బాబోయ్ పరాయీకరణ!!!....           (29-Jun-2020)


(28-09-2014 ‘స్నేహ’లో “పులుల మధ్య” చదివాక హృదయస్పందన)

 

 

GATT ఒప్పందం పైన భారతదేశం సంతకం పెట్టవద్దని ఒత్తిడి చేస్తూ స్వచ్ఛంద సంస్థలు కొన్ని గత శతాబ్ది 9వ దశకంలో దేశవ్యాప్తంగా ఉద్యమాలు చేశాయి. అందులో భాగంగా చల్లపల్లి జనవిజ్ఞాన వేదిక ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మహావక్త డాక్టర్ బ్రహ్మారెడ్డి భారతదేశం ‘గాట్’ ఒప్పందం చేసుకొని ప్రపంచీకరణలో కలిస్తే వచ్చే దుష్పలితాలను మనసుకు హత్తుకొనేలా వివరించారు. తన ఉపన్యాసానికి కొసమెరుపుగా ఆయన చెప్పిన మాటలు ఏ ఒక్కరోజూ మేం మరిచిపోలేం. ‘పెట్టుబడిదారి అగ్రదేశాలు భారతీయులతో “అయ్యా! ఎన్నటికీ మేం మీ పీకలు పిసకం – కాని, మీ పీకలు మీరే పిసుక్కోవాలి, తప్పదు” అంటున్నాయి. అందుకని యిప్పుడు మనమే తేల్చుకోవాలి మరి’ అని. 20 ఏళ్ల తర్వాత పూర్వాపరాలు చూసుకొంటే కనిపిస్తున్న దేమిటి? ప్రపంచీకరణ వేగంగా జరిగిపోయి మన జనం వినిమయ సంస్కృతిలో భాగామైపోయారు. ఇప్పటి యువతరాన్ని చూస్తే – ‘గాట్’ ఒప్పందమే తెలియని వాళ్ళే ఎక్కువ. ఆ ఒప్పందం తర్వాత పుట్టి, ప్రపంచీకరణ నేపధ్యంలో పెరిగిన వాళ్ళు మరి! గత కాలపు కష్టాలు గాని, మానవ విలువలు గాని వారికి తెలిసే అవకాశం లేకుండా పోయింది. పెద్దలైనా పిల్లలకవి వివరించే సంస్కృతి అడుగంటింది. పాఠశాలల్లో, కళాశాలల్లో బట్టీపట్టైనా సరే ‘ఎక్కువ మార్కులు తెచ్చుకోవడమే’ ప్రతిభకు కొలబద్ద. “ఏ విద్యాసంస్థలో చదివిస్తే ఎక్కువ మార్కులు వస్తాయి, ఆంగ్లం బాగా వస్తుంది, తమ పిల్లలు విదేశాలకు పోయి, మరింత ఎక్కువ సంపాదనా పరులౌతారు…..” అనేదే తల్లిదండ్రులకు ప్రామాణికమై పోయింది.

 

 

ఇటీవల ఒక యువ డాక్టరును కలిసినప్పుడు వైద్యవృత్తి పవిత్రత పైన ఒక పత్రికలో వచ్చిన వ్యాసాన్ని చదవమని ఇచ్చారు. అతనా కాగితాన్ని పట్టుకొని ఎగాదిగా చూస్తుంటే “ఏం బాబూ! తెలుగు చదవడం రాదా?” అని అడిగాను. “మా ఆవిడకు తెలుగు బాగా వచ్చు. ఆమెతో చదివించుకుంటాలెండి” అన్నాడు. తెలుగుదేశం నడిబొడ్డున పుట్టి, పెరిగి తెలుగు చదవడం, రాయడం రాని, అందుకు సిగ్గుపడని విద్యాధికుల సంఖ్య మన కళ్ళ ముందే పెరిగిపోతున్నది.

 

 

తెలుగు నాటకరంగం క్రమంగా కనుమరుగైపోయి సినిమాలు, టీ.వీ.లు మాత్రమే వినోద సాధనాలుగా మిగిలాయి. ఇక ఈ ప్రేక్షకులలో కూడా కేవలం హాలీవుడ్ ఇంగ్లీషు సినిమాలు మాత్రమే ఇష్టపడుతూ, అ ‘విజ్ఞానాన్ని’ మాత్రమే పెంచుకొంటూ, వాటిని గురించి మాత్రమే మాట్లాడుకొనే యువతీ యువకుల సంఖ్య కూడా తక్కువేమీ కాదు. కార్పొరేటీకరణ చేయబడిన విద్యదే దీనిలో కీలక పాత్ర! నిన్నటిదాకా పట్టాణాలనుద్ధరించి, ఇప్పుడు పల్లెలకు కూడా పాకిన కార్పొరేట్ విద్య వల్ల మన మూలాలు మనకు తెలియకుండా పోతున్నవి. ఓ పదేళ్ళ తరువాత ఈ పరాయీకరణ ఎంత దూరం పోతుందో ఊహించుకొంటేనే భయంగా ఉంది.

 

 

మన భాషను, సాహిత్యాన్ని, సంస్కృతిని మనం పూర్తిగా మరిచిపోతాం.
మన పొలాల్లోకి పంట విత్తనాలను మనం తయారు చేసుకోలేం.
చిన్న వ్యాపారాలన్నిటినీ స్వదేశీ, విదేశీ ‘మాల్స్’ మింగేస్తాయి.
విద్య పూర్తిగా ప్రైవేటుపరమై, సామాన్యుల కందుబాటులో ఉండదు.
ప్రభుత్వ వైద్యం మరింతగా నామమాత్రమై, చుక్కల్లో ఉండే కార్పొరేట్ వైద్యం మాత్రమే దిక్కవుతుంది. అమెరికాలో వలెనే వైద్యరంగాన్ని ఇన్సూరెన్స్ కంపెనీలు శాసిస్తాయి.
పులిని చూసి నక్కలు వాతలు పెట్టుకోవలసి వస్తుంది.


మరి మనం ఇవన్నీ చూస్తూ “మౌనమె నీ భాష ఓ మూగమనసా……….” అని ఊరుకోవలసిందేనా?

 

 

డా. దాసరి రామకృష్ణ ప్రసాదు

పద్మావతి ఆసుపత్రి

చల్లపల్లి, కృష్ణాజిల్లా, ఆంద్రప్రదేశ్.