మరోసారి మారేడుమిల్లి.......           (24-Jul-2024)


 మరోసారి మారేడుమిల్లి...

            గుంటూరు JKC కాలేజీలో Sr. Inter చదువుతున్నప్పుడు Botanical Tour లో భాగంగా బోటనీ డిపార్ట్మెంట్ వారు మారేడుమిల్లి అడవులకు తీసుకువెళ్లారు. మా బోటనీ లెక్చరర్ SRK గారు, Head of the Dept. ASK గారు మమ్మల్ని అక్కడి అడవిలోకి తీసుకువెళ్ళి రకరకాల మొక్కలను మాతో సేకరింపజేశారు. అప్పుడు గుంటూరు నుండీ ఎలా వెళ్ళామో, మారేడుమిల్లిలో ఎక్కడ ఉన్నామో, ఏం తిన్నామో ఏమీ గుర్తు లేదు. కానీ అడవిలో మొక్కలను సేకరించడం బాగా గుర్తు. కోకో మొక్కను మొదటిసారి అక్కడే చూశాం. మళ్ళీ కచ్చితంగా మారేడుమిల్లి రావాలని, పెళ్లి చేసుకున్న తర్వాత భార్యకు ఈ ప్రాంతాన్ని చూపించాలని అనుకొన్నాను. అంత నచ్చింది ఆ ప్రదేశం. ఇదంతా 1972 లో సంగతి.

- - -

*సీన్ కట్ చేస్తే!*

            పెళ్లి చేసుకున్న 40 ఏళ్ళకు గానీ మళ్ళీ మారేడుమిల్లి చూడడం కుదరలేదు. గత సంవత్సరం వెళ్దామని ప్రయత్నిస్తే ఒక్క రిసార్ట్ లోనూ ఖాళీ లేదన్నారు. డిసెంబర్, జనవరి టూరిస్ట్ సీజనట. వేసవి కాలం టూరిస్ట్ సీజన్ అనేది వింటాం గానీ శీతాకాలంలోనే జనం ఎక్కువగా రావడం ఇక్కడి ప్రత్యేకత!

            పుష్ప సినిమా షూటింగ్ ఇక్కడే జరిగింది. అప్పటినుండీ విపరీతంగా టూరిస్ట్ లు పెరిగారట. మేం “Woods” అనే రిసార్ట్ ను బుక్ చేసుకున్నాం. అందులోనే పుష్ప బృందం ఒక నెల రోజులు ఉందట. ఈ రిసార్ట్ AP టూరిజం డెవలెప్మెంట్ కార్పొరేషన్ వారు కట్టి ప్రైవేట్ వారికి లీజుకిచ్చారట. అన్ని Cottages చెక్కతోనే చేశారు. ఊరికి 3 కి.మీ దూరంగా భద్రాచలం వైపు ఉంది ఈ రిసార్ట్.

            ఊరంతా రిసార్ట్ లు, అద్దెకు ఇచ్చే గదులు చాలా ఉన్నాయి. Birds Nest అనేది కూడా కాస్త పేరున్న రిసార్టట! వనవిహారి అని మరో రిసార్ట్ ను ప్రభుత్వమే నిర్వహిస్తోంది (బహుశా Forest Department వారు). ఊళ్ళో ఎక్కడ చూసినా టీ షాపులు ఉన్నట్లు బొంగు చికెన్ (Bamboo Chicken) వండుతూ అనేక రెస్టారెంట్ లు ఉన్నాయి. దారిలో రంపచోడవరంలో కూడా ఈ Bamboo Chicken అమ్మడం చూశాం.

*దారి* :

            మా ఇంటి నుండీ రిసార్ట్ కు 280 కి. మీ. దూరం. విజయవాడ రాజమండ్రి రూటులో రాజమండ్రి భద్రాచలం రోడ్డుకు ఎడమ వైపుకు తిరిగితే ఆ Highway నుండీ 80 కి.మీ. దూరంలో మారేడుమిల్లి ఉంటుంది.

*వర్షం* :

            మేం తుఫానులో బయలుదేరాం. ఇంత వర్షం వస్తుంటే వెళ్లడం క్షేమమేనా అని సంశయించి కూడా ఎప్పటి నుంచో అనుకున్న కార్యక్రమాన్ని వాయిదా వేయడం ఎందుకని ధైర్యే సాహసే లక్ష్మీఅనుకొంటూ శుక్రవారం మధ్యాహ్నం 2.30 కు మా ఇంటి నుండీ బయలుదేరాం. రాజమండ్రి దగ్గర ఈ భద్రాచలం రోడ్డుకు ఎక్కడ తిరగాలో తెలియక ఇబ్బంది పడ్డాం. గత అనుభవాల దృష్ట్యా Google Map ల మీద పూర్తి నమ్మకం లేదు. ఎవర్నన్నా అడగాలంటే Highway మీద ఎవ్వరూ ఆగడం లేదు. అప్పటికి చీకటి పడింది. కేశవ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్అని ఒకటి తగిలింది. అక్కడ మధురపూడి విమానాశ్రయం రోడ్డుకు ఎలా వెళ్లాలి అని అడిగి తెలుసుకున్నాం. రాజమండ్రి విమానాశ్రయం మధురపూడి అనే ఊరిలో ఉంటుంది. ఆ రోడ్డే మారేడుమిల్లి వెళ్తుంది అని తెలుసు. ఆ హాస్పిటల్ నుండి కాస్త వెనక్కు వెళ్ళి భద్రాచలం రోడ్డులోనికి ప్రయాణం మొదలుపెట్టాం. సాయంత్రం 7 గంటలకు చీకటయ్యింది. కొత్త రోడ్డు - కొత్త ఊళ్ళు. రోడ్డు మారేడుమిల్లి దాకా ఎలా ఉంటుందో! రిసార్టు ఎక్కడో! ఈ చీకట్లో కొత్త ప్రదేశానికి వెళ్ళడం అవసరమా! అని ఒకళ్లకొకళ్ళం అనుకొంటూ ప్రయాణం చేశాం. మధ్యలో ఊళ్ళు బాగానే తగిలాయి. మనుషులు కనపడ్డారు. రంపచోడవరం దాటిన తర్వాత మాత్రం అంతా అడవే! పెద్ద పెద్ద వృక్షాల మధ్య చీకటిలో నల్లటి, నున్నటి తారు రోడ్డుపై మా కారు ప్రయాణిస్తోంది. రాష్ట్రంలో మిగతా రోడ్లులాగా కాకుండా ఇది గోతులు లేకుండా నున్నగానే ఉంది. అడపాదడపా ఒక వాహనం కనపడడం తప్పితే ఆ అడవిలో మేం ఒక్కరిమే ప్రయాణం చేస్తున్నట్లుగా ఉంది. కాసేపటికి Cell Signal పోయింది. ఫోన్ చేసుకోవడానికి లేదు. Net లేదు. Google Map కూడా ఆగిపోయింది. వర్షం పడుతూనే ఉంది. ఒక్క చెట్టు రోడ్డుకు అడ్డంగా పడి ఉంటే ఇక కదిలే పరిస్థితే లేదు. ఎవరికీ ఫోన్ చేయడానికి లేదు. రాత్రంతా కారులో జాగారమే! తుఫాను పెరిగి విపరీతమైన గాలులు వస్తే! అని కాస్త భయమేసినా ప్రక్కనే భార్యామణి ఉంది కదా! కాస్త ధైర్యంగా ఉన్నట్లే నటించాల్సి వచ్చింది. ఇంత రిస్క్ అవసరమా! అని ఆవిడ అప్పుడప్పుడూ అంటూ ఉన్నా ఏం ఫర్లేదు 9 గంటలకల్లా వెళ్లిపోతాంఅని ధైర్యం తెచ్చుకుని అదే చెప్పేవాణ్ణి.

*Woods Resort* :

            మారేడుమిల్లి ఊరు కనపడగానే సంతోషం వేసింది. ఊరు దాటిన తర్వాత గదా ఈ రిసార్టు అని Woods బోర్డు కోసం రెండు వైపులా చూస్తూ వెళ్ళాం కానీ Woods రిసార్టు బోర్డుకు లైటు లేకపోవడం వలన కాస్త దూరం వెళ్ళిన తర్వాత మళ్ళీ వెనక్కు వచ్చి రిసార్టు లోపలికి వెళ్ళాం. రోడ్డు నుండీ ఒక ఫర్లాంగు దూరంలో ఉంది ఈ రిసార్టు. సరిగ్గా రాత్రి 9 గంటలకు చేరాం. రిసెప్షన్ లో ఉన్న ఒకే ఒక్కడేరాత్రంతా రిసార్టు డ్యూటీ చేస్తున్నాడు. మర్యాదగా మమ్మల్ని రిసీవ్ చేసుకుని మాకు కేటాయించిన No-5 Cottage దగ్గరకు తీసుకువెళ్లాడు. ఇదంతా వర్షంలో గొడుగులు వేసుకునే! మా డ్రైవర్ కు ఈ రిసార్టులోనే వేరే రూం బుక్ చేశాం.

            మేం ఉన్న కాటేజీ విశాలంగా, అంతా చెక్కతోనే చేసి ఉంది. అటువంటివి 20 పైనే ఉన్నాయి.

            అన్ని కాటేజీలు ఫుల్ అయ్యాయి అని చెప్పాడతను. శుక్ర, శని, ఆదివారాలు బిజీగా ఉంటారట!

            రాత్రంతా వర్షం కురుస్తూనే ఉంది. అయినా గదిలోనే ఉన్నాం. కాబట్టి దిగులు లేదు. ఉదయాన్నే లేచి అలవాటు ప్రకారం నడక మొదలుపెట్టాం. వర్షంలోనే! నేను గొడుగు పట్టుకున్నాను. పద్మ రెయిన్ కోట్ వేసుకుంది. అడవిని బాగా ఎంజాయ్ చేసింది పద్మ. తనకు అడవి బాగా నచ్చింది.

*జలతరంగిణి* :

            రిసార్ట్ రెస్టారెంట్ వారు పెట్టిన ఇడ్లీ, ఉప్మా, పునుగులతో బ్రేక్ ఫాస్ట్ చేసి ఆ వర్షంలోనే దగ్గర్లోనే ఉన్న జలతరంగిణిఅనే చిన్న జలపాతానికి వెళ్ళాం. కొంతమంది కుర్రాళ్లు కూడా అక్కడ బాగా enjoy చేస్తూ కనపడ్డారు. నేను పద్మను ఫోటోలు తీస్తుంటే ఒక కుర్రాడు అంకుల్ మీ ఇద్దర్నీ నేను ఫోటో తీస్తానుఅని మమ్మల్ని ఫోటోలు తీశాడు. మనుషులు తమకు ఇబ్బంది లేనంత వరకూ వేరే వాళ్ళకు సహాయపడాలనే అనుకుంటారు కదా!

            అటునుండీ కాసేపు మారేడుమిల్లి ఊళ్ళోకి వెళ్ళాం. Bamboo chicken అమ్మే షాపులు చాలా ఉన్నాయి. వన విహారి’ Resorts చూశాం. అటు ఇటు తిరిగి మళ్ళీ రూంకి వచ్చి వాళ్ళు పెట్టిన భోజనం చేశాం. కాస్సేపు కునుకేసి మళ్ళీ వర్షంలోనే షికారుకి బయల్దేరాం. రాత్రుళ్లు భోజనం చేసే అలవాటు లేకపోయినా వీళ్ళు ఏం పెడతారో చూద్దాం అన్నట్లుగా రెస్టారెంట్ కు వెళ్ళి సుష్టుగానే తిన్నాం.

*రిసార్టు సంగతి* :

            రిసార్టు ప్రాంతం అందంగానే ఉంది. కానీ 5 Star Hotels లాగా, మహేంద్ర, Sterling రిసార్టులాగా ఊహించుకోవద్దు. అంత గొప్పగా ఉండదు. కాస్త సర్దుకుపోవాలి. ఉద్యోగస్థులు స్థానికులే! మంచివారు. మర్యాదగా ఉంటారు. సౌకర్యాలు మరీ గొప్పగా ఉండవు. బహుశా ఆ ప్రాంతంలోని అన్ని రిసార్టులు ఇలాగే ఉండి ఉంటాయి!

*గుడిసె* :

            మారేడుమిల్లి నుండి 45 కి.మీ దూరంలో గుడిసెఅనే ప్రదేశంలో చిన్న కొండ ఉంటుంది. టూరిస్ట్ లు ఉదయం, సాయంత్రం సూర్యోదయాన్ని, సూర్యాస్తమాన్ని చూడడానికి వెళ్తారు. అక్కడికి వెళ్ళడానికి ట్రావెల్స్ వారు ప్రత్యేకంగా జీప్ లు ఏర్పాటు చేస్తారు. వర్షం వలన మేము వెళ్ళిన రోజుల్లో అక్కడకు వెళ్లడానికి అనుమతి లేదు.

*మీది గుంటూరే మాది గుంటూరే* :

            రిసార్టులో రెస్టారెంట్ ను నిర్వహిస్తున్న బాబుఅనే అతను గుంటూరులోని గుజ్జనగుళ్లవాస్తవ్యుడట. నేను గుజ్జనగుళ్ల ప్రక్కన ఉన్న JKC కాలేజీలో ఇంటర్మీడియట్ చదువుకున్నానని చెప్పాను. పుట్టినప్పటి నుండీ DGO చేసే వరకు నేను గుంటూరులోనే ఉన్నానని పద్మ చెప్పింది. ఇలా మీది గుంటూరే మాది గుంటూరే అనుకుని తృప్తి పడ్డాం.

*చెత్త కబుర్లు* :

            అన్ని టూరిస్టు ప్రదేశాలలో ఉన్నట్లే ఈ ఊళ్ళో కూడా రోడ్ల ప్రక్కన చెత్త పుష్కలంగా కనిపిస్తుంది. ఇంత చెత్తగా బ్రతకాలా అనిపిస్తుంది నాకు. “Eco-Friendly” గా టూరిజం నిర్వహించలేమా! ప్రభుత్వాలకు చిత్త శుద్ధి ఉంటే ఎంత సేపు! మున్నార్ హోటల్స్ లో ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్ ఇవ్వడం లేదు. ఆ పంచాయితీ అలా తీర్మానించిందని తెలిసి ఎంతో సంతోషించామో! పవన్ కళ్యాణ్ గారు పర్యావరణ పరిరక్షణ పట్ల చిత్త శుద్ధితో వ్యవహరించడం సంతోషంగా ఉంది. మరి కొన్ని రోజుల్లో మన రాష్ట్రంలో కూడా మార్పును ఆశించవచ్చేమో!

            మేం ఆ ఊరిని ఏమీ పాడుచెయ్యలేదు. మంచి నీళ్లను రెండు చిన్న Cans లోనూ, అరడజను స్టీలు బాటిల్స్ లోనూ తీసుకువెళ్లాం. రెస్టారెంటులో డైనింగ్ టేబుల్స్ పై జగ్గులతో మంచినీళ్ళు పెట్టారు గానీ గ్లాసులు పెట్టలేదు. గ్లాసులు ఎందుకు పెట్టలేదు అని అడిగితే Water Bottles తప్పితే ఎవ్వరూ విడిగా మంచినీళ్ళు అడగరు మమ్మల్ని అని చెప్పారు. మేము మాత్రం జగ్గులో నీళ్ళను మా స్టీలు బాటిల్స్ లో పోసుకుతాగాం.

            శనివారం అంతా వర్షంలోనే రిసార్ట్ ను అడవిని, ఆ ఊరిని, జలపాతాన్ని enjoy చేసి ఆదివారం ఉదయం 7 గంటలకు తిరుగు ప్రయాణం మొదలుపెట్టాం. రాత్రి Duty లో ఉన్న రాధాకృష్ణ అనే ఉద్యోగి మాకు బాగా సహాయం చేశాడు. రిసార్ట్ నిర్వహణకు సంబంధించి మా సలహాలు కొన్ని చెప్పి బయలుదేరాం. తిరుగు ప్రయాణం భద్రాచలం కొత్తగూడెం తిరువూరు ఇబ్రహీంపట్నం మీదుగా విజయవాడ వెళ్దాం అనుకొన్నాం కానీ తుఫానులో రూటు సురక్షితం కాదని చెప్పడంతో వచ్చిన వైపే బయలురాం. తిరుగు ప్రయాణం కూడా వర్షంలోనే.

            ఉదయాన్నే కాఫీ తాగే అలవాటున్న మాకు రాజమండ్రి వెళ్ళే వరకూ కాఫీ దొరకలేదు. దారిలో మధురపూడి విమానాశ్రయం చూసి కొన్ని ఫోటోలు తీసుకున్నాం. గన్నవరం విమానాశ్రయం కంటే ఇది మరింత అందంగా ఉంది.

            భార్యతో కలిసి మారేడుమిల్లి మళ్ళీ చూడాలన్న కోరిక 41 సంవత్సరాల తర్వాత తీరింది. పద్మ బాగా enjoy చేయడంతో ఈ టూరు నాకు మరింత సంతోషాన్ని మిగిల్చింది.

- డి.ఆర్.కె

   24.07.2024.

 

మా మారేడుమిల్లి టూరు రెండున్నర్ర రోజులు మాత్రమే.

అమర్నాధ్ యాత్రలలాంటి Exiting  Tour కాదు.  

పద్మలక్ష్మి ఆ విశేషాలను రాయమందని రాశాను.