విద్యార్థుల ఆత్మహత్యలకు బాధ్యులెవరు?....           (29-Jun-2020)


పరీక్ష సరిగా రాయలేదని తండ్రి తిట్టాడని ఓ విద్యార్థి ఆత్మహత్య

 

తల్లిదండ్రుల ఆశలు నెరవేర్చలేక పోతున్నానన్న బెంగతో ఓ ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య
హైస్కూలు స్థాయి నుండి క్లాసు ఫస్ట్ తెచ్చుకుంటూ, మొట్టమొదటిసారే కాన్పూరు ఐ.ఐ.టి.లో సీటు సంపాదించుకున్న విద్యార్థి కాలేజీలో ఆత్మహత్య
ఎంతో కష్టపడి ఎం.బి.బి.ఎస్. సీటు తెచ్చుకొని ఎక్కడా తప్పకుండా పి.జి. సీటు కూడా మొదటిసారే తెచ్చుకున్నది డా. జానకి. పి.జి. ఫైనల్ పరీక్షలో తొలివిడతే పాసవ్వలేదని ఆత్మహత్య చేసుకుంది.
డాక్టర్లకూ, ఇంజనీర్లకే కాదు ఆడిటర్ లకూ మంచి భవిష్యత్తు ఉందని సి.ఎ. కోర్సులు చాలామంది చేస్తున్నారు. ఆ కళాశాల పిల్లలు కూడా ఆత్మహత్యలు చేసుకోవడం చూస్తున్నాం.


ఇవన్నీ తరచూ మనం దినపత్రికలలో చూసే వార్తలు. ఓ పాతికేళ్ళ క్రితం విద్యార్థులలో ఇన్ని ఆత్మహత్యలు లేవు. మరి ఈ పాతికేళ్లలో వచ్చిన ఈ మార్పు ఏమిటి? దీనికి కారణం ఎవరు? తల్లిదండ్రులా? టీచర్లా? కళాశాల యాజమాన్యమా? లేక విద్యార్ధులేనా? ఇందులో ప్రభుత్వ పాత్ర ఎంత?

 

 

ప్రతి సమాజంలోనూ ఎన్నో కొన్ని ఆత్మహత్యలు ఉంటూనే ఉంటాయి. ప్రత్తిరైతుల ఆత్మహత్యలు, కౌలు రైతుల ఆత్మహత్యలు, వడ్డీ వ్యాపారుల బాధలు తట్టుకోలేక, తీర్చలేక ఆత్మహత్యలు, వ్యాపారంలో నష్టాలు – ఇవన్నీ ఆర్థికంగా కోలుకోలేని నష్టాలు రావడం వలన జరిగే ఆత్మహత్యలు. మెగాస్టార్ చిరంజీవి తమ్ముడు నాగేంద్ర బాబు కూడా “ఆరంజ్” సినిమాలో వచ్చిన నష్టాల వల్ల అప్పుల పాలవ్వడంతో “ఆత్మహత్య” చేసుకోవాలనిపించిందని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. ప్రేమలు విఫలమై కొందరు, కుటుంబసభ్యులతో వచ్చిన విభేదాలను తట్టుకోలేక మరికొందరు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు.

 

 

ఇవన్నీ ఒక ఎత్తు, విద్యార్థుల ఆత్మహత్యలు ఒక ఎత్తు. ప్రాథమిక స్థాయి విద్యార్థుల నుండి మానసిక ఒత్తిడి మొదలవుతోంది. క్లాసులో ర్యాంకుల మోత. “ఫస్ట్ ఇన్ క్లాస్” అని బోర్డు తగిలించుకుని ఒక కుర్రవాడు ఉంటాడు. ఆ బాడ్జ్ తాను కోల్పోకూడదని అతను, తమ సొంతం చేసుకుందామని మరికొందరు ఒత్తిడికి గురవుతూ ఉంటారు. కుటుంబ స్నేహితుల ఇళ్ళకు వెళ్తే ఏం చదువుతున్నావు? అని అడిగిన తర్వాత రెండవ ప్రశ్న సాధారణంగా ఫస్ట్ ర్యాంకే గదా అంటారు. తమ్ముడు బాగా చదువుతాడా, నువ్వు బాగా చదువుతావా అని అడుగుతారు. ఈ పోలికలు మరోరకం ఒత్తిడి.

 

 

బాగా చదివే పిల్లలు మంచి పోట్లగిత్తల లాంటివారు. పందెం గెలవాలని గిత్తల యజమాని ఎలా కోరుకుంటాడో అలాగే స్కూలు, కాలేజీల యాజమాన్యం కూడా ఈ బాగా చదివే విద్యార్థితో మరింత బాగా చదివించి, ర్యాంకు తెప్పించాలని ప్రయత్నిస్తారు. చెర్నాకోలతో విపరీతంగా బాది గిత్తలను పరుగెత్తించినట్లు విద్యార్థులను మానసికంగా ఒత్తిడి చేసి మరిన్ని గంటలు చదవడానికి ప్రోత్సహిస్తారు. వీరే టౌన్ ఫస్ట్, మండలం ఫస్ట్, జిల్లా ఫస్ట్ ర్యాంకర్లు. సరైన ర్యాంక్ రాకపోతే తల్లిదండ్రులు కూడా నిరుత్సాహ పడుతున్నారు. ఈ రేసులో వెనుకబడిన వారు, నిరుత్సాహపడిన వారు ఈ మానసిక ఒత్తిడి భరించలేక ఆత్మహత్య చేసుకొంటున్నారు.

 

 

పదవ తరగతి వరకూ పోటీ పరీక్షలు కావు. ఆ మార్కులు ఎందుకూ ఉపయోగపడవు. ఇక ఇంటర్మీడియట్ నుండి అసలు కథ మొదలవుతుంది. ఇంజనీరింగ్, మెడిసిన్ లలో సీటు కోసం ఉదయం 5 గంటలకు లేస్తే, రాత్రి 10 గంటల తర్వాతే నిద్ర. ఎంతో శక్తివంతమైన యవ్వన దశలో అలా 12 నుండి 16 గంటలు ఏ ఆటా లేకుండా కూర్చోవడం పెద్ద శిక్ష. తల్లిదండ్రులు కూడా ఎలాగో అలాగా వాళ్ళ బిడ్డ కష్టపడి సీటు తెచ్చుకుంటే చాలు అనుకొంటున్నారు. కళాశాలల్లో “మోటివేషన్” క్లాసుల పేరుతో జరిగే ఉపన్యాసాలలో ఎక్కువ భాగం ప్రక్కవాడిని త్రొక్కి అయినా పైకి వెళ్ళడమే ప్రధానం అనే అంశమే ఉంటుంది. డబ్బుతో కొనగల వస్తువులు గత పాతికేళ్ళలో చాలా వచ్చాయి. వస్తువులను అధికంగా ఉత్పత్తి చేసి అమ్ముకోవడం పెట్టుబడిదారీ సహజ లక్షణం. మంచి కెరీర్ కోసం చేసే ప్రయత్నంలో ఎంతో ఒత్తిడికి, అవమానాలకు విద్యార్థులు గురవుతున్నారు. ఈ ఒత్తిడిని, అవమానాలను తట్టుకోలేక ఆత్మహత్యే శరణ్యం అనుకునేవారూ పెరుగుతున్నారు. గతంలో ఎవరన్నా కాస్త దిగులుగా కనిపిస్తే స్నేహితులు భుజం మీద చెయ్యి వేసి కాస్సేపు బయటకు తీసుకువెళ్ళి ఓదార్చడం, ధైర్యం చెప్పడం జరిగేది. ఇప్పుడు అలాంటి స్నేహాలు కుదరడం లేదు. ప్రక్కవాడి కోసం సమయం వెచ్చించాలంటే రోజువారీ పరీక్షలోనో, వారాంతపు పరీక్షలోనో తాను దెబ్బ తింటాడు కాబట్టి స్నేహితులు కూడా పట్టించుకోవడం సాధ్యం కావడం లేదు.

 

 

ఆడుతూ, పాడుతూ సాగవలసిన బాల్యాన్ని, యవ్వనాన్ని తల్లిదండ్రులూ, సమాజం ఎంతో ఒత్తిడికి గురి చేస్తున్నాయి. అందుకే ఈ ఆత్మహత్యల పెరుగుదల.

 

 

పెట్టుబడిదారీ సమాజంలో అంతర్భాగంగా ఉన్న కార్పోరేట్ కాలేజీలు, చిత్తశుద్ధి లేని ప్రభుత్వాల తంతును చూస్తుంటే “రాహుల్ సాన్ కృత్యాయన్” మాటలు గుర్తొస్తున్నాయి.

 

 

“ఈ దుష్ట సమాజం పతనం కాక తప్పదు”.

 

 

డా. దాసరి రామకృష్ణ ప్రసాదు

పద్మావతి ఆసుపత్రి

చల్లపల్లి, కృష్ణాజిల్లా, ఆంద్రప్రదేశ్

 

 

28-06-2013 వ తేదీన ‘ప్రజాశక్తి’ దినపత్రికలో ప్రచురించబడినది.