మన పిల్లలు మన పిల్లలు కారు....           (29-Jun-2020)


నేను చిన్నతనంలో ఎంత కష్టపడి చదివాను? కేవలం ప్రతిభతోనే వైద్య కళాశాలలో ప్రవేశం పొంది, డాక్టర్ నై మంచి ఆసుపత్రిని నడుపుతున్నాను. కాని, నా బిడ్డ మాత్రం బాధ్యత తెలుసుకొని కష్టపడి చదవడం లేదు. అంతకన్నా బాధాకరమైన విషయమేమిటంటే, ‘ఎంసెట్ లో సీటు రాకపోతే నాకు మెడిసిన్ సీటెందుకు కొనరు? అని నన్నే ఎదురు ప్రశ్నిస్తున్నాడు. ఎందుకని మన బుద్ధులు మన పిల్లలకు రాలేదంటావ్?..” ఓరోజు ఉదయాన్నే ఒక మిత్రుడు మరో ఆప్తమిత్రునితో ఫోన్ లో తన బాధను వెళ్ళబోసుకున్నాడు.

 

 

ఒకానొక కోటీశ్వరుని కొడుకు రాజభోగాలన్నీ అందుబాటులో ఉండి కూడా రాత్రింబగళ్ళు చదువులో మునిగి తేలుతూ ఎంసెట్ లో ప్రథమ స్థానం పొందాడు. డబ్బున్న పిల్లవాడికి చదువుపై అంత శ్రద్ధ, ఇష్టం ఎలా వచ్చాయి?

 

 

జనంలో మంచి పేరున్న డాక్టర్ సుబ్బారావు గారి అబ్బాయి పండిత పుత్రుడైపోయాడు సరే, ఊళ్ళో జనాన్ని అడుగడుగునా భయపట్టే సంఘ వ్యతిరేక బీజమై పోయాడెందుకనీ?

 

 

వారాలు తింటూ చదువుకొని, పెద్ద ఆఫీసరైన పిచ్చేశ్వర రావుకు పేదరికం, అందులోని కష్టాలు తెలుసు. మరి వాళ్ళ పిల్లలిద్దరికీ పేదలంటే జాలే కలగదెందుకు?

 

 

నిత్యజీవితంలో మనం ఇటువంటి ఎన్నో ప్రశ్నలు ఎదుర్కొంటూంటాం, ఉదాహరణలు చూస్తూనే ఉంటాం. నలుగురు మిత్రులు కలిసినప్పుడు వారి మధ్య ఇటీవల ఇలాంటి మాటలు సాధారణమైపోయాయి. ఇవి మనం అర్థం చేసుకోలేని సమస్యలు కావుగానీ, ఈ ప్రశ్నలకు సమాధానాలు వెతకాలంటే ముందుగా మనం ఇంకో ప్రశ్న వేసుకోవాలి – “మన తల్లిదండ్రులు మనను గురించి కలలు కన్నట్లే, వాళ్ళు కోరుకున్నట్లే మనం ఉన్నామా?” అసలు మన తల్లిదండ్రుల ఆలోచనలతో, రాజకీయ అభిప్రాయాలతో ఇప్పుడు మనం ఏకీభవిస్తున్నామా? ఎందుకిలా జరుగుతున్నది? – తల్లిదండ్రులొక విధంగా అనుకోవడం, పిల్లలు మరోరకంగా తయారవడం?

 

 

సాధారణంగా తాము చిన్ననాడు సాధించలేని పనులన్నీ తమ పిల్లలు సాధించాలని, తమ ఆశలన్నీ నెరవేర్చాలని, తమ బిడ్డల ద్వారా ఎక్కువ పేరు ప్రతిష్టలు పొందాలని తల్లిదండ్రులు కోరుకుంటారు. తమ ఆలోచన, ప్రవర్తన, కోర్కెలు అత్యంత సమంజసమనే వారికనిపిస్తాయి. పిల్లలు అందుకు భిన్నంగా ఆలోచిస్తే, కొత్తగా ప్రవర్తిస్తే, వారి ఊహలకు కొత్త రెక్కలొస్తే పెద్దలు కంగారు పడిపోతారు. పిల్లల ప్రతి చిన్న విషయాన్ని తమ చిన్ననాటి సంఘటనలతో పోల్చి చూసుకుంటూ వారు తమలా లేనందుకు మానసిక సంఘర్షణకు గురౌతారు. మారుతున్న అవసరాలను, ప్రపంచాన్ని, కాలస్వభావాన్ని స్థిమితంగా అవగాహన చేసుకొని సర్డుకుపోలేరు. అందుకే ప్రతి తరం తన అనంతర తరాలతో అసంతృప్తి చెందుతూనే ఉంటుంది. తరాల మధ్య అంతరం, కొత్త పాతల మధ్య సంఘర్షణ ఎప్పటి నుండో జరుగుతున్నదే. కొత్తపాతల మేలు కలయికతోనే సమాజ పురోగమనం సాధ్యపడుతుంది.

 

 

ఈ ప్రకృతిలోని సమస్త జంతువులు రెక్కలు వచ్చి జీవన నైపుణ్యాలు నేర్చుకొని, తమ కాళ్ళ మీద నిలబడే వరకు తమ బిడ్డలకు రక్షణగా నిలవటం చూస్తుంటాం. కొందరు మనుషులు మాత్రం తమ పిల్లలకు 30 ఏళ్ళు దాటినా ఇంకా వాళ్ళను పెంచుతూ, పర్యవేక్షిస్తూ తీరిక లేకుండా ఉండటమే ఆశ్చర్యం కలిగిస్తుంది. అయితే యూరప్, అమెరికా వంటి అభివృద్ధి చెందిన సమాజాలలో తల్లిదండ్రులు పిల్లల స్వేచ్చకు, సృజనశీలతకు అడ్డుపడరు. స్నేహితులు లాగా కొంతమేరకు ప్రోత్సహిస్తారు. తమ ఆస్తులను వాళ్లకు అప్పగించడం కూడా ముఖ్యమనుకోరు. తమ ఆలోచనలను, ఆశలను పిల్లల మీద రుద్దరు. తల్లిదండ్రులు గానీ, ఉపాధ్యాయులు గానీ, పిల్లల్ని దండించడం అక్కడ శిక్షార్హమైన సాంఘిక నేరంగా పరిగణిస్తారు. తమ ఆస్తులను పిల్లలకు కాకుండా సమాజానికి పంచిన ఉదాహరణలు అరుదుగానైనా మన ప్రాంతంలో కూడా చూస్తూనే ఉన్నాం. మన భారతీయ సమాజం ఈ విషయంలో ఇప్పుడే కొద్దిగా మారుతున్నది.

 

 

జీవ పరిణామంలోని చిట్టచివరి అద్భుతమైన మానవ శిశువులు ప్రత్యేకమైన పనుల కోసం ప్రత్యేకమైన ‘జీన్సు’తో పుడతారు. ఓ రకంగా అందరూ కారణజన్ములన్న మాట! ప్రపంచంలోని 700 కోట్ల జనంలో, కవలల్లోనైనా సరే – మనిషిని పోలిన మనిషి ఉండనట్లే, పూర్తిగా ఒకేలాగా ఆలోచించే మనుషులు కూడా ఉండరు. వారు ఒకే కుటుంబంలో వారైనా సరే! ఈ లోకంలోని ఇతర శిశువుల లాగే, తమ బిడ్డ కూడా ఒక అపురూపమైన ప్రత్యేక వ్యక్తిత్వం కలవాడని ఆ తల్లిదండ్రులు ముందుగా తెలుసుకోవాలి. తమ పిల్లల ద్వారా తమ ఆశలు, కలలు నెరవేర్చుకోవడం కాదు చేయవలసింది. మొగ్గ పువ్వుగా విప్పారినట్టు వారిని వారిగానే ఎదగనివ్వాలి, వారిని వారిగానే బతకనివ్వాలి. మొదటి 15 ఏళ్ళు వారికి తగినంత ప్రేమను, చక్కని గృహ వాతావరణాన్ని కల్పించి, వారి అభిరుచులకు తగినట్లుగా పూర్తి స్వేచ్ఛగా, ఆనందంగా పెంచడమే బిడ్డకు ఏ తల్లిదండ్రులైనా ఇవ్వగల గొప్ప బహుమానం! ఇక ఆ వయసు తరువాత అతడు ఏ చదువునెంచుకొని, ఏ వృత్తిలో స్థిరపడి, ఎలా ఎదుగుతున్నాడో చూసి, మంచి స్నేహితుల్లాగా సంతోషపడటమే తల్లిదండ్రులు చేయవలసిన పని.

 

 

నాటిన అన్ని విత్తనాలు మొలకెత్తకపోవచ్చు. మొలకలన్నీ ఒకలాగే మొక్కలై, మానులు కాకపోవచ్చు. అలాగే ఒక వయస్సులోని పిల్లలంతా ఒకేవిధంగా పరిపూర్ణులు కాకపోవచ్చు. ఎవ్వరి అభిరుచుల కనుగుణంగా వారి దారులు ఉంటాయి. అప్పుడప్పుడూ ఆ దారుల్లో రాళ్ళు, ముళ్ళు కూడా ఉండవచ్చు. సమస్యలేవైనా ఎదురైనప్పుడు పెద్దలు వారికి మిత్రులుగా సలహాలిచ్చేవరకే పరిమితం కావాలి. తమ పిల్లలకు రోజువారీ పనులు నేర్పక, వారు చేసే పనులకు అడుగడుగునా అడ్డుతగులుతూ, వారి పనులన్నే తామే చేసిపెడుతూ, అతిగారాబం చేయడం మంచి తల్లిదండ్రుల లక్షణం కాదు. తమ పిల్లలు సంపూర్ణ ఆరోగ్యంతో నిండు నూరేళ్ళ జీవితం గడపాలని, వారి కాళ్ళ మీద వాళ్ళు నిలబడే సమర్ధులు కావాలనీ, సంఘ వ్యతిరేక శక్తులు కాకూడదనీ, తమ శక్తివంచన లేకుండా తోటివారికి సహాయపడే వారు కావాలనీ, మంచికీ, మానవత్వానికీ ప్రతీకలుగా బతకాలనీ, పెద్దలను గౌరవించాలనీ, నిజాయితీగా జీవించాలనీ తల్లిదండ్రులు కోరుకోవడం సమంజసం. అంతకు మించి వారిపైన గొంతెమ్మ కోరికలు పెట్టుకొని వారిని వత్తిడి చేసి తాము ఆందోళనలు చెందే తల్లిదండ్రులకు నిజమైన సంతోషం మిగలదు.

 

 

డా. దాసరి రామకృష్ణ ప్రసాదు

పద్మావతి ఆసుపత్రి

చల్లపల్లి, కృష్ణాజిల్లా, ఆంద్రప్రదేశ్.

 

 

(ఈ వ్యాసం ‘అదే గొప్ప బహుమానం’ పేరుతో ప్రజాశక్తి ఆదివారం పుస్తకం ‘స్నేహ’లో 17-10-2010 న ప్రచురింపబడినది.)