మెరుగైన సమాజం కావాలంటే…?....           (29-Jun-2020)


నిషి ఆశాజీవి. నేటి కన్నా రేపు బాగుండాలనే ఆకాంక్ష అతని స్వభావం. ఇప్పుడున్న మన జీవన పరిస్థితులు అన్ని రంగాలలో మరింత మెరుగవ్వాలనుకోవడం మానవుని సహజమైన కోరిక. మనిషిలో ఉన్న ఈ అనంతమైన తపనే చిరకాలంగా సమాజాభివృద్ధికి తోడ్పడుతూ వస్తున్నది.

 

 

అబివృద్ది అంటే?

జీవన ప్రమాణాలు పెరగడం, తక్కువ శ్రమతో వసతి సౌకర్యాలు సమకూర్చుకోవడం, సంపూర్ణ ఆరోగ్యంతో సహజ మరణం సంభవించేంత వరకూ నిశ్చింతగా బ్రతకడమే అభివృద్ధిగా చెప్పవచ్చు. ఆహార లోపాలను, వాతావరణ కాలుష్యాలను, అంటు రోగాలను, యాక్సిడెంట్లను, ప్రకృతి విపత్తులను అధిగమిస్తే ఇది సాధ్యపడుతుంది. తగినంత శరీర వ్యాయామం చేస్తూ, ధూమపాన, మద్యపాన వ్యసనాలకు పాల్పడకుంటే ఉన్నత జీవన ప్రమాణాల నందుకోవచ్చు.

 

 

మానవుని సగటు ఆయుర్దాయం 1850 నాటికి 30 ఏళ్లకన్నా తక్కువే. అప్పటికే అభివృద్ధి చెందిన ఇంగ్లండులో ఉన్నత వర్గాల ఆయుష్షు 44గా, శ్రామిక జనుల ఆయుష్షు 22 గా ఉండేది. ఐరోపా దేశాలలో ఇది 1920 నాటికే 70 ఏళ్లకు పెరిగింది.

 

 

ఉష్ణ వాతావరణానికి విరుగుడుగా AC లు, అతిశీతల పరిస్థితులను తట్టుకోవడానికి రూమ్ హీటర్లు, వరదల వల్ల ప్రాణ నష్టం జరగకుండా ఆనకట్టలు, కరకట్టలు, తుఫానులు భూకంపాల వంటి ప్రకృతి బీభత్సాల నుండి కాపాడే కాంక్రీటు నిర్మాణాలు, రోగాల నుండి బ్రతికించే మందులు, వ్యాక్సిన్లు ప్రస్తుతం మనల్ని రక్షిస్తున్నాయి.

 

 

‘అభివృద్ధి చెందినది’ అనబడే దేశంలో ఆహార కొరత ఉండకూడదు. అందరికీ నివాసయోగ్యమైన ఇల్లు, సరైన బట్టలు ఉండాలి. శాస్త్రీయమైన విద్య, వైద్యం, ప్రయాణ సౌకర్యాలు లభించాలి. తక్కువ శ్రమతో ఎక్కవ మందికి విస్తృత ఫలితాలనందించ గల పరిశ్రమలేర్పడాలి. అందుకు ఆయా ప్రాంతాలలోని సహజ వనరుల్ని ఉపయోగించుకొని వాటిని అభివృద్ధి చేసుకోవాలి.

 

 

అయితే, ఇలాంటి కృషి మన దేశంలో జరుగుతున్నదా అనేదే అసలు ప్రశ్న. 116 కోట్ల ప్రజలు, విభిన్న వాతావరణాలు, ఎన్నెన్నో సమస్యలు ఉన్న మన దేశ అవసరాలను దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు మనం చేయవలసిన ప్రయత్నాలేవి?

 

 

పరిశోధనల ప్రయోజనం?

ఐరోపా, అమెరికా, కెనడా, జపాన్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ వంటి దేశాలను పరిశీలిస్తే వారి అభివృద్ధి ప్రణాళిక అర్థం అవుతుంది. వ్యయ ప్రయాసలను లెక్కచేయక వివిధ రంగాలలో వాళ్ళు ‘పరిశోధన’ (RESEARCH) లను ప్రోత్సహిస్తూ, తమ సహజ వనరుల్ని సక్రమంగా ఉపయోగించుకోగలుగుతున్నారు. ఇందుకు అవసరమనుకొంటే వివిధ దేశాల మేధావులను ఆహ్వానించి, ప్రోత్సహిస్తున్నారు.

 

 

ఇదంతా వాళ్ళు మాత్రమే ఎందుకు చేయగల్గుతున్నారు? పుష్కలంగా సహజ వనరులు, నిపుణులైన శ్రామికులు, అధిక సంఖ్యలో పట్టభద్రులు ఉండి కూడా మనం ఎందుకు వెనుకబడుతున్నాము అని ఆలోచిస్తే, ఆయా సమాజాలు తమ పిల్లల విద్యపైన పెట్టే శ్రమ, శ్రద్దే దీనికి మూలకారణమని స్ఫురిస్తున్నది.

 

 

వ్యక్తిత్వాల పాత్ర ఎంత?

ఒకరి రూపురేఖలు ప్రపంచంలోని 700 కోట్ల మందిలో మరే ఒక్కరికీ ఉండనట్లే, ఒక వ్యక్తి మనస్తత్వం గాని, శక్తి సామర్ధ్యాలు కాని, ఇష్టాయిష్టాలు గాని వేరొకరికి ఉండనే ఉండవు. అందుచేతనే ప్రతి బిడ్డ ఒక ప్రత్యేక వ్యక్తి అనీ, మరొకరికి నకలు కానే కాదనీ మనం గుర్తుపెట్టుకోవాలి. పుట్టుకతోనే ప్రతి బిడ్డ అవధులు లేని సృజనాత్మకతతో పుడతాడు.

 

 

జీవ పరిణామంలో చిట్టచివరి అద్భుతంగా జన్మించిన ఈ మానవ శిశువుల అంతులేని సృజనాత్మకతను పోగొట్టకుండా, ప్రోత్సహిస్తూ, పరిసరాల పట్ల, సమాజం పట్ల క్రమంగా అవగాహన కల్గించాలి. తనకు నచ్చిన అంశాలలో మాత్రమే బిడ్డ సక్రమంగా ఎదగగలడు కనుక తల్లిదండ్రులు, సమాజం అతడిని అర్థం చేసుకొని,ప్రోత్సహించాలి.

 

 

శిక్షా? శిక్షణా?

అందుకు భిన్నంగా పిల్లలు ఏ బట్టలు వేసుకోవాలో, ఎలా ప్రవర్తించాలో, ఏది చదవాలో, ఎలా బ్రతకాలో పెద్దవాళ్ళే నిర్ణయించి, శాసిస్తుంటే, అలాంటి పిల్లల్లో మానసిక ఎదుగుదల ఉంటుందా? వారిలోని సృజనాత్మకత బ్రతుకుతుందా? ఆ తరువాత పెద్దల నిర్ణయం ప్రకారం వారిని పాఠశాలలో వేసి, అక్కడి ఉపాధ్యాయులు కూడా ఆ పిల్లల అభిరుచుల్ని గమనించక, బలవంతంగా యిష్టంలేని అంశాలు బోధిస్తూ పోతే, వారు తమ సృజనాత్మకతను మరింతగా పోగొట్టుకొని, యంత్రాల్లా రూపొందుతారు. మరి ఈ యంత్రాలు – ఈ భావిభారత పౌరులు తమ సమాజాభివృద్ధికి ఏవిధంగా తోడ్పడతారు? కనుక మన పాఠశాల విద్యా ప్రణాళిక పిల్లల సృజనశీలతను పెంపొందించేదిగా ఉంటే తప్ప భవిష్యత్ సమస్యల నెదుర్కొనగల మేధావులుద్భవించరు.

 

 

బోధనా భాష?

ఒక మనిషి జీవితం ఎలా ఉండబోతుందో నిర్దేశించేది మొదటి 15 సంవత్సరాల కాలమే అని పరిశోధనలు చెపుతున్నాయి. మరీ ముఖ్యంగా మొదటి 7 సంవత్సరాల కాలంలోనే పిల్లల మెదడులో భాషా సంబంధాలు స్థిరపడతాయి. కనుక బిడ్డ యొక్క ఇంటి పరిసరాలలో ఉండే భాష ద్వారానే ప్రాథమిక విద్యాబోధన జరగాలి. ఆ తరువాత ఎన్ని భాషలనైనా నేర్చుకొనే సత్తా పిల్లలకు వస్తుంది. బాల్యదశలో విద్యాభ్యాసం మాతృభాషలో జరిగితేనే బిడ్డకు విషయ పరిజ్ఞానం పెరిగి, అవగాహన ఏర్పడి, తదనంతర కాలంలో ఐచ్చికంగా తాను ఎన్నుకున్న కోర్సులలో పరిపూర్ణుడు కాగలడు. సహజసిద్ధమైన తన క్రియేటివిటీతో, విషయ పరిపూర్ణతతో, అతడు భవిష్యత్తులో ప్రయోజనకరమైన వ్యక్తిగా రూపొందగలడు.

 

 

అత్యంత ప్రధానమైన ఈ విషయం మీద మనం శ్రద్ధ చూపనంత వరకు మన సమాజంలో విద్యావంతులకు బదులు మరమనుషులు తయారౌతూనే ఉంటారు. విద్యాభ్యాస కాలంలో సొంత ఆలోచనలతో వికసించే వ్యక్తులు మాత్రమే మన ప్రస్తుత సామాజిక సమస్యలైన –

 

 

ఆహార లోపాలను
ఆర్ధిక అసమానతలను
రాజకీయ పెడ ధోరణులను
సమాజంలోని బాధ్యతా రాహిత్యాన్ని
దోపిడీ మనస్తత్త్వాన్ని
పర్యావరణానికి జరుగుతున్న ప్రమాదాలను
శాస్త్ర పరిశోధనా రంగంలోని లోపాలను
అసమంజసమైన జీవన శైలిని
అశాస్త్రీయ విద్యా విధానాలను


గురించి ఆలోచించగలరు, పరిష్కరించగలరు. అలాంటి స్వయం నిర్మిత వ్యక్తుల (Self Made Persons) ను రూపొందించుకోవాలంటే పాఠశాల విద్యాబోధన మాతృభాషలోనే జరగాలి.

ఆ విద్యా ప్రణాళికలో కూడా పిల్లల సహజసిద్ధమైన సృజనాత్మకతను పెంపొందించే మార్పులకు నాంది పలకాలి.

తమ భవిష్యత్తును నిర్ణయించుకొనే స్వేచ్ఛను, ఇష్టమైన కోర్సులు చదువుకునే స్వాతంత్ర్యాన్ని పిల్లలకు ఇవ్వాలి.

 


డా. దాసరి రామకృష్ణ ప్రసాదు

పద్మావతి ఆసుపత్రి

చల్లపల్లి, కృష్ణాజిల్లా, ఆంద్రప్రదేశ్.