ఔను – జనంలో ఉన్న జ్ఞానమే జన విజ్ఞానం. March 13, 2018....           (14-Jul-2020)


(కొన్ని సంవత్సరాల క్రితం ‘ఆంధ్రజ్యోతి’ సంపాదకులు కె. శ్రీనివాస్ గారు ఉబ్బసానికి చేపమందును సమర్ధిస్తూ ‘జనవిజ్ఞాన వేదిక’ను విమర్శిస్తూ వ్రాసిన సంపాదకీయానికి సమాధానంగా వ్రాసిన వ్యాసమిది. ఈ వ్యాసాన్ని ‘ఆంధ్రజ్యోతి’ ప్రచురించలేదు.)

 

 

ఔను – జనంలో ఉన్న జ్ఞానమే జన విజ్ఞానం.

 

కానీ మీ వ్యాసం – జనంలోని అజ్ఞానానికి ప్రోత్సాహం కాదా?

 

 

కె. శ్రీనివాస్ గారి సంపాదకీయాలు ఎంతో ఆసక్తిగా చదివే నాలాంటి ఎందరో అభిమానులకు జూన్ 10 ఆదివారం నాడు వారు రాసిన సంపాదకీయం తీరని బాధను మిగిల్చింది.

 

 

జనంలో విజ్ఞానం ఎప్పటి నుండో ఉన్నదే! లేకుంటే ఈ సమాజ పురోభివృద్ధి ఇలా ఉండేది కాదు కదా! తరతరాలుగా ఎంతోమంది తమ జీవితాలను అంకితం చేయడం వల్లనే మనం ఇప్పటి సౌకర్యాలను అనుభవిస్తున్నాం.

 

 

శ్రీనివాస్ గారు తమ వ్యాసంలో “ఆధునికమైనదే జ్ఞానమనీ, తక్కినదంతా మూఢత్వమనీ అనుకోవడం నయా మౌఢ్యమే తప్ప మరొకటి కాదు” అని రాసారు. నూటికి నూరుపాళ్ళు నిజం!

 

 

“పరంపరాగతమైన వాడుకగా, సేవగా వైద్యం చేస్తున్న వారి మీద సైన్సు పేరుతో దాడి చేయడం న్యాయమా?” అని ప్రశ్నించారు.

 

 

చేప మందులో మందేమీ లేదని రుజువు అయిన తర్వాత కూడా శ్రీనివాస్ గారు ఆ కార్యక్రమాన్ని ఎలా సమర్ధిస్తున్నారు? అందులో మందులేకపోయినా ఒక ఆశతో వేలాదిమంది హైదరాబాదు వచ్చారు. వారికి సరైన ఏర్పాట్లు చేయలేకపోవడం ప్రభుత్వ వైఫల్యం అవుతుంది కానీ, జన విజ్ఞానం ప్రచారం చేస్తున్న సంస్తలదో, కార్యకర్తలదో ఎలా అవుతుంది? చిన్న పిల్లవాడు ఆట వస్తువనుకొని నిప్పును పట్టుకోబోతే మనం చూస్తూ ఊరుకోము గదా! మనకున్న జ్ఞానంతో ఆ పిల్లవానిని ప్రమాదం తప్పించడానికి ప్రక్కకు లాగేస్తామా లేదా?

 

 

ఆధునిక వైద్య చరిత్ర కొద్ది శతాబ్దాలు మాత్రమే! అంతకు ముందు వైద్యం లేదా? ప్రతి ప్రాంతంలోనూ ప్రతి సమూహానికీ, వారికి ఉన్న అనుభవం ద్వారా జబ్బులకు వైద్యం జరిగేది కదా! ఆ వైద్యాలన్నింటిలోను పనికి వచ్చే మందులను మరింత మెరుగుపరిచి ఆధినిక వైద్యం వాడుకొంటున్నది.

 

 

సర్పగంధి వేళ్ళు తింటే కొంతమందికి బాగుంటుందనేది వేల ఏళ్ల క్రితమే భారతదేశ ప్రజలకు తెలిసిన విషయం. ఈ వేళ్ళలో ఉన్న కెమికల్స్ ను కనిపెట్టి వాటిని విడివిడిగా ప్రయోగాలు చేసి అందులో ఉన్న చాలా కెమికల్స్ లో “రిసర్పిన్” అనే ఆల్కలాయిడ్ వలన ఎక్కువగా ఉన్న రక్తపోటు తగ్గుతుందని, అందుమూలంగా రక్తపోటు ఎక్కువగా ఉన్నవారికి బాగున్నట్లుగా ఉంటుందని ప్రయోగాలలో తేలింది. సర్పగంధి వేళ్ళు తినడం వైద్యమే. మరి ఈ కాలంలో కూడా మనకు అవసరం లేని చాలా కెమికల్స్ ఉన్న ఆ వేళ్ళను నములుదామా లేక అందులో మనకు పనికి వచ్చే ఒకే ఒక కెమికల్ “రిసర్పిన్”ను వేసుకొని రక్తపోటును తగ్గించుకుందామా?

 

 

మన దేశంలో ప్రతి నాలుగయిదు గ్రామాలకు పాముకాటుకు “మంత్రం వేసి గానీ, పసరు తాగించి గానీ, కలికం వేసి గానీ” వైద్యం చేసే నాటువైద్యుడు ఒకరు ఉన్నారు. సంవత్సరానికి మన రాష్ట్రంలో వెయ్యిమందికి పైగా విషపు పాముకాటులతో చనిపోతున్నారు. ప్రజల్లో సరైన అవగాహన కల్పించి అవసరమైనప్పుడు “యాంటీ స్నేక్ వీనం” ఇవ్వడం ద్వారా వీరిలో 95 శాతాన్ని బ్రతికించవచ్చు.

 

 

గత దశాబ్ద కాలంలో పాముకాటుకు సరైన వైద్యమేదో చల్లపల్లి చుట్టుప్రక్కల మండలాల్లో కొంతమంది కార్యకర్తలు చేసిన ప్రచారం వల్ల పాముకాటు మరణాలు అనూహ్యంగా తగ్గాయి. దీనిని ఎవరన్నా “కేస్ స్టడీ” చేయవచ్చు.

 

 

పాముకాటు కేసులలో నూటికి 75 విషరహిత పాముకాటులే. విషపు పాముకాటులలో కూడా సగం విషం ఎక్కని ఉత్తుత్తి కాటులే కాబట్టి ప్రమాదం జరుగదు. కాబట్టి నాటు వైద్యంతో (ఏ వైద్యం చెయ్యకపోయినా) నూటికి 90 మంది బ్రతుకుతారు. కాబట్టి యాంటి స్నేక్ వీనం లేని కాలంలో నాటు వైద్యం రోగికి గొప్ప ధైర్యాన్ని ఇచ్చేది కానీ మిగిలిన పదిమంది చనిపోయేవారు.

 

 

మరి ఇప్పుడు మనం పాముకాటు రోగులను “పరంపరగా వస్తున్న పాత వైద్యాన్ని సమర్ధించుదామా – యాంటీ స్నేక్ వీనం ఉన్న ఆసుపత్రులకు వెళ్ళమని చెబుదామా?”

 

 

పాముకాటు నాటు వైద్యానికి వ్యతిరేకంగా మాట్లాడటం సైన్సు పేరుతో దాడి చేయడం అవుతుందా?

 

పసి పిల్లలకు రోజూ ఆముదం పట్టడం ఒకప్పుడు జరిగేది. ఓ పాతిక సంవత్సరాల క్రితం ఆముదం పట్టవద్దు అని చెప్పిన డాక్టర్లను కొరకొర చూసేవారు అమ్మమ్మలు, నాయనమ్మలు. మరి ఇప్పుడు ఆముదం పట్టండి అని చెబితే ఎవరన్నా ఒప్పుకుంటారా? శతాబ్దాల నాటి ఆచారం మాయం అయ్యింది. 5 దశాబ్దాలుగా పిల్లల డాక్టర్లు, తల్లుల డాక్టర్లు, కుటుంబ వైద్యులు ఆముదం పట్టడం వల్ల జరిగే ప్రమాదాలను నిరంతరం వివరించడం ద్వారా మాత్రమే ఈ అలవాటు పోయి పిల్లలకు మేలు జరిగింది కదా!

 

 

“ఉబ్బసం, రక్తపోటు, మధుమేహం, క్యాన్సర్, జలుబులకు ఆధునిక వైద్యం నయం చేయలేదు” అని రాశారు. నయం అంటే మళ్ళీ రాకుండా చేయడం అయితే అది ఏ వైద్య విధానంలోనూ లేదు.

 

 

పై జబ్బులన్నింటిలోను ఆధునిక వైద్యంలో ఎంతో ఉపశమనం ఉంది. సైన్సు ఫలితాలను ఎప్పటికప్పుడు డబ్బున్న వర్గాలు ముందుగానే అనుభవించడం, తెలివిగల వర్గాలు ఆ పరిజ్ఞానాన్ని స్వప్రయోజనాల కోసం మెజార్టీ జనానికి వ్యతిరేకంగా ఉపయోగించుకోవడం చూస్తూనే ఉన్నాం.

 

 

జన విజ్ఞానం (పరంపరగా వచ్చినా, సైంటిస్ట్ ల ద్వారా వచ్చినా) జనం అందరకు చెందాలని కొన్ని సమూహాలు ప్రచారం చేస్తున్నాయి. చేప మందులోని ఔషధ గుణాలను పరీక్షకు పెట్టి, రుజువు చేయాలనుకోవడం ఎలా తప్పు? నిజంగా ఔషధ గుణాలు ఉంటే మనం అందరం ఈ పరంపరగా వస్తున్న శాస్త్రాన్ని ఉపయోగించుకోవలసిందే?

 

 

శుక్రవారం నాడు దురదృష్టకరమైన సంఘటనకు బాధ్యత జనంపై చిత్తశుద్ధి లేని ప్రభుత్వానిది కాక జనం కోసం విజ్ఞానాన్ని పంచే కార్యకర్తలది ఎలా అవుతుంది?

 

 

డా. దాసరి రామకృష్ణ ప్రసాదు

పద్మావతి ఆసుపత్రి

చల్లపల్లి, కృష్ణాజిల్లా, ఆంధ్రప్రదేశ్

 

(శ్రీనివాస్ గారి సంపాదకీయం ఇది….)