అవును… ఆ ఊరికి పరపతి పెరిగింది....           (30-Jun-2020)


అన్నవరం ప్రాథమికోన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు, ఆ ఊరి పెద్దలు వచ్చి వారి స్కూలు ప్రథమ వార్షికోత్సవానికి రమ్మని ఆహ్వానించారు. అన్నవరం, చిర్లపాలెం అనేవి కృష్ణాజిల్లా, మోపిదేవి మండలం లోని రెండు చిన్న గ్రామాలు. రెండూ కలిసే ఉంటాయి. ఈ గ్రామాలు రెండున్నర సంవత్సరాల క్రితం తీసుకున్న నిర్ణయంతో వెలుగులోకి వచాయి. ఊరి ప్రజలంతా వ్యవసాయ కార్మికులు లేదా చిన్న చిన్న మళ్ళలో ఆకుకూరలు పండించుకొని బ్రతుకు గడుపుతున్నవారు. కొంతమంది వంట మేస్త్రిలుగా జీవనం సాగిస్తున్నారు. ఆర్థికంగా చిన్న స్థాయి వారిది.

 

 

మద్యపానం గత 20 సంవత్సరాల నుండి క్రమక్రమంగా పల్లెటూళ్ళలో పెరుగుతూ వచ్చింది. ప్రతి ఊళ్ళో మూడో, నాలుగో బెల్టు షాపులు ఉన్నాయి. మగవాళ్ళల్లో దాదాపు 90 శాతం ఉదయాన్నే కాఫీ, టీలు తాగినట్లుగా మద్యాన్ని సేవిస్తున్న రోజులవి. రోజువారీ సంపాదనలో సింహభాగం తాగేసి, మిగిలింది ఇంటి ఖర్చులకు ఇవ్వడం లేదా అస్సలు ఇవ్వకపోవడం జరుగుతోంది. మహిళలు కష్టపడి పనిచేసి సంపాదించిన సొమ్ముతో ఇళ్ళు గడిచిపోతున్నాయి. డ్వాక్రా గ్రూపులలో దాదాపు అందరు మహిళలూ సభ్యులుగా ఉండి, ఎంతో కొంత పొదుపు చేసుకుంటూ కుటుంబ అవసరాలు నెరవేరుస్తున్నారు. మగాడు సాయంత్రానికి ఇంటికి వస్తే చాలనుకునే రోజులు. ప్రతి పల్లెలోనూ ఇదే పరిస్థితి. 2010 అక్టోబర్ 1వ తేదీ వరకు అన్నవరం, చిర్లపాలెం ఊళ్ళ పరిస్థితీ ఇదే! ఊళ్లోనే ఏడు బెల్టు షాపులుండటం వలన యాభై శాతం మందికి తాగడం అలవాటయ్యింది. తాగుడు తెచ్చే అనారోగ్యాల బారినపడి కొంతమంది చనిపోయారు. ఊళ్ళో గొడవలు ఎక్కువయ్యాయి. కుటుంబ కలహాలు చాలా సాధారణం.

 

 

అయితే 2010 గాంధీ జయంతి రోజున ఆ ఊళ్ళో ప్రజలంతా కలిసి తీసుకున్న నిర్ణయమే ఈరోజు వారికి గుర్తింపు తెచ్చింది. ఊరి పెద్దలంతా సమావేశమై తాగుడు మూలంగా వచ్చే ఈ అనర్దాలన్నీ తగ్గి, ఊరి పరువు కాపాడాలంటే ఊళ్ళో బెల్టు షాపులు ఉండకూడదు అని నిర్ణయించారు. ఆడవారంతా మద్దతు పలికారు. ఈ నిర్ణయాన్ని అమలుపరచని వారికి పదివేల రూపాయలు “తప్పు” (జరిమానా) వేయాలని తీర్మానించారు. నిర్ణయం అయితే చేశారు కానీ, అమలుపరచడం అంత తేలికగా జరుగలేదు. ఓ ముగ్గురికి తప్పు వేసి, వసూలు చేసి గ్రామాభివృద్ధికి ఖర్చు పెట్టారు.

 

 

చల్లపల్లి ‘జనవిజ్ఞాన వేదిక’ కార్యకర్తలకు ఈ ఊరితో సత్సంబంధాలు ఉన్నాయి. ఊరి నిర్ణయాన్ని హర్షించి ఉత్సాహపరిచారు. ఈ నిర్ణయం అమలు జరిపిన సంవత్సరం తర్వాత ఊరి పెద్దలు, జనవిజ్ఞాన వేదిక కార్యకర్తలూ కలిసి పెద్ద బహిరంగ సభను ఏర్పాటు చేశారు. ఆ సంవత్సర కాలంలో ఊరికి జరిగిన మంచి ఏమిటో ఆ ఊరి పెద్దల మాటల్లోంచే చెప్పాలంటే “తాగేవాళ్ళల్లో నూటికి 90 నుండి 95 మంది తాగుడు మానేశారు. ఎవరికన్నా నాలుక పీకితే (తాగాలనిపిస్తే) 5 కి.మీ. దూరంలో ఉన్న మద్యం దుకాణాలకు వెళ్లి తాగి వస్తున్నారు. మేం వాళ్ళను వదిలేస్తున్నాం. తాగినా వచ్చి మెదలకుండా పండుకోవాలంతే! రోడ్డు మీద గాని, ఇంట్లో గాని గొడవ చేస్తే మళ్ళీ మా కమిటీ తప్పు వేస్తుంది. రోజువారీ కూలీతో వచ్చే డబ్బులు, ఆకుకూరలు పండించుకొని ప్రక్క ఊళ్ళల్లో అమ్ముకుంటూ కుటుంబ అవసరాలకు పోనూ మిగిల్చిన డబ్బు బ్యాంకులో వేసుకుంటున్నారు. పిల్లలకు మంచి బట్టలు కొనిపెట్టగలుగు తున్నారు. స్కూలుకు పంపాలన్న శ్రద్ధ పెరిగింది. అదృష్టవశాత్తు ఊళ్ళో ఉన్న ప్రాథమికోన్నత పాఠశాలలో మంచి టీచర్లు ఉండడం వలన అందరూ స్కూలుకు వెళ్తున్నారు. ఏరోజన్నా స్కూలుకు పిల్లవాడు రాకపోతే టీచర్లే ఇంటికి వచ్చి కారణం కనుక్కొని, ఇంటి పరిస్థితులు తెలుసుకొని బాగా చదువుకుంటే వచ్చే ప్రయోజనాలను వివరిస్తున్నారు. నిజాయితీతో పనిచేస్తున్న ఈ టీచర్లకు, మాకు మంచి అనుబంధం ఏర్పడింది. ఏ ఊరు వెళ్ళినా మాతో అందరూ గౌరవంగా మాట్లాడటం జరుగుతోంది. అందుకే మేం చాలా సంతోషంగా ఉన్నాం”.

 

 

ఆనాటి సభలో ప్రముఖ కాన్సర్ సర్జన్ ‘డా. సింహాద్రి చంద్రశేఖర్’ గారి విజ్ఞప్తి మేరకు ఆరోజు నుండి ఆ రెండు ఊళ్లలో గుట్కా, ఖైనీ, పాన్ పరాగ్ లు అమ్మడం మానేశారు.

 

 

ఇదే సమయంలో పశ్చిమ గోదావరి జిల్లా, భీమవరం దగ్గర ఉన్న “కాళ్ళకూరు” గ్రామంలో కూడా ‘డా. పృధ్వీరాజు’ గారి ఆధ్వర్యంలో బెల్టు షాపుల వ్యతిరేక ఉద్యమం జరిగింది. తాత్కాలికంగా షాపులు మూసేశారు. డా. పృధ్వీరాజు గారు ఎంత ప్రయత్నించినా స్థానికులు వీధుల్లోకి వచ్చి నిలబడకపోవడంతో కొద్దికాలానికే మళ్ళీ బెల్టు షాపులు ప్రారంభం అయ్యాయి. “ఎంత గొప్ప పథకం అయినా ప్రజల భాగస్వామ్యం లేనిదే విజయం కాదు” అన్న ‘డా. రజనీకాంత్ అరోలి’ (రామన్ మెగసెసే అవార్డు గ్రహీత) మాటలు గుర్తొచ్చాయి.

 

 

జనవిజ్ఞాన వేదిక కార్యకర్తలు అప్పుడప్పుడు ఈ రెండు గ్రామాలకు వెళ్లి ఆ ప్రజలకు సంఘీభావం తెలియపర్చుతున్నారు.

 

 

2013 మార్చి 31వ తేదీన అన్నవరం ప్రాథమికోన్నత పాఠశాల వార్షికోత్సవం జరిగింది. 70 సంవత్సరాల ఆ పాఠశాల చరిత్రలో అదే మొట్టమొదటి వార్షికోత్సవం. తల్లిదండ్రులే కాక, ఊరి ప్రజలంతా వచ్చి కార్యక్రమం పూర్తయ్యే వరకూ ఉన్న ఆ సభ ఒక ఉత్సవంలాగా జరిగింది. చుట్టుప్రక్కల గ్రామాల టీచర్లు అనేకమంది హాజరయ్యారు. చిన్నపిల్లలతో ఆ టీచర్లు చేయించిన కళారూపాలు అందర్నీ ఆకట్టుకున్నాయి. కృష్ణా, గుంటూరు జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గం నుండి పి.డి.ఎఫ్. అభ్యర్థిగా పోటీ చేసి గెలిచిన బొడ్డు నాగేశ్వరరావు గారు ముఖ్య అతిథిగా వచ్చారు. ఇలా ప్రభుత్వ పాఠశాలలో ఇంత బాగా వార్షికోత్సవం జరగడం, ఊరి ప్రజలు, టీచర్లు ఇంత సన్నిహితంగా ఉండటం తనకు చాలా సంతోషం కలిగించిందన్నారు.

 

 

మిగిలిన వక్తలంతా కూడా ఊరి ప్రజలను, టీచర్లను మెచ్చుకుంటూ “2014లో ఎలక్షన్లు రాబోతున్నాయి, రాజకీయ పార్టీలు రకరకాల ఎత్తుగడలతో మీ ఊరికి మళ్ళీ సారా పారించే అవకాశం ఉంది, మరి మీరేం చేస్తారు?” అని అడిగితే “ససేమిరా ఆ పని జరుగదు” అని ముక్తకంఠంతో సమాధానమిచ్చారు.

 

 

సారా, గుట్కా, పాన్ పరాగ్ లను తరిమివేసిన ఆ ఊరికి మరి పరపతి పెరగదూ!

 

 

డా. దాసరి రామకృష్ణ ప్రసాదు

పద్మావతి ఆసుపత్రి

చల్లపల్లి, కృష్ణాజిల్లా, ఆంద్రప్రదేశ్

తేదీ – 01-05-2013