ఉత్తరాలు ఉపన్యాసాలు - 56....           (15-Sep-2020)


ఉత్తరాలు ఉపన్యాసాలు - 56

=========================================

ఉపన్యాసం 28: బెనారస్ విశ్వవిద్యాలయ ఉపన్యాసం

వక్త: ఎం.కె. గాంధీ

స్వేచ్చానువాదం: చింతకుంట్ల సంపత్ రెడ్డి

మూలం: ఇంగ్లీష్

=========================================

నేపథ్యం:

-------------

 

జాతీయోద్యమంలో గాంధీజీ ఒక సంచలనం!

అందునా ..... ఆయన చేసిన ఈ ప్రసంగం మరో సంచలనం!

 

బెనారస్ విశ్వవిద్యాలయ ప్రారంభోత్సవం సందర్భంగా పండిత్ మదనమోహన్ మాలవియ గారు గాంధీ గారిని ఆహ్వానించారు.

 

మూడు రోజుల పాటు జరిగిన ప్రారంభ ఉత్సవాల్లో చివరి రోజున ..... ఫిబ్రవరి 4, 1916 నాడు గాంధీ గారికి మాట్లాడే అవకాశం ఇచ్చారు. ఆ సభకు దర్భంగ మహారాజు గారు అధ్యక్షత వహించాడు. వేదిక మీద దేశం నలుమూలల నుండి వచ్చిన ఎంతోమంది ఆనాటి ప్రముఖులు కూర్చొని ఉన్నారు. అందులో చాలామంది ఆ సభల్లో ప్రసంగించినవారే. సభావేదిక మీద కొంతమంది రాజులు, యువరాజులు ధగధగ మెరిసిపోయే ఆభరణాలు, దుస్తులు ధరించి ఆసీనులై ఉన్నారు. శ్రోతలు అంతా చాలావరకు విద్యార్థులే. చుట్టూ మోహరించిన పోలీసులు ఉన్నారు. పొట్టిగా ఉండే ముతక ధోవతి, కథియావాడి కోటు వేసుకుని, తలపాగా చుట్టుకుని ..... గాంధీ గారు వేదికనెక్కారు.

 

వినే అదృష్టం మనకు కలగలేదు ..... కానీ మనం దానిని చదవవచ్చు.

 

(కేవలం మొదటి పారాగ్రాఫ్ ను మాత్రం కుదించాను. అక్కడక్కడా బ్రాకెట్లలో ఉన్నవి ..... పాఠకుడి సౌకర్యార్థం అక్కడ ఏమి జరుగుతుందో తెలపడానికి ఇవ్వబడిన సమాచారం లేక వివరణ అని గుర్తించండి.)

 

                                          

 

(ఉపన్యాసం)

 

క్షమించాలి. రావడం ఆలస్యం అయింది.

 

 స్నేహితులారాఇందాకే మిసెస్ అనిబిసెంట్ చేసిన ప్రసంగపు వాగ్దాటి నుండి మీరు ఇంకా తేరుకుని ఉండరు.  మన విశ్వవిద్యాలయంలో చదువుకోబోయే  యువత ఒక గొప్ప సామ్రాజ్యం యొక్క పౌరులు అవుతారని నమ్మకండి.  ముఖ్యంగానేను విద్యార్థి ప్రపంచాన్ని ఉద్దేశించి మాట్లాడుతున్నాను.  మన దేశపు ఆధ్యాత్మికత ప్రపంచంలోనే సాటిలేదనిదానిని మాటల ద్వారా మనం వ్యాప్తి చేయవచ్చునని మీరు నమ్మకండి.  భారతదేశం ప్రపంచానికి ఇవ్వవలసిన సందేశాన్ని మీరు మాటల ద్వారా సాధించలేరు.  నాకు నేను ఈ ప్రసంగాలు, ఉపన్యాసాలతో విసిగిపోయాను. ఈ రెండు రోజుల నుండి ఇక్కడ ఇవ్వబడిన ఉపన్యాసాలు మాత్రం అందుకు మినహాయింపులు ..... అవి అవసరమైనవే. కానీ, ఉపన్యసించవలసిన విషయాలు ఏమీ లేవని నేను భావిస్తున్నాను. దాని అర్థం ..... కావలసినంత వీనులవిందుగా, కనులవిందుగా ఉంటే సరిపోదు.  అవి మన హృదయాలను తాకాల్సిన అవసరం ఉంది. ఇక మనం కాళ్లు చేతులు కదల్చాలి.

 

 ఈ రెండు రోజుల నుండి ఆ అవసరం గురించి వక్తలు మనకు తెలియపరిచారు. ఒకవేళ మన భారతీయ సాంప్రదాయం యొక్క నిరాడంబరతను అంటిపెట్టుకోవాలనుకుంటే ... మన కాళ్లు చేతులు ... మన హృదయంతో అనుసంధానం కావాలి. కానీ ఇదంతా ఉపోద్ఘాతమే. నా దేశస్తులతో నేను మాట్లాడడానికి తప్పనిసరిగా ఓ విదేశీ భాషను వాడాల్సిరావడం ఎంతో తలవంపుగా ఉందని, ఇది సిగ్గు పడాల్సిన విషయమని నేను చెప్పదలుచుకున్నాను. ఒకవేళ ఈ రెండు రోజుల సమావేశాలపై ఓ పరీక్ష నిర్వహించి, నన్ను పరీక్షకునిగా నియమిస్తే ... చాలామంది ఆ పరీక్ష తప్పుతారని నాకు తెలుసు. ఎందుకు అలా? ఎందుకంటే, అవి వారి హృదయాలను తాకలేదు కాబట్టి. డిసెంబర్లో బొంబాయిలో జరిగిన కాంగ్రెస్ సమావేశాలకు నేను హాజరయ్యాను. ఇక్కడికన్నా అక్కడ ఎక్కువమంది శ్రోతలు హాజరయ్యారు. హిందూస్థానీలో మాట్లాడిన ఆ ఉపన్యాసాలన్నీ వారి హృదయాలను తాకినవి అని నేను చెప్తే మీరు నమ్మగలరా? అర్థం చేసుకోండి.  బొంబాయిలో అందరూ హిందీలో మాట్లాడుతారు. బాంబే ప్రెసిడెన్సీలో హిందీ మాట్లాడేవారు ఒకవైపు, దేశీయ భాషలు మాట్లాడేవారు మరొకవైపు ఉన్నారు. అయితే, ఇంగ్లీష్ కు వారి భాషలకు మధ్య ఉన్నంత అంతరం వారికి హిందీలో కానరాదు. కాంగ్రెస్ సమావేశాల్లో, వారు హిందీ అర్థం చేసుకోగలిగారు. ఈ విశ్వవిద్యాలయంలో చదువుకోవడానికి వచ్చే విద్యార్థులకు వారి వారి భాషల్లోనే బోధనావకాశాలు ఉంటాయి అని నేను ఆశిస్తున్నాను. మన భాషలే మనకు అద్దంపడతాయి. గొప్ప విషయాలు చెప్పడానికి మన భాషాసంపద సరిపోదు అని మీరు భావిస్తున్నట్లయితే త్వరలోనే మన సంపద తుడిచిపెట్టుకుపోతుంది. ఎప్పటికైనా మన జాతీయభాషగా ఇంగ్లీష్ మారుతుందని కలగనే వారు ఎవరైనా ఉన్నారా? మనకు ఈ ప్రతిబంధకం ఎందుకు? ప్రతి ఇంగ్లీష్  పిల్లవాడితో మన పిల్లలు సమంగా పాల్గొనవలసిన అవసరం గురించి ఒక్కసారి ఆలోచించండి.

 

పూనాలో నేను కొంతమంది ప్రొఫెసర్లతో మాట్లాడే అవకాశం వచ్చింది. ఇంగ్లీష్ విద్యనార్జించే ఒక్కో విద్యార్థి సగటున విలువైన 6 సంవత్సరాలు కోల్పోతున్నాడట. ఆ కాలాన్ని చదువుకునే మొత్తం పిల్లల సంఖ్యతో వెచ్చించండి. ఎన్ని వేల సంవత్సరాల సమయాన్ని మనదేశం కోల్పోతున్నదో తెలుసుకోండి. మనకు చొరవలేదు అని నెపం ఒకటి ఉంది. కేవలం విదేశీ భాష నేర్చుకోవడానికి అంత విలువైన కాలాన్ని మనం వెచ్చించవలసివస్తే ఎలా? మిస్టర్ హిగ్గిన్ బోథం లాగ నిన్న మొన్న ఎంతమంది వక్తలు శ్రోతలను ఆకట్టుకోగలిగారు? అది వ్యక్తుల పొరపాటు కాదు. చెప్పవలసిన ఎన్నో విషయాలు వారు చెప్పారు. కానీ, అవి మనల్ని ఆకట్టుకోలేకపోయినవి. ఇంగ్లీషు చదువులే మనదేశాన్ని నడిపిస్తున్నాయని వారు మాట్లాడారు. అలాకాకపోతే, అది భయానకంగా ఉండేది అని  వారి అభిప్రాయం. మనకు ఇంగ్లీష్ విద్య మాత్రమే లభిస్తున్నది. దానికి ప్రత్యామ్న్యాయం వెతకాలి. ఒకవేళ గత 50 సంవత్సరాలుగా మన దేశభాషలలోనే మనం చదువుకుని ఉంటే ఇవాళ ఎలా ఉండిఉండేది? ఇవాళ మనకు స్వాతంత్ర భారతదేశం ఉండేది. చదువుకున్న భారతీయులు మనదేశంలోనే విదేశీయుల్లాగా అన్యభాషలో మనతో మాట్లాడేవారు కాదు. వారు అతి పేదవారి మధ్య పనిచేస్తూ ఉండేవారు. వారు సంపాదించినది ఏదైనా మనదేశసంపదగానే ఉండేది. ఈ రోజున మన భార్యలు కూడా మన ఆలోచనల్ని పంచుకోలేకపోతున్నారు. ప్రొఫెసర్ బోస్, ప్రొఫెసర్ రే లు చేసిన అద్భుతమైన పరిశోధనలు చూడండి. వారి పరిశోధనలు జనబాహుళ్యానికి చెందిన ఆస్తి కాకపోవడం సిగ్గుపడాల్సిన విషయం కాదా?

 

ఇక ఇప్పుడు వేరే విషయానికి వద్దాం.

 

 కాంగ్రెస్ స్వపరిపాలన తీర్మానాన్ని ప్రవేశపెట్టింది. అఖిల భారత కాంగ్రెస్ పార్టీ, ముస్లిం లీగ్ ... వారి వంతు బాధ్యతను వారు గుర్తించి కొన్ని స్పష్టమైన సలహాలతో ముందుకు వస్తారనే విషయంలో సందేహం లేదు. వారు ఎటువంటి ప్రతిపాదనలతో ముందుకు వస్తారు అనే విషయంలో నాకు ఆసక్తి లేదు. ఎందుకంటే ... విద్యార్థిలోకం, జనసామాన్యం ఎలాంటి ప్రతిపాదనలు చేస్తారనేదే నాకు ఆసక్తి. ఎన్ని పరిశోధనా పత్రాలు కానీ, ప్రసంగాలు కానీ మనకు స్వపరిపాలన తెచ్చిపెట్టవు. మన ప్రవర్తన వల్లనే దానిని సాధించుకోగలం. మరి మనకు మనమే పాలించుకునేందుకు మనం ఎలాంటి ప్రయత్నాలు చేస్తున్నాము?

 

 ఈ సాయంత్రం నాకు కలిగే ఆలోచనలను వెంటవెంటనే మీతో పంచుకోవాలని ఉంది. నేను ఉపన్యసించదలచుకోలేదు. ఒకవేళ నేను అనాలోచితంగా మాట్లాడుతున్నాను అని మీకు అనిపిస్తే, కేవలం ఒక మనిషి తన ఆలోచనలను వెంటవెంటనే మీతో పంచుకుంటున్నాడు అని భావించండి. ఒకవేళ నేను మర్యాదలు దాటి మాట్లాడుతున్నాను అని మీరు భావిస్తే, నేను తీసుకుంటున్న చొరవకు నన్ను క్షమించండి. నిన్న సాయంకాలం నేను విశ్వనాథుని ఆలయానికి వెళ్ళినప్పుడు నాకు కొన్ని ఆలోచనలు కలిగాయి. ఒకవేళ ఒక విదేశీ వ్యక్తి ఆకాశం నుంచి ఆ గొప్ప గుడిమీద ఊడిపడితే ..... హిందువులు అంటే ఇలా ఉంటారా అని ఈసడించుకుంటే అందులో తప్పేముంది? ఈ ఆలయం మన లక్షణాలకు ప్రతిబింబం కాదా? నేను ఒక హిందువులాగా మాట్లాడుతున్నాను. మన పవిత్ర ఆలయానికి వెళ్లే సందుగొందులు అన్నీ అంత మురికిగా ఉండాలా? ఎలాగూ చుట్టూ ఇళ్ళు కట్టారు. సందులు ఇరుకుగా, వంకరటింకరలుగా ఉన్నాయి. మన దేవాలయాలే విశాలతకు, పరిశుభ్రతకు ప్రతీకలుగా లేకపోతే మన స్వపరిపాలన ఎట్లా ఉండగలదు? వారంతట వారే గానీ, తప్పనిసరి పరిస్థితుల్లో గాని బ్రిటిష్ వారు ..... మూటాముల్లె సర్దుకుని మన దేశం విడిచి వెళ్ళిపోయిన వెంటనే మన దేవాలయాలు పవిత్రతకు, పరిశుభ్రతకు, ప్రశాంతతకు నిలయాలు అవుతాయా?

 

కాంగ్రెస్ అధ్యక్షుడు చెప్పినట్లు స్వపరిపాలన గురించి మాట్లాడే ముందు మనం చేయవలసిన పని ఎంతో ఉన్నది. ప్రతి పట్టణంలోనూ ... కంటోన్మెంట్, అసలు పట్టణం అనే రెండు భాగాలు ఉన్నాయి. ఈ పట్టణభాగమే అత్యంత దుర్గంధానికి స్థావరంగా ఉన్నది. మన జనసమూహం పట్టణవాసానికి అలవాటు పడలేదు. కానీ పట్టణంలో జీవించాలంటే, సులభమైన పల్లె జీవితపు పద్ధతులను అవలంబించకూడదు. భారతీయ బొంబాయిలో ..... వీధుల్లో నడిచేవారు ..... బహుళ అంతస్తుల భవనాలపైనుండి ఎవరు తమపై ఉమ్మివేస్తారోనని భయపడుతూ నడవడం ..... ఆలోచించడానికే బాగుండదు. నేను ఎక్కువగా రైలు ప్రయాణాలు చేస్తాను. మూడవ తరగతి ప్రయాణీకుల ఇబ్బందులను నేను గమనిస్తూ ఉంటాను. కానీ, ఇందుకు రైల్వే యాజమాన్యాన్ని నిందించకూడదు. మనకు ప్రాథమిక పరిశుభ్రత సూత్రాలు తెలియదు. రైలుపెట్టెల్లో ... అక్కడ మనం పడుకుంటాము అనే కనీస స్పృహ లేకుండా ఎక్కడపడితే అక్కడ ఉమ్మివేస్తాం. దానివల్ల ఆ రైలుపెట్టెలు వర్ణించనలవిగాని రోతగా మారుతాయి. పెద్ద తరగతి అని చెప్పుకునే ప్రయాణికులు ... ఈ అభాగ్య సోదరులను భయపెడుతుంటారు. వారిలో ఈ విద్యార్థి ప్రపంచం కూడా ఉండడం నేను చూశాను. వారు ఇంగ్లీష్ మాట్లాడుతారు, నార్ఫోక్ జాకెట్లు వేసుకుంటారు. అందుకని దురుసుగా లోపలికి వచ్చి, కూర్చోవడానికి స్థలం కోసం దబాయిస్తారు.

 

 మీరు నాకు మాట్లాడే అవకాశం ఇచ్చారు కాబట్టి అన్ని అంశాలను ప్రస్తావించాను. నా హృదయాన్ని మీ ముందు పరిచాను. స్వపరిపాలన సాధించడానికి తప్పనిసరిగా వీటన్నిటినీ పరిష్కరించాలి.

 

 ఇక ఇప్పుడు నేను మీకు మరో దృశ్యాన్ని ఆవిష్కరిస్తాను. నిన్నటి సభకు అధ్యక్షత వహించిన మహారాజావారు మన దేశంలోని పేదరికం గురించి మాట్లాడారు. మిగతావారు కూడా అదే విషయాన్ని నొక్కి చెప్పారు. కానీ వైస్రాయ్ గారు చేసిన శంకుస్థాపన కార్యక్రమం సందర్భంగా ..... ఆ గొప్ప ప్రాంగణంలో మనం ఏం చూశాం? చాలా శోభాయమానమైన ప్రదర్శన. పారిస్ నుండి వచ్చిన ఆభరణాల వర్తకుడు కనుల విందైన నగలను ప్రదర్శించాడు. నేను ఈ ధనవంతులైన గొప్పవారితో లక్షలాది మంది పేదవారిని పోలుస్తున్నాను. ఈ గొప్పవారికి ఒకమాట చెప్పాలని నాకు అనిపిస్తున్నది. మీరు ఈ నగలను త్యజించి, మీ దేశస్థుల బాగుకోసం వినియోగించలేకపోతే భారతదేశానికి విముక్తి లేదు.కానీ మన రాజుగారికి నిజమైన రాజభక్తి చూపించడానికి నగల పెట్టెలు కొల్లగొట్టి మనం ఆపాదమస్తకం నగలు వేసుకోవాల్సిన అవసరం లేదు.  రాజు గారు గాని, లార్డ్ హార్డింగ్ గారు గాని అలా కోరుకోరు అని నాకు తెలుసు. నా జీవితం ప్రమాదంలో పడినా సరే, కింగ్ జార్జ్ సందేశం ఏమిటంటే ఇట్లాంటివి ఆయనకు ఇష్టం ఉండవట. సర్, అది బ్రిటిష్ ఇండియా అయినా ఇండియాలో మా దేశ రాజుల పాలనలోని వేరే పట్టణంలో అయినా సరే ..... ఒక రాజప్రాసాదం లాంటి భవనం కట్టబడుతున్నట్లయితే ..... నాకు అసూయగా ఉంటుంది. ఓహ్! ఆ డబ్బులు అన్నీ వ్యవసాయదారులవే కదా.అని నేను అంటాను. మన దేశంలో డెబ్బయి అయిదు శాతం కన్నా ఎక్కువ వ్యవసాయదారులు ఉన్నారు. గతరాత్రి తన సొంత ఆహ్లాదకరమైన భాషలో మాట్లాడుతూ ..... హిగ్గిన్ బోథం ..... ఒక గడ్డిపోచ పెరిగే స్థలంలో మన వ్యవసాయదారులు రెండు గడ్డిపోచలు పెంచుతారని అన్నాడు. కానీ మన శ్రమ మొత్తాన్ని మననుండి దోచుకోవడానికి వేరేవారికి మనం అనుమతిస్తే మనకు స్వపరిపాలన స్ఫూర్తి లేనట్లే. మన విముక్తి కేవలం వ్యవసాయదారుని వల్లనే సాధ్యమవుతుంది. న్యాయవాదులు, వైద్యులు, ధనవంతుడైన భూస్వాములు దానిని సాధించలేరు.

 

 చివరగా ఒకమాట. ఈ రెండు మూడు రోజుల నుండి మన మెదళ్లను కలవరపెడుతున్న విషయం గురించి చెప్పవలసిన బాధ్యత నాకు ఉన్నది. వైస్రాయి గారు బెనారస్ వీధుల గుండా వెళ్తున్నప్పుడు మనమంతా ఎంతో భయాందోళనలకు, వ్యాకులతకు గురి అయ్యాం. ఎన్నో ప్రదేశాల్లో డిటెక్టివ్ లు ఉన్నారు. ఇంత అపనమ్మకం ఎందుకు?” అని మనకు మనమే ప్రశ్నించుకుంన్నాం. ఈ  జీవన్మరణం కన్నా ... లార్డ్ హార్డింగ్ చనిపోతే బాగుండేది కాదా? కానీ ఓ గొప్ప సామ్రాజ్య ప్రతినిధిగా ఆయన ఆ పని చేయకపోవచ్చు. ఆ డిటెక్టివ్ లతో మనమీద నిఘా పెట్టడం అవసరం అని భావించి వినియోగించి ఉండవచ్చు. మనం బుస కొట్టవచ్చు, మనం కలతచెందవచ్చు, మనకు కోపం రావచ్చు ... కానీ, ఈరోజు భారతదేశం తన అసహనంతో ఆరాచకవాదుల సైన్యాన్ని సృష్టించింది. నేను కూడా అరాచకవాదినే. కానీ నా దారి వేరు. ఒక వేళ నా మాటలు ఆ ఆరాచకవాదులకు వినబడేటట్లయితే ..... మన దేశాన్ని మనం జయించడంలో వారి ఆరాచకత్వానికి తావులేదని నేను చెప్పదలుచుకున్నాను. అది భయానికి సంకేతం. ఒకవేళ మనం భగవంతుని నమ్మి, అతడంటే భయపడుతున్నట్లయితే .... మహారాజులు గాని, వైస్రాయిలు గాని, డిటెక్టివ్ లు గాని, చివరకు కింగ్ జార్జ్ గాని ..... ఎవరికీ మనం  భయపడక్కర్లేదు.

 

ఆరాచకవాదుల దేశభక్తిని నేను గౌరవిస్తాను. దేశం కోసం చావడానికి సిద్ధమైన వారి ధైర్యాన్ని గౌరవిస్తాను; కానీ, చంపడం గౌరవప్రదమైనదా? అని నేను వారిని ప్రశ్నిస్తున్నాను. ఒక ఖూనీకోరు చురకత్తి గౌరవప్రదమైన మరణానికి పూర్వగామి అవుతుందా? నేను దానిని ఒప్పుకొను. ఏ గ్రంథాల్లో కూడా అలాంటి పద్ధతులు సూచించబడలేదు. ఒకవేళ, భారత దేశ విముక్తి కోసం ఇంగ్లీషువారు వెళ్ళిపోవాలని, వాళ్లను వెళ్లగొట్టడం అవసరమని అనిపిస్తే ..... వారిని వెళ్లిపోవాలని అడగడానికి నేను వెనుకంజవేయను. నా నమ్మకాన్ని బ్రతికించుకోవడానికి చావుకి కూడా నేను సిద్ధమే. నా ఉద్దేశంలో అలాంటి చావు గౌరవప్రదమైనది అవుతుంది. బాంబులు వేసేవాడు రహస్యపన్నాగం పన్నుతాడు. అతను ప్రజల్లోకి రావడానికి భయపడతాడు. పట్టుపడినప్పుడు తప్పుదోవలో వెళ్లినందుకు మూల్యం చెల్లిస్తాడు. ఒకవేళ కొంతమంది బాంబులు వేయకపోయినట్లయితే విభజన (బెంగాల్-1905) ఉద్యమంలో మనం సాధించుకున్నది సాధ్యమయ్యేది కాదు.అని కొంతమంది అంటారు. (గాంధీగారితో అనిబిసెంట్: దయచేసి ఆపండి.”) బెంగాల్లో మిస్టర్ లియోన్ అధ్యక్షత వహించిన మీటింగ్ లో కూడా నేను ఇదే విషయం చెప్పాను. నేను చెప్తున్నది అవసరం అనే నేను భావిస్తున్నాను. (చైర్మన్ వైపు తిరిగి: ...) ..... ఒకవేళ నన్ను ఆపమని అంటే నేను ఒప్పుకుంటాను. మీ ఆదేశాల కోసం వేచి చూస్తున్నాను. ఒకవేళ నా మాటలు నన్ను నన్నుగా గానీ, నేను దేశానికి, సామ్రాజ్యానికి సేవ చేయడం లేదని గానీ మీరు భావిస్తే నేను తప్పకుండా ఆపేస్తాను. (మాట్లాడండి.అంటూ శ్రోతల అరుపులు) (చైర్మన్: దయచేసి మీ లక్ష్యం ఏమిటో వివరించండి.) నేను కేవలం ..... (మళ్లీ ఒకరు: ఆపండి.”) ..... స్నేహితులారా, ఈ అంతరాయానికి నిరసన తెలిపవద్దు. ఒకవేళ బీసెంట్ ఈ ప్రసంగాన్ని ఆపమని నాకు సలహా ఇస్తున్నారంటే, ఆమె భారతదేశాన్ని ఎంతగానో ప్రేమిస్తూ ఉంది గనుకనే. నేను నా ఆలోచనలను మీలాంటి యువతతో వెంటవెంటనే పంచుకోవడంలో నేను తప్పు చేస్తున్నాను అని ఆవిడ భావిస్తున్నారు. అయినప్పటికీ నేను కేవలం ఒకే ఒక విషయం చెప్తాను. భారతదేశంలో ఇరువైపులా ఉన్న అనుమానాస్పదమైన వాతావరణాన్ని రూపుమాపాలని నా కోరిక. మన గమ్యాన్ని చేరుకోవడానికి పరస్పర ప్రేమ, నమ్మకం ఉండే సామ్రాజ్యం కావాలి. బాధ్యత లేకుండా ఇంట్లో కూర్చుని మాట్లాడుకోవడం కన్నా ఈ కాలేజీ నీడలో మనం మాట్లాడుకోవడం మంచిది కదా? ఇలాంటి విషయాలు బహిరంగంగా మాట్లాడుకుంటేనే బాగుంటుంది అని నేను అనుకుంటున్నాను. ఇలా మాట్లాడుకోవడం వల్ల గతంలో మంచి ఫలితాలు వచ్చాయి. విద్యార్థులకు తెలియని విషయం ఏమీ లేదు అని నాకు తెలుసు. అందువల్ల మనం ఏమిటో మీకు తెలియజెప్పే ప్రయత్నం చేస్తున్నాను. నా దేశాన్ని తలుచుకుంటూ నేను నా ఆలోచనలు మీతో పంచుకుంటున్నాను. అలాగే తత్వానికి భారతదేశంలో ఆరాచకత్వానికి తావులేదని కూడా నేను చెబుతున్నాను. మన పాలకులకు మనం ఏం చెప్పాలనుకుంటున్నామో ... స్పష్టంగా, బహిరంగంగానే చెబుదాం. ఒకవేళ మనం చెప్పింది వారికి నచ్చకపోతే రానున్న పరిణామాలను ఎదుర్కొందాం. కానీ, ఎప్పుడూ వారిని దుర్భాషలాడవద్దు.

 

 ఓ రోజు ..... జనం ఎక్కువగా తిడుతున్న సివిల్ సర్వీస్ లోని ఒక వ్యక్తి తో మాట్లాడుతున్నాను. నాకు సివిల్ సర్వీస్ పట్ల అభిమానం ఏమీ లేదు. కానీ, అతను మాట్లాడుతున్న తీరు నాకు నచ్చింది. మిస్టర్ గాంధీ, ఒక్క నిమిషం ఆలోచించండి. సివిల్ సర్వెంట్స్ అందరూ అందరూ చెడ్డవాళ్ళేనా? మేమందమూ మా పాలిత ప్రజల్ని అణగదొక్కాలని అని అనుకుంటున్నామా?” అని అడిగాడు. నేను కాదు.అని జవాబిచ్చాను. అవకాశం వస్తే ఆ విషయం అందరికీ చెప్పండి.అని అతను నన్ను కోరాడు. ఇప్పుడు ఆ విషయం చెబుతున్నాను. అవును, ఇండియన్ సివిల్ సర్వీస్ లో ఉన్న చాలామంది నిశ్చయంగా అహంకారులు. వారు నిరంకుశులు. కొన్ని కొన్ని సార్లు వారు అనాలోచితంగా ప్రవర్తిస్తారు. ఇంకా కొన్ని విశేషణాలు వాడవచ్చును. ఇవన్నీ నేను ఒప్పుకుంటున్నాను. కొన్ని సంవత్సరాల పాటు భారతదేశంలో ఉన్నందువల్ల వారిలో కొంతమంది దిగజారిపోయారు. కానీ, ఈ విషయం మనకు  సూచిస్తుంది? ఇక్కడికి రావడానికి ముందు వారంతా సజ్జనులు. ఒకవేళ వారు వారి నైతికతత్వాన్ని కొంత కోల్పోయారు అంటే అది మనకు మనమే పునఃపరిశీలన చేసుకోవాల్సిన విషయం. మీకు మీరే ఆలోచించండి. నిన్న మంచివాడుగా ఉన్న ఒక వ్యక్తి, నాతో సావాసం చేసి చెడ్డవాడుగా మారినాడు అంటే దానికి బాధ్యుడు అతనా, నేనా? వారు భారతదేశం వచ్చిన తర్వాత వారిని ముఖస్తుతి చేస్తూ అబద్ధాలాడే వాతావరణం వారిని నీతిబాహ్యులను చేసింది. మనలో చాలామంది అలాగే అవుతారు. కొన్నిసార్లు నిందలు భరించడం పర్వాలేదు. స్వపరిపాలన కావాలనుకుంటే అది తప్పదు. మనకు స్వపరిపాలన ఇవ్వబడదు. బ్రిటిష్ చరిత్రను, బ్రిటిష్ సామ్రాజ్య చరిత్రను పరిశీలించండివారు స్వాతంత్ర్యప్రియులే కానీ, ఎవరంతట వారు తీసుకుంటే తప్ప, ఇవ్వవలసిన వారికి వారంతట వారు స్వాతంత్ర్యం ఇవ్వరు. కావాలంటే బోయర్ యుద్ధం ఏం పాఠం చెప్పిందో తెలుసుకోండి. ఆ సామ్రాజ్యానికి శత్రువులైనవారే, ఇప్పుడు మిత్రులయ్యారు .....

 (ఎవరో గాంధీగారిని మళ్ళీ ఆపమని అడగడం ..... వేదిక మీద ఉన్నవారు ఒక్కొక్కరు లేచి వెళ్లడం మొదలైంది. ..... ఆయన తన ప్రసంగాన్ని అర్ధాంతరంగా ముగించారు.)

 

                                        

ముగింపు:

--------------

నిర్బంధాల నీడలో కూడా ..... అంతటి నిర్భీతిగా, నిర్మొహమాటంగా, కుండబద్దలు కొట్టినట్టు మాట్లాడగలగడం కేవలం గాంధీగారికే చెల్లింది.

 

ఆనాటి పరిస్థితులకు, గాంధీగారి అభిప్రాయాలకు అద్దంపట్టే ఓ మచ్చుతునక ఈ ఉపన్యాసం.

 

కాశీ విశ్వేశ్వరాలయం పరిస్థితుల విషయం ..... ఆ దుర్ఘంధానికి దేవుడు పారిపోయివుంటాడని ఆయన తన ఆత్మకథలో కూడా చమత్కరించాడు. ఈనాటికి ఆ పరిస్థితుల్లో మార్పు రాకపోవడం ఎంత శోచనీయం!

 

ఈ ప్రసంగాన్ని మిత్రులు, శ్రీ  Avadhanam Raghu Kumar గారు సూచించారు. వారికి కృతజ్ఞతలు.

 

#########################

చింతకుంట్ల సంపత్ రెడ్డి

గురువారం, 16 జూలై 2020