నేనూ – శైలాబాను April 4, 2018....           (14-Jul-2020)


ఎక్కణ్ణించో మా హాస్పిటల్ కు ఒక చిన్న పిల్లి వచ్చింది.నా ఒ.పి.లోనే వుండేది పగలంతా. ఉదయం పాలు పోసేవాళ్ళం. తాగి కుర్చీ కింద నిద్రపోయేది . ఉదయం 9 గంటలకు నేను టీ తాగుతూ ఉంటే, నా భార్య పద్మావతి కార్న్ ఫ్లేక్స్ తినేది. ఆ వాసనకు దగ్గరకు వచ్చి మ్యావ్..మ్యావ్ అనేది తనకు పెట్టమని. ఒక చిన్న పళ్ళెంలో కార్న్ ఫ్లేక్స్ పెడితే, తిని మూతి తుడుచుకునేది. కాలకృత్యాలు తీర్చుకోవలసి వచ్చినప్పుడు కిటికీలో నుంచి బయటకువెళ్లి మళ్ళీ ఒ.పి. గదిలోనికి వచ్చి పండుకునేది. రాత్రిపూట హాస్పిటల్ అంతా కలియ తిరుగుతూ ఎలుకలను పట్టి తినేది.

 

మా నర్స్ ఇందిర ఈ పిల్లికి “శైలాబాను” అని పేరు పెట్టింది. ముద్దుగా”శైలు”అని పిలిచేవాళ్ళం. ఎవరైనా పిలిస్తే, పిలిచిన వాళ్ళవైపు చూసి మ్యావ్ అనేది. ఉదయాన్నే నా గదిలోనికి వచ్చిన నన్నూ, మా కాంపౌండర్లనూ, నర్సులను మ్యావ్ అంటూ దగ్గరకు వచ్చి కాళ్ళకు రాసుకుంటూ ఉండేది.

 

కొన్ని రోజుల తర్వాత నా గదిలో ఒక చిన్న కుర్చీ, అందులో ఒక మెత్తని పక్క ఏర్పాటు చేశాo. నా గదిలో ఉన్నప్పుడు అది ఆ కుర్చీలో దర్జాగా నిద్రపోయేది. కుర్చీ కింద పాల గిన్నె ఉంటుంది. ఆకలి అయినప్పుడు దిగి తాగి బయటకు వెళ్లి కాలకృత్యాలు తీర్చుకుని మళ్ళి పండుకునేది. వేసవి కాలంలో ఎ.సి. వేసుకుని కిటికీలు వేసేవాళ్ళం. అప్పుడు బయటకు వెళ్ళాల్సి వచ్చినప్పుడు కిటికీ దగ్గరకు వెళ్లి మ్యావ్ అంటూ తలుపు తీయమని అడిగేది. తలుపు తీస్తే వెళ్ళిపోయి, మళ్ళీ కాసేపటికి వచ్చి కిటికీ బయట కూర్చుని తలుపు తీయమని మ్యావ్ మ్యావ్ అనేది. కిటికీ తీస్తే మళ్ళీ లోనికి వచ్చి తన కుర్చీలో పండుకునేది. అప్పుడప్పుడు నా కాళ్ళ దగ్గరకు వచ్చి పండుకునేది. నా కాలు మీద తల ఆన్చుకుని, నిద్ర పోతుంటే నాకు కుర్చీలో నుండి లేవబుద్ది అయ్యేది కాదు.

 

కొన్నాళ్ళ తర్వాత అది దేనికో వెతుక్కోవడం గమనించాను. ఓ.పి. గదిలోనే కబ్బోర్డ్స్ లాంటి ప్రదేశాలను అన్వేషిస్తోంది. ఇది గర్భిణీ అని, డెలివరీ కోసం సురక్షిత ప్రదేశం వెతుక్కుంటోంది అని మా నర్సులు చెప్పారు.

 

ఓ రోజు మధ్యాహ్నం గం. 12-30 నిమిషాలకు నా కాళ్ళ దగ్గర పండుకున్న శైలాబాను మ్యావ్ లు కాక వేరే చిన్న పిల్లి కేకలు వినిపిస్తున్నాయి. చూస్తే అప్పుడే పుట్టిన ఒక పిల్లను నాకుతూ శైలాబాను కనిపించింది. మరి కాస్సేపటికి మరో పిల్ల, ఆతర్వాత ఇంకో పిల్ల పుట్టాయి. మూడు పిల్లలను శుభ్రంగా నాకేసింది. అవి కాసేపటికి తల్లిపాలు తాగి నిద్రపోయాయి. సమయం ప్రకారం వాటిని నాకడం, పాలివ్వడం చేసేది తల్లి పిల్లి. కొన్నిరోజుల తర్వాత చూస్తే తల్లీ లేదు, పిల్లలు లేవు. అందరం వెతకటం మొదలుపెట్టాం. నా ఓ.పి. గదిలోనే ఒక అలమరా లోనికి పిల్లలను మార్చేసింది. పిల్లి, తన పిల్లల్నిఏడు చోట్లకి మారుస్తుందని పెద్దవాళ్ళు చెప్తారు కదా!

 

కొన్నాళ్ళకు మరో చోటుకి మార్చేసింది. పిల్లల్నిఎక్కడ వుంచినా తను వచ్చి నా ఓ.పి.లో పాలు తాగి వెళ్ళడం మానలేదు. రోజూ పిల్లలు బాగున్నాయో లేదో చూసుకునేవాళ్ళం. నెల రోజులకు వాటి పిల్లలకు కాళ్ళలో బలం వచ్చి, హాస్పిటల్ అంతా తిరగడం మొదలు పెట్టాయి. అవీ చిన్న చిన్న పురుగుల్ని, కీటకాలను వేటాడి తినడం మొదలు పెట్టాయి. అప్పుడప్పుడు తల్లి ఒక ఎలుకను పట్టి వీటికి ఆహారంగా తెచ్చేది. నెమ్మదిగా ఇవి కూడా ఎలుకలను పట్టడం నేర్చుకున్నాయి. పిల్లలు కూడా నా ఓ.పి.లో పాల కోసం రావడం మొదలుపెట్టాయి. తల్లీ పిల్లలు కలిసి పాలు తాగేవి.

 

మరికొంత కాలం తర్వాత తల్లి తన పాలు ఇవ్వడం మానేసింది. అవి దగ్గరకు వచ్చినా, పాలు తాగనిచ్చేది కాదు. ఇక కాళ్ళొచ్చిన పిల్లలు వాటి ఆహారం అవి సంపాదించుకోవాల్సిందే! తల్లి సహాయం చేసేది కాదు. వేటికవే ప్రత్యేకంగా హాస్పిటల్ లో తిరుగుతూ బ్రతికేవి.

 

పిల్లలు వారి కాళ్ళ మీద వారు బ్రతకగలిగినా, వాళ్ళకు అన్నీ చేసి పెట్టడం, ఆస్తులు సమకూర్చడం, వాళ్ళు కష్టపడకుండా బ్రతకడం కోసం తాపత్రయపడే తల్లిదండ్రులను ఎంతోమందిని చూస్తున్నాం! మానవ విలువల్లో ముఖ్యమైన “ప్రేమ”ను అతిగా చేసి పిల్లలను పాడు చేస్తున్నసంఘటనలు చూస్తూనే ఉన్నాం గదా!

 

పిల్లి పిల్లలను మాకిమ్మంటే మాకివ్వమని చాలా మంది అడిగేవారు. కానీ తల్లిపాలు తాగడం ఆపేవరకు ఎవరికీ ఇవ్వనని చెప్పేశాను. అప్పుడప్పుడు ఎలుకల కోసం ప్రక్కనే వున్న పొలాల్లోకి ప్రహరీగోడ దూకి మరీ వెళ్తుండేవి. అలా వెళ్ళినప్పుడు ఒకసారి ఒక పిల్లను ఒక కుక్క చంపేసింది. వెంటనే మరో పిల్లను వేరొకరికి యిచ్చివేసాను. మూడవ పిల్లి తెల్లగా అందంగా ఉంది. ఎవరికి యివ్వబుద్ది కాలేదు. దానికి “చిన్న శైలాబాను“ అని పేరు పెట్టారు మా స్టాఫ్. ముద్దుగా దాని పేరు “చిన్న శైలు” అయ్యింది.

 

తల్లీ-పిల్లలూ వేర్వేరుగా హాస్పిటల్ లో తిరుగుతూ ఉండేవి. ఉదయం 6 గంటలకు మా ఆయా “స్వరాజ్యమ్మ” రాగానే ఆవిడ వెంటబడేవి. రోజు రాగానే పెరుగన్నం పెట్టాకే ఆవిడ హాస్పిటల్ లో పని ప్రారంభిస్తుంది. మద్యాహ్నం మా స్టాఫ్ భోజనం వేళకు వాళ్ళ దగ్గరకు వెళ్లి అన్నం పెట్టేవరకు ఊరుకోవు.

 

మరికొన్నాళ్లకు తెల్లటి చిన్న శైలూ ఓ.పి,లో నా కాళ్ళ దగ్గరే 2 పిల్లల్ని కనేసింది. ఒకటి తెల్లది మరొకటి గోధుమరంగుది. ఇప్పుడు నాలుగు పిల్లలయ్యాయి. చిన్న శైలూ చిన్న కుర్చీని ఆక్రమించినప్పుడు పెద్ద శైలూ నా గదిలో ఉండేది కాదు. పాలు తాగి వెళ్ళిపోయేది. ఇప్పుడు చిన్న శైలూ పిల్లలు ఆ కుర్చీని ఆక్రమించుకుని పండుకుంటే పెద్దవి నా రూంలో ఉండటం లేదు.

 

మళ్ళీ నిన్న శైలూ నిండు పొట్టతో నా ఓ.పి. గదిలోకి వచ్చి మళ్ళీ స్థలం వెతుక్కుంటోంది. శైలూ అని పిలిస్తే దగ్గరకు వచ్చి నా కుర్చీ ప్రక్కనే పండుకుంది. గడ్డం క్రింద చేతితో నిమిరితే కళ్ళు మూసుకుని ఎంజాయ్ చేసేది. అలా నిమిరినప్పుడు పిల్లుల శరీరం నుండి ఒక రకమైన ప్రకంపనలు వస్తాయి. దాన్ని”క్యాట్స్ పర్” అంటారట.

 

రేపో ఎల్లుండో మళ్ళీ కాన్పు అవుతుంది. ఈసారి కాన్పుల గది ఏదో? ఎన్ని పిల్లలు పుడతాయో? ప్రస్తుతం ఇవే నా ఆలోచనలు.

 

అబ్బురి ఛాయాదేవి గారి ‘పిల్లలు కబుర్లు’ చదవగానే వచ్చిన గుర్తులు, అనుభూతులు ఇవి.

 

డాక్టర్ దాసరి రామకృష్ణ ప్రసాదు

పద్మావతి హాస్పిటల్,

చల్లపల్లి, కృష్ణాజిల్లా, ఆంద్రప్రదేశ్

 

 

(పై వ్యాసం 10-08-2011న ‘సన్ ఫ్లవర్’ వారపత్రికలో ప్రచురించబడింది.)