మంచి పెంపకమంటే?....           (29-Jun-2020)


ఈరోజు ఉదయం నడకకు కోటేశ్వరరావు మాష్టారు ఆలస్యంగా వచ్చారు. “ఏం గురువుగారూ! ఉదయం నిద్ర లేవడం కష్టమైపోతున్నదా?” అని అడిగాను.

 

“రాత్రి మా మనవడి స్కూల్ వార్షికోత్సవానికి వెళ్ళాను. ప్రాధాన వక్త ఉపన్యాసం విన్న నాకు రాత్రి నిద్రే పట్టలేదు. అందుకే ఈ ఆలస్యం” అన్నారు ఆవులిస్తూ.

 

“అంత గొప్ప ఉపన్యాసమా? ఇంతకీ ఏం చెప్పారు?”

 

“తన పిల్లల్ని ఎలా క్రమశిక్షణతో చదివించాడో, ఎంత అదుపు ఆజ్ఞల్లో ఉంచాడో, ఉత్తమ ఫలితాలెలా వారి నుండి రాబట్టాడో వివరించి, మంచి పెంపకమంటే ఏమిటో చెప్పాడు”.

 

ఇంతకూ ఎలా పెంచాడో తన పిల్లల్ని?

 

‘ఇప్పుడున్నదంతా కాంపిటీటివ్ ఫీల్డు. మన తరంలాగా చదివితే ఈ పోటీ ప్రపంచంలో పిల్లలు నెగ్గుకు రాలేరు’ అని అలోచించి, ఫీజులు, ఖర్చులు బాగా ఎక్కువైనా వెనుకాడక, మంచి ఇంగ్లీష్ మీడియం స్కూల్లోనే చేర్చాడట. తెల్లవారుఝామున 4-30కే నిద్రలేపి, ట్యూషన్ కు పంపి, అక్కడి నుండి తిరిగి రాగానే ఒక్క అరగంటలోపే వాళ్లకి స్నానం చేయించి, బట్టలు తొడిగి, పుస్తకాలు సర్ది, బూట్లు తొడిగి, టిఫిన్ కూడా తానే తినిపించి, హడావిడిగా స్కూల్ కి పంపించేవాడట.

 

“ఎందుకు? తమ ఈ చిన్న పనుల్ని ఆ పిల్లలే చేసుకోవచ్చు కదా?”

 

పిల్లలు కాబట్టి, వాళ్ళకేమీ తెలియదనీ, చెడగొడతారేమోననీ, టైం వేస్టనీ తానే వాళ్ళకా పనులు చేసేవాడట.

ఇక సాయంత్రం స్కూల్ నుండి రాగానే, ఆయన భార్య హడావిడిగా వాళ్ళ నోట్లో టిఫిన్ కుక్కుతూ ఉంటే, ఈయన వాళ్ళ చేత హోంవర్కు చేయించేవాడట. ఆ వెంటనే సాయంత్రం ట్యూషన్ కు పంపేవాడట. రాత్రి 9 గంటల ప్రాంతంలో ట్యూషన్ నుండి వస్తూనే వాళ్ళు అలసి నిద్రకు జోగుతూ ఉంటే, ఏదోలాగా అన్నం తినిపించి, నిద్ర పుచ్చేవాడట.

 

“మరి ఆ పిల్లలు ఆడుకోరా?”

 

మొదట్లో ఎప్పుడైనా పిల్లలడిగేవారట. కాసేపు ఆడుకొంటామాని. ఈయన ససేమిరా అనేసరికి వాళ్ళూ క్రమంగా మానేశారట. ‘ఆటపాటల్తో మీరు టైం వేస్ట్ చేస్తే రేపు అతి ముఖ్యమైన పదో తరగతిలో 540 మార్కులు తెచ్చుకోకుంటే మీ భవిష్యత్తేం కావాలి?” అని గదమాయించాడట. వాళ్ళ అబ్బాయికి డాక్టర్ కావాలనే బలమైన కోరిక. ఇంటర్ లో బై.పి.సి.లో చదువుతానంటే ‘నువ్వు మెడిసిన్ చదివి జీవితంలో స్థిరపడాలంటే కనీసం యిక్కడి నుండి 15 ఏళ్ళు పడుతుంది. అదే ఇంజనీరింగ్ అయితే ఆరేళ్ళలో ఉద్యోగంలో స్థిరపడవచ్చు’ అని అతి ఖరీదైన కార్పోరేట్ కాలేజీలో చేర్పించాడట.

 

‘మరి ఆ పిల్లవాడికేది యిష్టమో చర్చించకుండానే….”

 

ఆయన స్టేజి దిగగానే అదే అడిగాను. “ఆఁ! పిల్లలకేం తెలుసండీ? మనం పెద్దవాళ్ళమే సరైన డైరెక్షన్ ఇవ్వాలి గాని…” అన్నాడు. తన పిల్లలికిప్పటికీ తినే తిండి, తాగే నీళ్ళు, వేసుకొనే బట్టలు తానే ఎంపిక చేస్తానని సగర్వంగా చెప్పాడు.

 

ఇంతకీ ఆ తర్వాత ఆయన కొడుకేం చేశాడు?

 

అతను ఇంజనీరింగ్ చేస్తుండగానే క్యాంపస్ సెలక్షన్స్ లో ఏదో బహుళ జాతి కంపెనీలో ఉద్యోగం వచ్చిందట. కుర్రవాడికి మాత్రం గవర్నమెంట్ ఉద్యోగం చేయాలని ఉన్నా, ఈయన ససేమిరా ఒప్పుకోక కంపెనీ ఉద్యోగంలోనే చేర్చి, ఆ తర్వాత అమెరికా పంపేశాడట. మరో రెండేళ్ళు తిరగకుండా ఇక్కడి ఒక మంచి కుటుంబానికి చెందిన ఒక అమ్మాయిని ఇచ్చి పెళ్ళి చేసాడట. వాళ్ళు ఏ పిల్లల్ని ఎప్పుడు కనాలో కూడా ఈయనే నిర్ణయించేశాడట.

 

ఇదంతా చెప్పి, మొత్తమ్మీద తన బిడ్డ జీవితాన్ని తానెంతగా ప్లాన్ చేసి చక్కని పద్ధతిలో ఎలా తీర్చిదిద్దాడో వివరించి, మంచి పెంపకం అంటే అదేనని తన ఉపన్యాసాన్ని ముగించాడు.

 

ఇక్కడ గమ్మత్తేమిటంటే ఆ ముఖ్య అతిథి కుమారుడు కూడా ఆ సభలో ఉన్నాడు. అది తెలిసి, అతణ్ణి అభినందించాలని వెళ్ళి, పరిచయం చేసుకున్నాను. ‘అంత మంచి పెంపకంలో పెరిగినందుకు ఎలా ఫీలవుతున్నావు?’ అని అచ్చంగా న్యూస్ ఛానల్ రిపోర్టర్ లెవెల్ లో అడిగాను.

 

అతను ముభావంగా, మొక్కుబడిగా థాంక్స్ చెప్పాడు.

 

ఎందుకో ముఖంలో సంతోషం, ఉత్సాహం కనపడలేదు.

 

ఎందుకలా ఉన్నావు? అని అడిగితే…

 

“ఇప్పటిదాకా మా నాన్న కోసమే బ్రతికాను. నా ఇష్టాయిష్టాలు చంపుకొంటూ ఇంకా ఎన్నాళ్ళిలా బ్రతకాలో తెలియడం లేదు…” అని విషాదవదనంతో వాపోయాడు.

 

సరిగ్గా ఇటువంటి కథే ఏదో సినిమాలో చూశాను. ఎందుకు తీసారో మరి.

 

ఇదంతా వింటుంటే ఇంకేమైనా గుర్తుకు రావడం లేదా మాష్టారు?

 

ఎందుకు గుర్తుకు రావు!

 

 

“తన బుల్లి జేబురుమాలని బాబునే ఉతుక్కోనివ్వండి

చిన్న గ్లాసులో నీళ్ళను పాపనే పోసుకొని త్రాగనివ్వండి

పళ్ళెం కడగనివ్వండి

పువ్వులు సర్దనివ్వండి – అన్నం వడ్డించనివ్వండి

ఇవన్నీ మీ చిన్నారినే చెయ్యనివ్వండి

తాను కోరుకొన్న విధంగా ప్రతి పనీ చెయ్యనివ్వండి”

అన్న ‘గిజుబాయి’ మాష్టారి మాటలు, ఇంకా ఖలీల్ జిబ్రాన్ మాటలు కూడా గుర్తుకొస్తున్నాయి.

 

“మీ పిల్లలు మీ పిల్లలు కారు.

తన కోసమై తాను తపించే జీవశక్తి తహతహకు

కుమారులు, కుమార్తెలే ఈ పిల్లలు

మీద్వారా వాళ్ళు ఈలోకంలోకి వస్తారు

కాని, మీభావాలకు వారసులు కానే కారు

మీరు వాళ్ళకి ప్రేమనివ్వండి, మీ ఆలోచనల్ని కాదు

ఎందుకంటే వాళ్ళకి వాళ్ళ సొంత ఆలోచనలుంటాయి

మీరు వాళ్ళ తనువులకు ఆవాసాన్ని కల్పించండి, కాని వాళ్ళ ఆత్మలకు కాదు

ఎందుకంటే వాళ్ళ ఆత్మలు రేపటి గృహంలో నివసిస్తాయి

మీరు మీ కలలలోనైనా ఆ యింటిని సందర్శించలేరు

మీరు వాళ్ళకు మల్లే ఉండటానికి ప్రయత్నించవచ్చు

కానీ, మీవలే వాళ్ళను తయారు చేయాలని ప్రయత్నించవద్దు

ఎందుకంటే జీవితం వెనక్కి మళ్లదు

నిన్న దగ్గరే కూర్చొని ఉండిపోదు

చిన్నారులంటే

తల్లిదండ్రులనే వింటి నుండి

ఉజ్వల భవిష్యత్తు లోనికి

దూసుకుపోయి, అద్భుతాలు సృష్టించే

సజీవ బాణాలని మరువకండి”.

 

కాలం యొక్క వక్రోక్తిని గమనించండి. ఆ తండ్రేమే తన పిల్లవాడిని ఏ లోటూ లేకుండా పెంచాననీ, అన్నీ అమర్చాననీ నిండు సంతోషంతో ఉన్నాడు. కాని, అదే సమయంలో పిల్లవాడు మాత్రం ఆత్మను కోల్పోయి, కళావిహీనంగా, వెలితిగా, దిగులుగా ఉన్నాడు.

 

జీవ పరిణామ మంతటికీ తలమానికమైన, చిట్టచివరి అద్భుతంగా పేర్కొనబడుతున్న మానవ శిశువుల “మంచి పెంపకం” అంటే తగినంత “స్వేచ్ఛ” గా పెంచడమేననీ, వాళ్ళ “సృజనశీలతను కాపాడటమే” ననీ ఈ పెద్దవాళ్ళకు ఇంకా ఎప్పటికి తెలుస్తుందో!

 

తూర్పు నుండి సూర్య కిరణాలు ఒంటిపైన తగిలి చురుక్కుమంది. ఇక ఈరోజు నడకకు స్వస్తి.

 

 

డా. దాసరి రామకృష్ణ ప్రసాదు

పద్మావతి ఆసుపత్రి

చల్లపల్లి, కృష్ణా జిల్లా, ఆంద్రప్రదేశ్