....           (19-Jul-2024)


 గుర్తుకొస్తున్నాయి...55

పెహల్గాం కబుర్లు

అర్ధరాత్రి

Tent లో నిద్ర పోతున్నాం

బయట పెద్దగా గుర్రం సకిలింపుతో మెలకువ వచ్చేసింది.

            మా టెంట్ లో ఉన్న ఒక్క లైటు వైరుతో సహా మేం చూస్తుండగానే బయటకు వెళ్లిపోతోంది. ఎవరో దొంగలు వచ్చి మమ్మల్ని ఏదో చేసేస్తున్నారని భయంతో గుండె వేగం పెరిగిపోయింది. అసలే చలి. ఆపై భయం. ప్రక్కనే ఉన్న మిత్రుడు తారక్ ను గట్టిగా వాటేసుకున్నా!

            ఒక సెలయేరు ప్రక్కనే ఉన్న టెంట్ లో మేం ఆ రాత్రి బసచేశాం. మేం అంటే తారక్, సూర్య ప్రకాష్, హాషిం, మరికొంత మంది మిత్రులు’. 1978 లో కాశ్మీర్ యాత్రలో భాగంగా శ్రీనగర్ నుండి పెహల్గాం వచ్చి ఆ రాత్రి టెంట్ లలో మకాం చేశాం. అప్పుడు జరిగిందీ సంఘటన.

            అయితే దొంగలెవరూ మా టెంట్ లోకి రాలేదు. తెల్లారగానే బయటకు వచ్చి చూస్తే అర్ధమయిందేమంటే రాత్రి ఒక గుర్రం మా టెంట్ బయట ఉన్న కరెంటు వైరును నోటితో లాగేసిందని.

            ఆ ఉదయం బహిరంగంగా తీర్చుకున్న కాలకృత్యాలు, అప్పడు పడిన అవస్ధ వద్దులే అవి! రాయడం బాగోదు.

            అక్కడ నుండీ 11 కి.మీ దూరంలో చందన్ వారీఅనే చోట Ice Bridge ఉంటుంది అని తెలుసుకుని గుర్రాల మీద వెళ్ళాం. Ice Bridge పైన ఉత్సాహంగా ఆటలాడుకున్నాం.

            ఆ తర్వాత గుర్రాలపైనే బైసరన్అనే ప్రదేశానికి వెళ్ళాం. అది పెద్ద Green meadow. అక్కడికి వెళ్ళగానే మా గుర్రాలు Gallop చేశాయి. ఆ Ride ను మర్చిపోలేను. అప్పటి దృశ్యాలన్నీ కళ్ళకు కట్టినట్లున్నాయి......

- - -

            45 సం॥ తర్వాత మా బంధువులతో కలిసి గత సంవత్సరం మళ్లీ కాశ్మీర్ యాత్ర చేశాం. పెహల్గాంలో గుర్రాలున్న ప్రాంతానికి తీసుకువెళ్లారు. అంతా బురదమయం. బైసరన్ ను వాళ్ళు మినీ స్విట్జర్లాండ్అంటారు. గుర్రాల వాళ్లు చాలా ఖరీదు చెప్తారు అని ఎంత రేట్లు అడగాలో చెప్పాడు మా గైడు. తాను అక్కడ మాట్లాడడం బాగుండదని చెప్పాడు (అతను కాశ్మీరీయుడే కాబట్టి).

            గుర్రాల వాళ్లు మేం అడిగిన రేటుకు ససేమిరా ఒప్పుకోలేదు. అక్కడ బోర్డులో ఉన్న గవర్నమెంట్ రేట్లు చూపించినా లెక్కజేయలేదు. చివరికి వారి రేట్లకే ఒప్పుకుని బయలుదేరాం. 20 మందికి పైగా ఉన్న మమ్మల్ని గుర్రాలెక్కించి వాళ్లు నడుచుకుంటూ వస్తున్నారు. మధ్యలో వాళ్ళల్లో వాళ్లు పోట్లాడుకుని గుర్రాల్ని ఆపేశారు. అరగంట మాటల యుద్ధం జరిగింది. రాజీకి వచ్చిన తర్వాత మళ్ళీ బయలుదేరారు. వాళ్ళ గొడవేంటో మాకు అర్ధం కాలేదు. కశ్మీరీ భాషలో గదా వాళ్లు పోట్లాడుకుంది! మాకు తెలియకుండానే మమ్మల్ని రెండు గ్రూపులుగా వాళ్ళే విడగొట్టుకుని వేర్వేరు దారుల్లో కొండలు ఎక్కించారు.

            గోతుల్లో దిగుతున్నప్పుడు అవి పడేస్తాయేమోనని మేం భయపడుతుంటే గుర్రాల కాపరులు నవ్వుతూ అవి Trained Horses. మిమ్మల్ని పడేయవుఅని చెప్పారు. ఎగుడు దిగుళ్ళుగా ఉన్న ఆ సన్నని దారిలో మమ్మల్ని పడేయకుండా తీసుకెళ్తున్న ఆ గుర్రాలు నిజంగా గొప్పవి. కొంత కొండ ఎక్కిన తర్వాత మాలో కొంతమందికి భయం వేసింది. బైసరన్ లేదు గియ్ సరన్ లేదు పీఛేముడ్అన్నారు. ఇక వెనక్కు రాక తప్పలేదు.

            గుర్రాలు విడిది చేసిన ప్రాంతమంతా బురదమయంగా ఉండి అపరిశుభ్రంగా ఉంది. దానికి తోడు వీళ్ళ ఉమ్ములు కూడా. ఇక Toilet కి వెళ్లాలంటే - మగవాళ్ళు ఎక్కడో అక్కడ కానిచ్చేస్తున్నారు. కానీ ఆడవాళ్ళు ఎంత అవస్థ పడ్డారో చెప్పలేను.

బైసరన్ చూడలేకపోయానే అని వెలితి నాకు ఉండిపోయింది. మంచి రోడ్డు వేసుకోవచ్చు గదా వీళ్ళు అనిపించి వాళ్ళతో ఆదే మాట అన్నాను. గతంలో ఒకసారి కాశ్మీరు ప్రభుత్వం బైసరన్ కు రోడ్డు వెయ్యాలని నిర్ణయిస్తే గుర్రాల వాళ్లు కోర్టుకు వెళ్లారట. మా జీవనాధారం పోతుంది గదాఅన్నాడు ఒకతను.

            ఆ తర్వాత చందన్ వారీ కార్లలోనే వెళ్ళాం. అది అమరనాధ యాత్ర Base Camp కూడా అని చెప్పారు. నాలుగు దశాబ్దాల క్రితం మిత్రులతో వెళ్ళిన ప్రాంతం కదా! ఆ Ice Bridge ప్రాంతాన్ని చూడాలని నాకు ఎంతో ఉత్సాహంగా ఉంది. కానీ ఆ ప్రాంతమంతా షాపులతో నిండిపోయింది. అసలు Ice Bridge పైకి పోనివ్వలేదు. ఆ ప్రదేశం కూడా మురికిమురికిగా ఉంది.

- - -

            1991 లో యూరప్ టూర్ లో భాగంగా స్విట్జర్లాండ్ కూడా చూశాం. ఎంతో అందంగా ఉన్న స్విట్జర్లాండ్ ను చూసిన తర్వాత మా టూర్ లో ఉన్న ఒక North Indian lady - ‘మన కాశ్మీర్ కూడా ఇంత అందంగా ఉంటుంది కానీ - ఏ గంధాహైఅన్న మాటలు గుర్తొచ్చాయి.

            కాశ్మీర్ ఎంత సుందర ప్రదేశమైనా సరైన సౌకర్యాలు, శుభ్రత లేకపోవడం బాధనే మిగిల్చింది.

గుల్మార్గ్ మాత్రం కాస్త శుభ్రంగానే ఉంది.

ఆఖరి మాట :

            మా క్లాస్మేట్ పద్మలక్ష్మి అమరనాధ్ యాత్రానుభవాలనుచదివిన తర్వాత ఇవన్నీ గుర్తుకొచ్చాయి.

ధన్యవాదాలు బడీ దీదీ..

- డి.ఆర్.కె

19.07.2024.