మన కాలపు మహానుభావుడు March 23, 2018....           (14-Jul-2020)


(మండేలా చనిపోయాడన్న వార్త వినగానే నాలో కలిగిన భావాలు)

 

 

ఎమర్జెన్సీ తర్వాత జరిగిన ఒక బహిరంగ సభలో ప్రసంగించడానికి సుందరయ్య గారు స్టేజి ఎక్కుతుండగా…

 

సుందరయ్య జిందాబాద్!

సుందరయ్య జిందాబాద్!

సుందరయ్య నాయకత్వం వర్ధిల్లాలి…

 

ఇలా నినాదాలు మార్మోగాయి. స్టేజి ఎక్కగానే నినాదాలు ఆపమన్నట్లు ఆయన సంజ్ఞ చేశారు. అందరూ ఆపేశారు.

 

 

“ఒక వ్యక్తి చనిపోయేదాకా పీడిత ప్రజల పక్షాన నిలబడితే అతనికి జిందాబాద్ కొట్టవచ్చు. ముందు ముందు ఎలా ఉండబోతున్నాడో తెలియకుండా బ్రతికి ఉన్నప్పుడే జిందాబాద్ కొట్టకండి” అని వారించారు. (ఆయన చెప్పినవి ఇవే మాటలు కాకపోవచ్చు. కానీ అర్థం ఇదే!)

 

 

సుందరయ్య గారు చనిపోయినప్పుడు రాష్ట్రం నలుమూలల నుండి వచ్చిన వేలాదిమంది సగౌరవంగా నివాళులర్పించారు. అనేకమంది కన్నీరు కార్చారు. ఆరోజు బంద్ వలన తిండి దొరక్కపోయినా అంతిమ యాత్రలో పాల్గొన్నారు.

 

 

“నా జీవితమే నా సందేశం!” అన్నారు మహాత్మా గాంధీ.

 

 

నెల్సన్ మండేలా చనిపోయాడన్న వార్త వినగానే గుర్తుకు వచ్చిన ఘటనలు ఇవి. సుందరయ్య గారి సిద్ధాంతం ప్రకారం 95 సంవత్సరాలు నిండు జీవితాన్ని రాజీ పడకుండా పీడిత ప్రజల పక్షాన గడిపిన మండేలాకు ప్రపంచం సరైన రీతిలోనే జోహార్లు అర్పించింది.

 

 

మహాత్ముని జీవితం లాగా మండేలా జీవితమూ సందేశమే!

 

జీవితంలో దాదాపు మూడవ వంతు జైల్లోనే గడిపిన మండేలా ఎన్నడూ నైరాశ్యానికి గురి కాలేదు.

 

 

రాజకీయ సన్యాసం చేస్తే జైలు నుండి విడుదల చేస్తామన్నా, ఒక పట్టణంలోనే ఉంటానికి ఒప్పుకుంటే విడుదల చేస్తామన్నా, క్షయ వచ్చి ఆరోగ్యం బాగాలేకపోయినా – ‘అన్ కండిషనల్ ’గా వదిలితేనే బయటకు వస్తానని భీష్మించి జైల్లోనే ఉన్న వ్యక్తి మండేలా!

 

 

ఉద్యమం మొదలు పెట్టడం తేలిక కావచ్చు కానీ విరమణలో సమస్యలు అనేకం. దేశాధ్యక్షుడైనాక నల్లవారిని ఎంతోకాలం హింసించిన తెల్లవారిపై పగ తీర్చుకునే వాతావరణం రానీయకుండా శాంతియుత సహజీవనం గడిపే వాతావరణం తయారు చేయగలగడం మండేలాకే సాధ్యం అయింది.

 

 

వయస్సు పైబడినప్పుడు శరీరం సహకరించనప్పుడు స్వచ్ఛందంగా పదవుల నుండి తప్పుకోవడం, విరమణ తర్వాత కూడా ప్రచార ఆర్భాటాలకు పోకుండా కుటుంబంతో ప్రశాంతంగా గడపడానికి ప్రాధాన్యం ఇవ్వడం – ఎంతో గొప్ప సాంప్రదాయం. (ఈ మాటలు రాస్తున్నప్పుడు కా. జ్యోతిబసు గుర్తుకొస్తున్నారు).

 

 

జీవితంలో ఏ భాగం చూసుకున్నా ఆదర్శవంతమైన జీవితం మండేలాది.

 

మహాత్ముడు చనిపోయినప్పుడు భారతదేశమంతా షాక్ కు గురైంది.

 

సుందరయ్య గారు చనిపోయినప్పుడు ఎంతోమంది ఉద్వేగానికి గురయ్యారు.

 

గుంటూరు బాపనయ్య గారు చనిపోయినప్పుడు దివిసీమకు చెందిన ప్రజలు ఉద్వేగానికి గురయ్యారు.

 

మన దేశానికి చెందని వ్యక్తి అయినా, మనం ఎన్నడూ చూడకపోయినా మండేలా చనిపోతే లక్షలాది మంది ఉద్వేగానికి గురయ్యారు.

 

 

నెల్సన్ మండేలాను జైలు నుండి విడుదల చేసినప్పుడు ఉద్వేగం.

 

దక్షిణాఫ్రికా అధ్యక్షుడుగా ప్రమాణం చేసేరోజు ఉద్వేగం.

 

“విన్నీ”తో విడిపోయిన రోజు…. ఏదో తెలియని బాధ!

 

 

మన కాలపు మహానుభావుణ్ణి కలిసి తీరాలని తీవ్రమైన కోరిక ఉండేది. కలిసి “Can I hug you?” అని అడిగి ఒప్పుకుంటే కావులించుకుని భోరున ఏడ్వాలనుకున్నాను. ఎందుకు ఏడవడం? తెలియదు. ఆ మనిషి పేరు వింటేనే రోమాలు నిక్క పొడుచుకుంటాయి. ఆ ఏడుపు ఆనందంతో కావచ్చు. ‘మేడం టుస్సాడ్’ మ్యూజియంలో ఆయన మైనపు బొమ్మతో నేను నా భార్య ఫోటో దిగి సంబరపడ్డాం.

 

 

ప్రతి మనిషీ చనిపోవాల్సిందే కదా! “మెటీరియలిస్టులు మీకెందుకు అంత ఉద్వేగం” అని అడిగాడొక మిత్రుడు.

 

మెటీరియలిస్టులకూ మనసుంటుంది గదా! అందుకే మాకూ ఉంటాయి ఉత్సాహాలు, ఉద్వేగాలు!

 

 

డా. దాసరి రామకృష్ణ ప్రసాదు

పద్మావతి ఆసుపత్రి

చల్లపల్లి, కృష్ణాజిల్లా, ఆంధ్రప్రదేశ్.