మానవ సంబంధాలకు మంగళం పాడే నేటి వీర చదువులు అవసరమా?....           (30-Jun-2020)


కొద్దిపాటి పూర్వ పరిచయం గల ఒకాయన ఇటీవల మా ఇంటికి వాళ్ళబ్బాయిని తీసుకు వచ్చాడు. EAMCET లో మంచి ర్యాంకు రావడంతో ఆ అబ్బాయికి ఉస్మానియా మెడికల్ కాలేజీలో డాక్టర్ సీటు వచ్చిందని చెప్పి, స్వీట్లు పంచారు. వారిని అభినందించాను.

 

 

ఇంతవరకూ బాగానే ఉంది కానీ, ఆ తరువాత ఉత్సాహంగా ఆయన చెప్పిన విషయాలే నన్ను ఆలోచింపజేశాయి. తనది చల్లపల్లి దగ్గరలోని గ్రామమనీ, మధ్యతరగతి వ్యవసాయ కుటుంబమనీ, శ్రద్ధగా వ్యవసాయం చేసుకునేవాడననీ ప్రారంభించిన ఆ వ్యక్తి, తన పిల్లలకు స్కూలు వయసు రాగానే బాగా అలోచించి ‘మంచి’ చదువుల కోసం హైదరాబాదుకు తన మకాం మార్చేశానని కొంత తృప్తిగా, కొంత గర్వంగా చెప్పాడు. అప్పటి నుండి గడచిన 15 ఏళ్లలో, ఇక్కడి వ్యవసాయం చూసుకోవడానికి గానీ, బంధుమిత్రుల శుభాశుభ కార్యాల కోసం గాని తానొక్కడే వచ్చి వెళ్ళేవాడనని చెప్పాడు. భార్యను తీసుకొని వస్తే ఎక్కడ పిల్లల చదువులు కుంటుపడతాయోనని తాను మాత్రమే వచ్చి వెళ్ళేవాడట.

 

 

EAMCETలో మెడిసిన్ సీటు వచ్చిన సందర్భంలో ఆ బాబును తన సొంత ఊరుకు వెంటబెట్టుకొని వచ్చి “ఇది మన ఊరు, ఇవే మన పొలాలు, వీళ్ళు మన బంధువులు, వీరేమో మన యిరుగుపొరుగు వాళ్ళు” అని కొందర్ని చూపి పరిచయం చేసాడట. ఆ వరసలోనే ఆ బాబుకు “మన ప్రాంతంలో ఒక డాక్టరు” అని నన్ను పరిచయం చేశాడు. 18 ఏళ్ల ఆ కుర్రవాడి మాట తీరు, చూపులు, ప్రవర్తన చూస్తే నాకెందుకో అతడొక కొత్త లోకానికి చెందినవాడుగా అనిపించింది.

 

 

15 ఏళ్ళపాటు తన మూలాలేమిటో, తన వాళ్ళెవరో తెలియకుండా పెరగటం, చదవటం పిల్లల కవసరమా?

 

 

ఇటీవల నా మిత్రుని ఆఫీసులోకి మరొక చోటు నుండి బదిలీ మీద వచ్చిన 22 ఏళ్ల యువకుని కలుసుకున్నాను. పరిచయంలో భాగంగా “మీదే ఊరు? తల్లిదండ్రులేం చేస్తుంటారు? తోబుట్టువులెందరు?” వంటి ప్రశ్నలడుగుతూ, మీ మేనమామ లెందరు? ఏం చేస్తుంటారు? అని అడిగాను. అతడు వెంటనే తన జేబులోని చిన్న పుస్తకం తీసి, తెరచి,

 

1వ మేనమామ – ఫలానా ఊరు – పోస్టాఫీసులో ఉద్యోగం

2వ మేనమామ – ఫలానా ఊరు – టీచరుగా చేస్తున్నారు

3వ మేనమామ – ఆయన పిల్లల పేర్లు ……

 

అని టకటకా చదివి చెప్పేశాడు. “అదేమిటండీ సొంత మేనమామల పేర్లు కూడా తడుముకొని, పుస్తకం తీసి చదివి సమాచారం యిస్తారేమిటి?” అని అడిగాను. చిన్నప్పటి నుండి చదువుల్లో మునిగి బందువుల ఇళ్ళకు ఎప్పుడూ పోలేదు సార్. వాళ్ళతో పరిచయం తక్కువ. అందుకే యిలా…..” అని బడులిచ్చాడా యువకుడు.

 

 

“మరి వేసవి సెలవుల్లో ఎం చేసేవారు? మీరు వాళ్లనో, వాళ్ళు మిమ్మల్నో కలుస్తారు గదా?” అంటే, “వేసవి సెలవుల్లో మా నాన్నగారు ‘స్పెషల్ కోచింగ్ క్లాసులకు పంపారు. ఎప్పుడైనా మా మేనమామలూ, వాళ్ళ పిల్లలూ వేసవిలో మా ఇంటికి వచ్చేవారు. కాని వారు రాగానే నన్నూ, తమ్ముడిని వేరే గదిలోకి పంపి, చదువుకోమని తలుపులేసేవారు. ఆ తరువాత కొన్నాళ్ళకు వారు కూడా మా దగ్గరకి రావడం తగ్గించారు. అందుచేత ఏదో లీలగా తప్ప వాళ్ళ పరిచయాలేవీ నాకు గుర్తులేవు” అని చెప్పాడు.

 

 

జీవితంలో ఏ రంగంలో రాణించాలన్నా మంచి మానవ సంబంధాలు తప్పనిసరి అని మనకు తెలుసు. నిత్య జీవితంలో మనకు నిజమైన సంతోషాన్నిచ్చే ముఖ్యమైన అంశం కుటుంబంతో, బంధుమిత్రులతో, ఇంకా చుట్టూ గల సమాజంతో ఉన్న మానవ సంబంధాలే కదా!

 

 

కనీసం దగ్గరి బంధువుల పరిచయమైనా లేని ఇలాంటి విద్యార్థులు జీవితంలో స్థిరపడ్డాక ఎవరినుద్ధరించాలి? తాను బ్రతికే సమాజంలోని ఏ రంగంలో, ఏ మార్పులు తేగలరు? బంధు మిత్రులతో, ఇరుగు పొరుగు మనుషులతో కనీస సంబంధాలు లేక, మనసు విప్పి వివిధ విషయాల మీద చర్చించక, కష్ట సుఖాలు కలబోసుకోక, తలుపులు బిడాయించుకొని, వాస్తవ సమాజానికి దూరమై చదువుల్లో మార్కుల్లో మునిగి తేలే యీ పిల్లలు తమ జీవితంలో ఎదురయ్యే సమస్యల నెదుర్కొని పరిష్కరించుకోగలరా?

 

 

మానవ సంబంధాలకు మంగళం పాడే ఇలాంటి చదువులు మనకవసరమా? లేక మానవ సంబంధాలు కూడా పదిలంగా ఉండే చదువులు కావాలా? ఆలోచించండి.

 

 

డా. దాసరి రామకృష్ణ ప్రసాదు

పద్మావతి ఆసుపత్రి

చల్లపల్లి, కృష్ణాజిల్లా, ఆంద్రప్రదేశ్.

 

 

(“ఏం చదువులో… ఏంటో…” పేరుతో ప్రజాశక్తి ఆదివారం పుస్తకం ‘స్నేహ’లో 20-12-2007న ప్రచురితం)