అందరకూ అక్కే టాన్యక్క....           (29-Jun-2020)


సొంత కుటుంబ సభ్యురాలైన ఉషక్కతో పాటుగా తనకంటే చిన్నవారైన పరిచయస్తులందరికీ టాన్యక్క అక్కే! నాలాంటి శిష్యులు ఎంతమందో లెక్క నాకు తెలియదు కానీ రాష్ట్రమంతా ఉన్నాం.

 

 

‘డా. రంగారావు గారి దగ్గర వైద్యమే కాదు నేర్చుకోవాల్సింది ఇంకా చాలా ఉన్నాయి కనుక నువ్వు ట్రైనింగ్ కు ఒంగోలు వెళ్ళాల్సిందే’నని కామ్రేడ్ యల్.బి.జి. నన్ను ‘బెతూన్ నర్సింగ్ హోం’కు పంపారు.

 

 

అంతకు ముందే రంగారావు గారితోనూ, టాన్యక్కతోనూ పరిచయం ఉన్నా వారి దగ్గర జూనియర్ డాక్టరుగా చేరినప్పటి నుండీ టాన్యక్క చనిపోయే వరకూ చాలా దగ్గరి అనుబంధం కొనసాగింది. నేను 2 సంవత్సరాలు, నా భార్య డా. పద్మావతి 1 ½ సంవత్సరం వారి దగ్గర శిష్యరికం చేశాం.

 

 

తన దగ్గర పనిచేసే జూనియర్ డాక్టర్లతో తను వ్యవహరించే తీరు తను మాకు సొంత అక్క కాదని, మేం సొంత తమ్ముళ్ళం, చెల్లెళ్ళం కాదని మాకెప్పుడూ అనిపించేది కాదు. నాకూ అక్కే! నా భార్య పద్మకూ అక్కే! వరుసలకు దొరకని వరస!

 

 

మాలాంటి జూనియర్ డాక్టర్లకు ఇళ్ళు వెతికిపెట్టడం, పాలు దొరికేటట్లు చూడడం (ఆ కాలంలో పాలు ఇంత సమృద్ధిగా దొరికేవి కావు మరి) దగ్గరుండి ఆపరేషన్లు నేర్పడం వరకూ ఇది అదీ అని కాకుండా రోజువారి వ్యవహారాలన్నిటిలోనూ సహాయం చేసేది.

 

 

మా అందరికీ హిస్టరెక్టమి, ట్యూబెక్టమి, సిజేరియన్, ప్రొలాప్స్ ఆపరేషన్లను తనే నేర్పింది. నేను డి.జి.ఓ. చేసినా ఆ రెండు సంవత్సరాలలో Abdominal Hysterectomy మొదట్నుండీ చివరి వరకూ చూడలేదు. తన వృత్తి జీవితమంతా ఆపరేషను టేబులుకు ఎడమ ప్రక్కనే ఉండి కొత్త డాక్టర్లకు ఆపరేషన్లు చేయడం నేర్పింది. ఒక ఆపరేషను చెయ్యడం చాలా సులువు. కానీ నేర్పడానికి చాలా సహనం కావాలి. ఆ ఓపికా, నేర్పాలనే పట్టుదల టాన్యక్కకు ఉండబట్టే ఒకరి తర్వాత ఒకరు నేర్చుకుంటూ వేర్వేరు ప్రాంతాలలో ప్రజలకు ఉపయోగపడ గలుగుతున్నాము.

 

 

సాయంత్రం ఓ.పి. అయిన తర్వాత దాక్టర్లందరం డా. రంగారావు గారి ఓ.పి.లో కూర్చుని రకరకాల కేసుల గురించి చర్చించడం, వారి గత అనుభవాలను వినడం జరిగేది. ఆ తర్వాత నేను మా ఇంటికి వెళ్లి భోజనం చేసి మళ్ళీ రంగారావు గారి ఇంటికి వెళ్ళేవాణ్ణి. అమెరికన్ సామ్రాజ్యవాదం దగ్గరనుండీ రాష్ట్ర రాజకీయాల వరకూ చర్చలు జరుగుతుండేవి. మా అందరికీ పళ్ళు, ఫలహారాలు పెడుతూ తానూ చర్చల్లో పాల్గొనేది టాన్యక్క.

 

 

ఒక్కోరోజు ఓ.పి., ఆపరేషన్లతో బాగా ఆలస్యం అయ్యేది. అప్పుడు మెస్ లో మాకు భోజనం ఉండదని గ్రహించి ఇంటికి తీసుకువెళ్లి తానే భోజనం పెట్టేది. ఇంట్లో వంటపనులూ, కుట్టుపనులూ, ఇస్త్రీ చేయడం లాంటి అన్ని పనులు స్వయంగా చేసేది. శారీరకంగా చాలా కష్టపడేది. మానసికంగా చాలా సంతోషంగా ఉండేది.

 

 

కాన్సర్ కు జరిగిన రెండు ఆపరేషన్లపుడు, మోకాళ్ళ మార్పిడి ఆపరేషన్లపుడు చాలా ధైర్యంగా ఉంది. చక్రాల బండి (వీల్ చైర్)పై తిరగవలసిన పరిస్థితి నుండీ మోకాళ్ళ ఆపరేషన్ తర్వాత చాలా ఉత్సాహంగా “ఉదయం” గారి ట్రస్టు పనుల కోసం ఒంగోలు, హైదరాబాదుల మధ్య చాలాసార్లు ప్రయాణం చేసేది.

 

 

కాన్సర్ ఆపరేషన్ కు 6 సంవత్సరాలు తర్వాత చేసిన పరీక్షలలో Recurrence లేదు అని తెలిసినప్పుడు చాలా సంతోషపడ్డాం Cure వచ్చిందనుకొని. చివరి రెండునెలలూ తను పడిన బాధను చూడవలసి రావడం బంధువులకు, శిష్యులకూ చాలా కష్టమైన విషయం.

 

 

టాన్యక్క ఆశయాలను కొనసాగించడమే ఆవిడకు ఇచ్చే నిజమైన నివాళి అని అంతిమయాత్రకు ముందు నాయకులు చెప్పారు. కష్టజీవుల కోసం పనిచేయడం మరింత మెరుగైన సమాజం కోసం జరిగే కృషిలో పాలుపంచుకోవడం సరైన నివాళే!

 

 

కానీ తను తయారు చేసినట్లు మా తర్వాత తరం డాక్టర్లను జనరల్ ప్రాక్టీసులో తయారుచేద్దాం అనుకొన్నా, గత పాతిక సంవత్సరాలుగా ఒక్క MBBS డాక్టరూ ముందుకు రాలేదు. “స్పెషలైజేషన్”కు మోజు పెరిగి “ప్రాథమిక వైద్యానికి” గుర్తింపు లేకపోవడం నేటి సమాజ పరిస్థితి.

 

 

మేము, మాలాంటి ఎందరో జూనియర్ డాక్టర్లు వైద్య కళాశాలల నుండి వైద్య పట్టాలు పొందినా, అసలైన వృత్తి పాఠాలు, జీవిత పాఠాలు టాన్యక్క, రంగారావు గారి దగ్గరే నేర్చుకున్నాం. వాళ్ళ ఋణం ఎప్పటికీ తీర్చుకోలేనిది. టాన్యక్క ఆశయాల కనుగుణంగా ప్రజలకు వైద్యం అందించడమే మేము ఇవ్వగలిగే నిజమైన నివాళి.

 

 

డా. దాసరి రామకృష్ణ ప్రసాదు

పద్మావతి ఆసుపత్రి

చల్లపల్లి, కృష్ణాజిల్లా, ఆంద్రప్రదేశ్.

 తేది : 23-11-2011