ఓటర్లు డబ్బు తీసుకోకూడదా!....           (29-Jun-2020)


2014 అసెంబ్లీ ఎన్నికల ముందు జరిగిన మండల, జిల్లా పరిషత్ ఎన్నికల సందర్భంగా ఓటర్లు డబ్బు తీసుకోకూడదని మేము చేసిన ప్రచార ఉద్యమం తరువాత నాకు కలిగిన భావాలు.

 

 

ఓటర్లు డబ్బు తీసుకోకూడదా!

 

 

మిత్రులారా!

 

“ఓట్లను అమ్మవద్దు – కొనవద్దు” అని చల్లపల్లి పరిసర ప్రాంతాలలో మేం చేసిన ప్రచారాన్ని టీవీలలో, దినపత్రికలలో చూసి చాలామంది మిత్రులు అభినందిస్తున్నారు. ఈ సందర్భంగా మాకు వచ్చిన కొన్ని అనుభవాల్ని, ఆలోచనల్ని మీతో పంచుకోవాలనిపిస్తోంది.

 

 

ఓట్లు అమ్ముకోవడం, కొనడం ప్రజాస్వామ్యానికి ప్రమాదం అని భావించి చల్లపల్లిలో మండల, జిల్లా పరిషత్ ఎన్నికలకు ముందు కొంతమందిమి ఒక సమావేశం ఏర్పాటు చేసుకున్నాం. ఎంతో ఉత్సాహంగా 63 మంది హాజరయిన ఆ సభ “ప్రజాస్వామ్య పరిరక్షణ వేదిక” అనే సంస్థను ఏర్పరిచింది.

 

 

మేం ఎవ్వరం ఎన్నికలలో నిలబడం.
మీరందరూ తప్పక ఓటు వేయండి.
నచ్చిన వారికే ఓటు వేయండి కానీ ప్రలోభాలకు లొంగవద్దు. డబ్బు, సారా, చీరలు, కాలిపట్టాలు వగైరాలు తీసుకోవద్దు.


ఈరకంగా ప్రచారం చేయాలని తీర్మానించాం. ఎన్నికలలో అభ్యర్ధుల తరఫున ప్రచారం చేస్తున్న వారిని ఈ ప్రచారానికి అనుమతించలేదు.

 

 

రెండు నిమిషాల “ఉపన్యాసం”, రెండు నిమిషాల “పాట” పెన్ డ్రైవ్ లో రికార్డు చేసాం. ఒక కరపత్రం ప్రచురించాం. ఉదయం 5 గంటల నుండి 6 గంటల వరకు మైకులో పాట, ఉపన్యాసం వినిపిస్తూ ఇంటింటికీ కరపత్రాన్ని పంచాం. అయితే ఉదయం 6 గంటల లోపు ఎక్కువమంది నిద్ర లేవడం లేదని గమనించాం. సాయంత్రం 5 గంటల నుండి 8 గంటల వరకు రోజుకో ప్రాంతం చొప్పున 15 నుండి 30 మంది వరకూ ఇంటింటికీ తిరిగి కరపత్రాన్ని ఇస్తూ ఓట్లకు డబ్బు, సారా తీసుకుంటే వచ్చే నష్టాన్ని వివరించాం. దినపత్రికలలో కూడా కరపత్రాలను పంచాం.

 

 

ఫలితాలు :

కొంతమంది ఈ ప్రచారానికి చాలా సంతోషపడి మాతోపాటు ఆయా పేటలలో తిరుగుతూ ప్రచారానికి తోడ్పడ్డారు.

మరి కొంతమంది అభినందించారు. ప్రలోభాలకు లొంగకుండా ఉండే తమలాంటి వారు ఇంతమంది ఉన్నందుకు సంతోషించారు.

 

పైన చెప్పిన రెండురకాలలో ఎక్కువమంది – చదువుకున్నవారు, ఉద్యోగులు, విశ్రాంత ఉద్యోగులు.
మరి కొంతమంది “ఎందుకు తీసుకోకూడదు? వాళ్ళ సొంత డబ్బేమైనా ఇస్తున్నారా? గెలిచిన తర్వాత సంపాదించుకోరా?” అని ప్రశ్నలు సంధించారు.


కొంతమంది “ఇది జరిగే పనా? వీళ్ళు ఎన్నాళ్ళిలా తిరిగి ప్రచారం చేసి, ఎంతమందిని మారుస్తారు? అన్ని పార్టీలు డబ్బు, సారా పంచుతుంటే – అందరూ తీసుకొంటుంటే ఆపడం సాధ్యపడదు” అని తేల్చేశారు.
మరికొంతమంది చెప్పింది మౌనంగా విన్నారు. (బహుశా లౌక్యం కావచ్చు)


అదలా ఉంటే – వెళ్ళిన చోట్లలో చాలా ప్రదేశాలలో సరైన రోడ్లు లేకపోవడం, డ్రెయినేజ్ సరిగా పారక మురుగు పేరుకుపోవడం, రోడ్ల ప్రక్కన చెత్త పేరుకొని ఉండటం, సారాకు అలవాటు పడ్డ మగవాళ్ళ వలన వచ్చే కుటుంబ సమస్యలు పెరిగిపోవడం గమనించాం. ప్లాస్టిక్ సంచుల విశ్వరూపం చూశాం.

 

 

18 సంవత్సరాల వయస్సున్న కాలేజీ విద్యార్థుల నుండి 76 సంవత్సరాల వయస్సున్న విశ్రాంత ఉద్యోగుల వరకూ ఈ ప్రచారంలో పాల్గొన్నారు. ఒక కార్యకర్త మా ప్రచారానికి విలువ కట్టాడు. సరాసరి 15 మంది రోజుకు కనీసం 3 గంటల చొప్పున 15 రోజులు ప్రచారం చేశాం అనుకుంటే, ఇలాగే ఎలక్షన్లలో నిలబడ్డ నాయకునికి ప్రచారానికి అయ్యే ఖర్చు పూటకు మనిషికి 200 రూపాయలు + ఒక క్వార్టరు బాటిల్ సారా అంటే 300 x 15 మంది x 15 రోజులు = 67,500 రూపాయలు.

 

 

వారంతట వారే దినపత్రికల విలేఖర్లు వచ్చి పత్రికలలో వార్తలు రాశారు. ఈటీవి-2 వారు విజయవాడ నుండి వచ్చి ఒక వీడియో తీసుకున్నారు. దానిలోని క్లిప్పింగ్స్ చాలాసార్లు ప్రచారం చేశారు. ఈనాడు పత్రికలో ప్రచురించారు. జడ్.పి.టి.సి., ఎమ్.పి.టి.సి. ఎలక్షవ్ల ముందు రోజు వరకు గట్టిగా ఈ ప్రచారం సాగింది.

 

 

మేం ప్రచారానికి వెళ్ళని నూకలవారి పాలెం వంటి చిన్న గ్రామంలో పోలింగుకు ముందు రోజు కొంతమంది యువకులు గ్రామంలోకి మద్యం, డబ్బు రాకూడదని ప్రతిఘటించారు.

 

 

కొద్ది విరామం తర్వాత మళ్ళీ ప్రచారం మొదలు పెడదాం అనుకునే సమయానికి మాకో వార్త తెలిసింది. ఈటీవీ, ఈనాడు తప్ప మిగిలిన న్యూస్ చానల్స్, దినపత్రికలలో అధిక భాగం అన్ని పార్టీల నుండి “డబ్బు” తీసుకుంటున్నాయని తెలిసింది. పౌరులకు సుద్దులు చెప్పే ఓ ప్రముఖ ఛానల్ అధిపతి, లక్ష కోట్లు కాజేసాడనే ఆరోపణలున్న నాయకుని దగ్గర నుండి కోట్ల రూపాయలు తీసుకున్నాడట. పార్లమెంటు ఎన్నికలలో నిలబడ్డ అభ్యర్ధులు ప్రతి ఛానల్ కు పది లక్షల రూపాయల చొప్పున ఇచ్చారనే వార్త వచ్చింది. ప్రతిఫలంగా ఆ చానల్స్ వారు ఆ అభ్యర్ధికి కావలసిన వీడియోలు ప్రసారం చేశారు. బరిలో ఉన్నామనుకున్న ప్రతి అభ్యర్ధిదీ ఇదే తంతు అట.

 

 

ఫోర్త్ ఎస్టేట్ అనబడే ప్రసార మాధ్యమాలు ఇంత విచ్చలవిడిగా లంచాలు తింటున్నాయి. గాలి జనార్ధన రెడ్డికి బెయిలు ఇప్పించడం కోసం ఓ న్యాయమూర్తి కోట్ల కొద్దీ లంచం తీసుకుంటూ పట్టుబడ్డాడని వార్త చదివాం. కార్పోరేట్ ఆసుపత్రులకు కేసులు పంపిస్తే రిఫరల్ ఛార్జెస్ పేరిట నూటికి 90 మంది డాక్టర్లు కమీషన్ తీసుకుంటున్నారు. గత రెండు ఎం.ఎల్.సి. ఎన్నికలలో కొంతమంది టీచర్లు పట్టుబట్టి ఓటుకు సెల్ ఫోన్ తీసుకున్నారని వినికిడి. ఇక గ్రాడ్యుయేట్స్ (పట్టభద్రుల నియోజకవర్గ) ఎన్నికలలో ఎంతెంత డబ్బు చేతులు మారిందో మనకు తెలుసు.

 

 

ప్రసార మాధ్యమాల అధిపతులకు, న్యాయమూర్తులకు, డాక్టర్లకు, టీచర్లకు, పట్టభద్రులకు తిండి లేకపోవడం అనే సమస్య లేదు కదా! మరింత డబ్బు సంపాదించాలనే కదా తమ విలువలను తాకట్టు పెట్టింది? మరి కూలి చేసుకుని రోజుకు రెండు మూడు వందలు సంపాదించే వారు ఓటుకు వందో, వెయ్యో ఆశిస్తే తప్పంటారా? గత 20 సంవత్సరాలలో రాజకీయ నాయకులు గానీ, పైన చెప్పిన గౌరవప్రదమైన వృత్తులవారు గానీ ఈ సమాజాన్ని దోచుకున్న డబ్బుతో పోలిస్తే ఇది ఆవగింజ కాదా!

 

 

మరి మనం కేవలం కూలి పని చేసుకునే సాధారణ ప్రజలకు మాత్రమే “ఓటు పవిత్రమైనది – అమ్మవద్దు – కొనవద్దు – విలువలను నిలబెట్టండి” అని చెప్పడం హాస్యాస్పడంగా అనిపించింది. పి.డి.పి. రావు లాంటి మిత్రులు కూడా ఇదే రకమైన ధర్మాగ్రహాన్ని వెలిబుచ్చారు.

 

 

అందుకే అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలకు ఈ ప్రచారాన్ని ఆపేశాం.

 

 

డా. దాసరి రామకృష్ణ ప్రసాదు

పద్మావతి ఆసుపత్రి

చల్లపల్లి, కృష్ణాజిల్లా, ఆంద్రప్రదేశ్.