 

మాధవరావు, సలీం లకు జాంబియా లో ఉద్యోగం దొరకలేదు. టాంజానియా, కెన్యా, జింబాబ్వే దేశాలు కూడా తిరిగి ఎక్కడా ఉద్యోగం దొరక్క తిరిగి వచ్చేశారు. సలీం వాళ్ళ నాన్న గారి ప్రార్ధనలకు అల్లా ఇలా కరుణించాడు.

 

ఆ తరువాత P.G entrance లో మాధవరావు M.D Anesthesia సీటు తెచ్చుకుని ఒక సంవత్సరం అయిన తరువాత రిజైన్ చేసి మళ్ళీ entrance రాసి జనరల్ సర్జరీ లో M.S చేసి ఆ తరువాత యూరాలజీ లో M.Ch చేసి గుంటూరు హాస్పిటల్ లోనే యూరాలజీ ప్రొఫెసర్ గా రిటైర్ అవడం తెలిసిందే!

 

జాంబియా నుంచి తిరిగివచ్చిన కొద్ది కాలానికే సలీం వాళ్ళ నాన్న గారు అకస్మాత్తుగా చనిపోవడం విషాదం. ఆయనతో మాకు ఎటాచ్మెంట్ ఉండేది. ఆయన 40 వ రోజు కార్యక్రమానికి ముందు రోజు స్కూటర్ యాక్సిడెంట్ లో సలీం బావ గారు చనిపోవడం మరొక విషాదం.

 

కుటుంబంలో పెద్ద కొడుకుగా ఉన్న సలీం తన తమ్ముళ్లందరికీ పెళ్లిళ్లు చేసి చక్కగా సెటిల్ అయ్యేటట్లు చేశాడు. కుటుంబ బాధ్యతలన్నీ చక్కగా నెరవేర్చాడు. ప్రస్తుతం సలీం సౌదీ అరేబియాలో మంచి పొజిషన్ లో ఉన్నాడు.


- డి. ఆర్. కె
04.08.2020.