వ్యర్ధాలను సక్రమంగా పారవేద్దాం – పరిసరాలను శుభ్రంగా ఉంచుకుందాం – అంటువ్యాదుల్ని తరిమేద్దాం....           (29-Jun-2020)


దాదాపు పది సంవత్సరాల క్రితమే వ్రాసిన కరపత్రము

 

 

వ్యర్ధాలను సక్రమంగా పారవేద్దాం – పరిసరాలను శుభ్రంగా ఉంచుకుందాం – అంటువ్యాదుల్ని తరిమేద్దాం

 

గత రెండు మూడు నెలలుగా విషజ్వరాలు మన సమాజాన్ని పట్టి పీడిస్తున్నాయి. వైద్య ఆరోగ్యశాఖ, డాక్టర్లు ఈ జ్వరాలకు సమర్థవంతంగా వైద్యం నిర్వహిస్తున్నారు.

 

 

ఐతే, ఈ జ్వరాలు రాకుండా చేయడం గానీ చాలావరకు తగ్గించడం గానీ సాధ్యం కాదా?

 

అంటువ్యాధులు అంటే ఒక వ్యక్తి నుండి మరొక ఆరోగ్యవంతునికి సోకే వ్యాధులు, రోగి తుమ్మినప్పుడో, దగ్గినప్పుడో గాలి ద్వారా ఫ్లూ, క్షయ వంటి వ్యాధులీ విధంగా వ్యాపిస్తాయి.

 

 

మానవ మలమూత్రాల వలన, మురుగు వలన, రక్షణ లేని త్రాగునీటి వలన కలరా, అతిసార, టైఫాయిడ్, కామెర్లు వంటి జబ్బులు వ్యాపిస్తాయి.

 

 

వెక్టర్ బోరన్ డిసీజెస్ :

 

దోమల వల్ల వ్యాపించే మలేరియా, పైలేరియా (బోద కాలు), డెంగూ, చికున్ గున్యా, మెదడువాపు వంటి వ్యాధులు.

 

 

గాలి ద్వారా వ్యాపించే క్షయ, ఫ్లూ జ్వరాలకు టీకాలు వేయవచ్చు. మిగతా అంటువ్యాధులను నివారించే మార్గాలు చర్చించాలి.

 

 

అంటువ్యాధుల విజృంభకు కారణాలు

చెత్తను, రకరకాల వ్యర్ధపదార్ధాలను, సక్రమంగా నిర్మూలించక నిర్లక్ష్యం చేయడం.
బహిరంగ మలవిసర్జన
బహిరంగ మురుగు పారుదల వ్యవస్థ
కలుషితమైన నీరు త్రాగడం
దోమల నివారణ, నిర్మూలన చేయకపోవడం


వ్యర్ధాల నిర్మూలన :

మన ఇండ్ల నుంచి వచ్చే చెత్తను శాస్త్రీయంగా నిర్మూలించకపోవడం వల్ల ఈగలు, దోమలు పుట్టి పెరిగి అంటువ్యాధులను వ్యాపింపచేస్తున్నాయి. చెత్త నిర్మూలన (Waste Disposal) కార్యక్రమానికి దీర్ఘకాలిక వ్యూహం ఈనాటి తక్షణ అవసరం! శుభకార్యాల సందర్భంలో వచ్చే చెత్తను సరైన విధంగా నిర్మూలించాలి.

 

 

బహిరంగ మలవిసర్జన :

ప్రజల ఆరోగ్యానికి అత్యంత ప్రమాదకరమైన ఈ అంశాన్ని తీవ్రం (Serious) గా పరిగణించకపోతే Faeco-oral Contamination (ఈగలు, పురుగులు ద్వారా విసర్జిత మలం నీటి లోనికి, ఆహారం లోనికి చేరి తద్వారా నోటి లోనికి చేరి అంటువ్యాధులు వ్యాపించడం) వలన వచ్చే జబ్బులైన టైఫాయిడ్, కలరా, అతిసార, కామెర్లు వంటి వ్యాదుల్ని అరికట్టలేము.

 

 

దీనికి ఏకైక పరిష్కారం వ్యక్తిగత మరుగుదొడ్ల (Individual Septic Latrines) వాడకం మాత్రమే.

 

 

కేరళలో 40 ఏళ్ల క్రితమే ప్రతి ఇంటికి సెప్టిక్ లెట్రిన్ అమరింది. అక్కడ బహిరంగ మలవిసర్జన లేదు.

 

 

వ్యక్తిగత మరుగుదొడ్డి ఉన్న వాళ్లకు కూడా అది లేని వారితో ప్రమాదమే. అందుచేత నూటికి నూరుమందికి మరుగుదొడ్లు ఉండవలసిందే!

 

 

బహిరంగ మురుగుపారుదల వ్యవస్థ :

పరిసరాల పరిశుభ్రతే మన తొలి ప్రాధాన్యం కావాలి. బహిరంగ మురుగు పారుదల (Open Drainage) స్థానంలో మూసిన (Closed) పారుదల అత్యవసరంగా ఏర్పడాలి. దీనికి వేలకోట్ల ఖర్చయ్యే మాట నిజమే కాని ప్రజల నుండి ఒత్తిడి వస్తే, పాలకులకు చిత్తశుద్ధి ఉంటే, వేలాదికోట్ల స్కామ్ లను మనము ఆపగలిగితే అసాధ్యం కానే కాదు.

 

 

ప్రస్తుతం మాత్రం కనీసం మురుగుకాల్వలలో నీరు నిలవకుండానైనా జాగ్రత్తలు తీసుకోవాలి. టీ కప్పులు, మంచినీళ్ళ గ్లాసులు, విస్తర్లు మొదలైన ప్లాస్టిక్ వ్యర్థాలను మురుగు కాల్వలలో వేయకూడదు.

 

 

ఇంకా దోమల నిర్మూలనకు చేపట్టవలసిన కార్యక్రమాలు అన్ని ప్రారంభించాలి.

 

 

రక్షిత త్రాగునీరు :

మన చల్లపల్లి వంటి ఎన్నో డెల్టా గ్రామాలకు కృష్ణా నది కాలువల ద్వారా వచ్చే నీరే సాగుకు, త్రాగటానికి ఉపయోగపడుతున్నది. అయితే విజయవాడ వగరంలోని అనేక వ్యర్థాలు, మలినాలు, మురుగునీరు ఈ కాల్వలలోకే వదులుతున్నారు.

 

 

ఆంద్ర రాష్ట్రంలో పంటకాలువ నుండి పొలానికి పెట్టిన నీరు తిరిగి మురుగు కాల్వల ద్వారా అధికభాగం బంగాళాఖాతం లోకి పంపుతున్నారు. కాని, కర్ణాటకలో ఈ అవకాశం లేక, ఎగువ ప్రాంతాల మురుగు నీరంతా మళ్ళీ దిగువ కృష్ణానది లోనికి వదులుతున్నారు. అంటే మన రాష్ట్రంలోకి ప్రవేశించే కృష్ణాజలమే కలుషితమనుకుంటే, అది మళ్ళీ విజయవాడలోని వ్యర్థాలను కూడా కలుపుకుని మన చెరువుల్లోకి చేరుతున్నది. ఆ నీటినే శుద్ధి చేసో, చేయకో మనం త్రాగుతున్నామన్న మాట. ఇది ఎంత ప్రమాదమో అందరమూ గ్రహించాలి. డ్రెయినేజీలను పంటకాలువల లోనికి కలపటం మానాలంటే గట్టి ప్రయత్నమే జరగాలి.

 

 

పై అంశాలను గురించి విజ్ఞులు, ప్రభుత్వ యంత్రాంగం, స్వచ్ఛంద సంస్థలు తప్పక అలోచించి దీర్ఘకాలిక శాస్త్రీయ పరిష్కారాలను కనుగొనే దిశగా కార్యాచరణకు పూనుకోవాలని మనవి చేస్తున్నాము.

 

 

పరిసరాల పరిశుభ్రతే – మన ఆరోగ్యానికి భద్రత

 

 

డా. దాసరి రామకృష్ణ ప్రసాదు

పద్మావతి ఆసుపత్రి

చల్లపల్లి, కృష్ణాజిల్లా, ఆంధ్రప్రదేశ్.