పురాణ కాలక్షేపం....           (29-Jun-2020)


సాయంత్రాలు గుళ్ళలో “పురాణ కాలక్షేపం” అని జరుగుతూ ఉండేవి మా చిన్నప్పుడు. పల్లెటూళ్ళలో సాయంత్రం పెద్దలంతా గుడికి వెళ్తే అక్కడ ఓ అయ్యవారు భారత, భాగవత, రామాయణాల్లో నుంచి కొన్ని సంఘటనలు చెప్తూ, అప్పటి రోజువారీ జీవితానికి జనరంజకంగా అన్వయించేవారు. వినేటప్పుడు మనస్సు భలే హాయిగా ఉండేది. ఇంటికి వెళ్ళిన తర్వాత ఎవరి జీవితం వారిదే! ఎవరి మనస్తత్వం బట్టి వారు రోజువారి జీవితంలో సంఘటనలకు ప్రతిస్పందించేవారు. పురాణాల్ని వినడం వలన తమ జీవన విధానాల్ని (ముఖ్యంగా భావోద్వేగాలను) మార్చుకున్నవారు నాకు కనబడలేదు. చెప్పేవారు కూడా అవన్నీ ఆచరించేవారనీ అనుకోనవసరం లేదు.

 

 

మనకో సామెత ఉంది “చెప్పడం తేలిక – ఆచరించడం కష్టం” అని. ఎంతో అనుభవంతో మనకు మన ముందు తరాల వారిచ్చిన సంపద ఈ సామెతలు. వేదికనెక్కి ఉపన్యాసాలు, నీతులు, జీవన విధానాలు చెప్పేవారు తాము చెప్పేవి ఆచరిస్తారని అనుకోవడం వృధా! ఉపన్యాసాలివ్వడం ద్వారా జనాన్ని ఆకట్టుకోవడం వారి వృత్తి. వేలాదిమందిని ఆకర్షించి భాగవతాన్ని బోధించే ఓ బాబా తన సమావేశంలో ఏ చిన్న అలికిడి అయినా ఓ గూండా లాగా విరుచుకుపడతాడు. జనరంజకంగా చెప్పగలగడం ద్వారా ఆయన వేలాదిమంది శ్రోతలను ఆకర్షిస్తున్నాడు గానీ ఆయన గానీ, ఆ శ్రోతలుగానీ ఆయన చెప్పిన విషయాలను ఆచరించడం జరగదు.

 

 

గత పదిహేను సంవత్సరాలుగా “వ్యక్తిత్వ వికాసం”పై ఉపన్యాసాలు ఇచ్చేవారిని చూస్తున్నాం. అమెరికా నుండి దిగుమతి అయిన వ్యక్తిత్వ వికాస పుస్తకాలు అధ్యయనం చేసి, మరికొన్ని కోర్సులు చేసి కొందరు ఈ వ్యక్తిత్వ వికాస శిక్షణలు ఇస్తున్నారు. పది సంవత్సరాల క్రితం అటువంటి కోర్సుకు వెళ్ళాను. క్లాస్ రూం ప్రక్కనుండి బ్యాండ్ మేళంతో ఓ ఊరేగింపు వెళ్తోంది. ఆ మోతకు, తన ఉపన్యాసానికి వచ్చిన చిన్న అంతరాయానికి ఆ వక్త చాలా చిరాకు పడిపోయాడు. ఆ మర్నాడు కోర్సులో భాగంగా “స్ట్రెస్ మేనేజ్ మెంట్” గురించి ఆయన బోధించాడు. అంతకు ముందు రోజు సంఘటన గుర్తుకు వచ్చి తాను చెప్పిన టెక్నిక్స్ ను తానే ఆచరించలేక పోయినప్పుడు మనం ఎక్కడ ఆచరించగలం అనుకొన్నారు విన్నవారు.

 

 

కొన్నివేల మందికి కౌన్సిలింగ్ యిచ్చిన ప్రముఖ మనస్తత్వ శాస్త్ర నిపుణుడు డా. బి.వి. పట్టాభిరాం ఈమధ్యన యిచ్చిన ఇంటర్వ్యూలో చెప్పిన మాటలివి – “నేనెప్పుడూ ప్రశాంతంగా ఉంటాననుకొంటారు చాలామంది. కానీ నేను చాలా సెన్సిటివ్. చిన్న చిన్న విషయాలకు బాధపడి పోతుంటాను. గంటల తరబడి ఆలోచిస్తాను. ఎంత మార్చుకోవాలనుకున్నా వాటిని మార్చుకోలేక పోతున్నాను” అని చెప్పారు.

 

 

ఆయన నిర్మొహమాటంగా తన బలహీనతను చెప్పుకోవడం గొప్ప విషయం. కానీ అంత గొప్ప సైకాలజిస్ట్ తన మనస్తత్వంలోని బలహీనతను మార్చుకోలేక పోయారన్నది సత్యమే కదా! మరి మిగతా వారు తమ మనస్తత్వాన్ని మార్చుకోగలరని ఎలా అనుకోగలం?

 

 

How to win friends and influence people, How to stop worrying and start living వంటి పుస్తకాలు వ్రాసిన “డేల్ కార్ని” గొప్ప వ్యక్తిత్వ వికాస నిపుణుడుగా పేరుగాంచాడు. నిజంగా కూడా ఆ పుస్తకాలలోని విషయాలు అద్భుతంగా ఉంటాయి. కానీ ఆయన ఆత్మహత్య చేసుకున్నాడని ఓ మిత్రుడు చెప్పగా విన్నాను. ఇదే నిజమైతే మరి “దిగులుపడడం మాని ఎలా బతకాలో” చెప్పిన వ్యక్తి ఆత్మహత్య చేసుకుంటాడని ఎవరూ అనుకోరు కదా! మనందరకు ఏది తప్పో, ఏది ఒప్పో, ఎప్పుడు ఆవేశపడకూడదో అన్నీ మన మనస్సాక్షి చెప్తూనే ఉంటుంది. తప్పని తెలిసినా మనకు సహజంగా ఉండే భావోద్వేగాలను అధిగమించలేని పరిస్థితి చాలాసార్లు చూస్తుంటాం. బహుశా డేల్ కార్ని కూడా అటువంటి ఉద్వేగంలోనే ఆత్మహత్య చేసుకుని ఉండవచ్చు.

 

 

వైద్యుల సమావేశాలలో వైద్య శాస్త్రానికి సంబంధించిన ఉపన్యాసాలు గొప్పగా ఇస్తారు కొందరు. వారు చెప్పినవన్నీ వారి ఆసుపత్రులలో చేయకపోవడం చూస్తూనే ఉంటాం. మందుల కంపెనీల దగ్గర డబ్బు తీసుకుని, తాము వాడని మందుల గురించి కూడా గొప్పగా ఉపన్యాసాలిచ్చే డాక్టర్లనూ చూస్తుంటాం.

 

 

ప్రతి మనిషికి జన్యువుల వలన వచ్చే వ్యక్తిత్వం ఉంటుంది. తాత ముత్తాతల నుండి శారీరక, మానసిక లక్షణాలను పుణికి పుచ్చుకుంటారు. దాని పునాదిగా – పెరిగిన వాతావరణం, సామాజిక స్థితిగతుల ప్రభావం వలన ఒక వ్యక్తిత్వం ఏర్పడుతుంది. మంచి అనుభవాలు, బాధాకర అనుభవాలు లాంటి జీవితంలోని ఆటుపోట్లు ఈ వ్యక్తిత్వం ఏర్పడటానికి దోహదపడుతుంది.

 

 

ఎదుటివారు చెప్పేది వినడం ద్వారా కొత్త విషయాలు తెలుసుకోవడం జరుగుతుంది గానీ “అసలు వ్యక్తిత్వం” (Basic Personalities) మారడం అరుదు. కానీ తమ ప్రవర్తనను మార్చుకున్నవాళ్ళను మాత్రం అక్కడక్కడా చూస్తుంటాం. కాలేజీలో మా సీనియర్ ఒకాయనకు చాలా కోపం ఉండేది. ఎంతోమందిని ప్రత్యక్షంగా విమర్శిస్తూ ఉండేవాడు. ప్రతిరోజూ చాలామందితో పోట్లాడేవాడు. తర్వాతి కాలంలో డాక్టరు వృత్తిలో ఒక అభివృద్ధి చెందిన దేశంలో స్థిరపడ్డాడు. అక్కడ ఈయన కోపం, పోట్లాడే మనస్తత్వం కొనసాగితే ఉద్యోగం చేసే పరిస్థితి లేదు. కనుక తప్పనిసరి పరిస్థితిలో తన ప్రవర్తనను మార్చుకొని సౌమ్యంగా వ్యవహరిస్తున్నాడు. “ఇలా మారక తప్పనిసరి పరిస్థితులు” వస్తే తప్ప జనం తమ ప్రవర్తనను మార్చుకోవడం కూడా అరుదు.

 

 

మంచి ఉపన్యాసం వినడం ద్వారా ఉపన్యాసకునికి మంచి ‘ఉపన్యాస కళ’ ఉందని అర్థం అవుతుంది. మనకు కొన్ని కొత్త విషయాలు తెలియవచ్చు. అంతకు మించిన ప్రయోజనం ఆశించడం అనవసరం. ఉపన్యాసకులను ఆరాధించడం శుద్ధ దండగ. తమ జీవిత కాలంలోనే వేలాదిమందిని ప్రభావితం చేసిన మహాత్మా గాంధీ, పుచ్చలపల్లి సుందరయ్య గార్లకు అద్భుతమైన ఉపన్యాస కళ లేదు. కానీ జనం వారి ఉపన్యాసాలను ఎంతో ఆసక్తిగా వినేవారు. ఎన్ని కష్టాలొచ్చినా తాము ఏమి బోధించారో అదే వారి జీవితంలో పాటించారు. కాబట్టే సమాజంపై వారి ప్రభావం అంతగా పడింది. తాము చెప్పేవి ఆచరించే వారు మాత్రమే గౌరవానికి అర్హులు.

 

 

అందుకే మన పెద్దలు పురాణ “కాలక్షేపం” అన్నారు. “చెప్పేవాడికి వినేవాడు లోకువ” అని కూడా అన్నారు.

 

‘రాసేవాడికి చదివేవాడు లోకువ’ అంటారా? కాదనడానికి నేనెవర్ని!!!

 

 

డా. దాసరి రామకృష్ణ ప్రసాదు.

పద్మావతి ఆసుపత్రి

చల్లపల్లి, కృష్ణాజిల్లా, ఆంధ్రప్రదేశ్

 

“నీతులు చెప్పడానికేనా?” పేరుతో 29-08-2013 వ తేదీన ‘ప్రజాశక్తి’లో ప్రచురితమైనది.