రక్త పింజర పాము కరిచిన మరో కేసు... ....           (04-Aug-2024)


 పాము కాటు మరణాలు ఆపే సదవగాహన ప్రజల్లో పెంచేందుకే ఈ పోస్ట్...  

రక్త పింజర పాము కరిచిన మరో కేసు...  

****

          వారం క్రితం వరి నాట్లు వేస్తుంటే ఒక వ్యవసాయ కార్మికుని కుడి చేతికి రక్త పింజర కరిచింది. ఉదయం 8.30 కు హాస్పటల్ కు తీసుకువచ్చారు. అప్పటికి పాము కరిచి పావు గంటే  అయింది.

- మరి ఈ  కేసులో వైద్యం ఎలా?

          వైద్య పరీక్షలు చేస్తే ఎటువంటి విష లక్షణాలూ లేవు. పామును చంపి తీసుకు వచ్చారు. అది రక్తపింజర - విషపు పామే! అయితే విషం ఎక్కిన లక్షణాలేవీ లేకపోవడంతో ASV ఇవ్వలేదు. గంట గంటకూ రక్తం గడ్డ కట్టడం సరిగా ఉందో లేదో చెప్పే clotting time పరీక్ష చేస్తున్నాము. కరిచిన నాలుగు గంటల తర్వాత చేతి  వాపు మొదలయ్యింది. ఇది విషపు లక్షణమే? కానీ clotting time మామూలుగానే ఉంది. మధ్యాహ్నం  రెండు గంటలకు రక్తం గడ్డ కట్టలేదని lab report వచ్చింది. ఇది ప్రమాదకరమైన విష లక్షణం. రక్తం గడ్డ కట్టే లక్షణాన్ని కోల్పోతే శరీరం లోని ఏ భాగం నుండైనా రక్త స్రావం జరగవచ్చు. పొట్టలో జరిగితే రక్తపు వాంతులు అవుతాయి. మెదడులో జరిగితే పక్షవాతం రావచ్చు.

          వెంటనే 10 డోసుల ASV(Anti snake venom) ఇంజక్షన్లు ఇచ్చాము. నాడి, రక్తపోటు, స్పృహ వగైరాలన్నీ (vitals) బాగున్నాయి. కనుక ASV చేసిన 6 గంటల తర్వాత clotting time మళ్ళీ పరీక్ష

చేశాము. అప్పటికీ రక్తం గడ్డ కట్టే  స్వభావం మామూలు స్థాయికి రాలేదు. అందుకని మళ్ళీ 10 డోసుల ASV ఇచ్చాము. మర్నాడు ఉదయం చేసిన పరీక్షలో రక్తం గడ్డ కట్టే  స్వభావం మామూలు స్థాయికి వచ్చింది. మరొక్క  రోజు ఆసుపత్రిలో పరిశీలనలో ఉంచాము. చేయి వాపు గురించి దిగులు పడొద్దని, నెమ్మదిగా తగ్గుతుందని ధైర్యం చెప్పి 3 వ రోజు డిశ్చార్జ్ చేశాం.

చర్చ : 

పాము కాటు వేసిన సమయం ఉదయం. 8.15  

ఆసుపత్రికి వచ్చిన సమయం ఉదయం 8.30   

మొదటి విడత విషం విరుగుడు మందు ఇచ్చింది మధ్యాహ్నం 2 గంటలకు.

అది ఎందుకు ఇచ్చాము?

          “రక్తం గడ్డ కట్టే స్వభావం పోవడం” అనే విషలక్షణం మనిషికి ప్రమాదం. దాన్ని మామూలు స్థాయికి రప్పించడానికి ఈ విరుగుడు మందు ఇవ్వాలి.

          ఒకసారి ASV ఇచ్చిన తర్వాత 6 గంటల వరకూ మళ్లీ రక్త పరీక్షలు చేయనవసరం లేదు. Clotting factors (నెత్తురును గడ్డ కట్టించే ద్రవ్యాల) ను తయారు చేసుకోవడానికి కాలేయానికి అంత సమయం పడుతుంది. 6 గంటల తర్వాత కూడా clotting time ఎక్కువగా ఉన్నా, జనరల్ కండిషన్ ప్రమాదంగా అనిపించినా మరో ASV డోసు ఇవ్వాలి.

          ఈ కేసులో రాత్రి 8 గంటలకు కూడా నెత్తురు గడ్డ కట్టే సమయం ఎక్కువగా ఉంది కాబట్టి మరో 10 ఇంజక్షన్ల డోసు ఇచ్చాము. మర్నాడు ఉదయానికి రక్తం గడ్డ కట్టే స్వభావం మామూలు స్థాయికి వచ్చింది.

ఇక్కడ చేయకూడనిది :

          సాధారణంగా రక్త పింజర కరిచిన రోగికి 20 నుంచి 30 ఇంజక్షన్లు సరిపోతాయి. కానీ కొన్ని చోట్ల 70 నుండి 100 వరకు ఇస్తుండడం గమనించాను. అన్ని ఇంజక్షన్లు ఇవ్వవలసిన అవసరం గత 40 ఏళ్లలో నాకు ఎప్పుడూ రాలేదు.