విషపు పాము కరిచినా Anti Snake Venom ఎందుకు ఇవ్వలేదు?....           (26-Jul-2024)


పాము కాటు మరణాలు జరగకుండా ఆపడానికి అవగాహన కోసం

విషపు పాము కరిచినా Anti Snake Venom ఎందుకు ఇవ్వలేదు?

            50 ఏళ్ల వ్యక్తిని ఉదయం 7.30 కి రక్త పింజర కుడి చేతి వ్రేలిపై కాటు వేసింది. 8 గంటలకి మా ఆసుపత్రికి తీసుకువచ్చారు. కరిచిన పాము ఫోటోను సెల్ ఫోన్ లో చూపించారు. అది రక్తపింజర” (Russels Viper). భారతదేశంలో ఉన్న 5 రకాల విషపు పాముల్లో ఇది ఒకటి. (త్రాచు పాము, కట్ల పాము, Saw scaled Viper, Hump Nosed pit viper మిగిలిన నాలుగు) మన ప్రాంతంలో రక్తపింజర, త్రాచుపాము, కట్లపాము మాత్రమే ఉంటాయి.

            ఈ వ్యక్తిని పరీక్ష చేసి Observation కోసం ఆసుపత్రిలో అడ్మిట్ చేశాం. విషపు లక్షణాలు ఏమన్నా వస్తాయేమోనని రాత్రి 7.30 వరకు పరిశీలించాము. అవసరమైన పరీక్షలన్నీ చేశాము. కరిచిన సమయం నుండి 12 గంటల తర్వాత కూడా కరిచిన చోట వాపు, నొప్పి, చంకలో బిళ్ళ కట్టడం, రక్తం గడ్డకట్టడంలో తేడావంటి ఏ రకమైన విషపు లక్షణాలు లేకపోవడంతో రాత్రి 8 గంటలకు ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ చేశాము.

విషపు పాము కరిచినా ఎందుకు ఈ వ్యక్తికి ప్రమాదం కాలేదు?

30 నుంచి 50 శాతం విషపు పాముల కాటులలో విషం ఎక్కదు. అంటే పాము కోరలు చర్మంలో దిగినా అవి ముళ్లు గుచ్చుకున్నట్లే లెక్క. దీన్నే Dry Bite అంటారు.

Dry Bite లకు Anti Snake Venom ఇవ్వనవసరం లేదు.

@అందుకే ఈ కేసులో Anti Snake Venom ఇవ్వలేదు.

ఈ వ్యక్తి నాటువైద్యం చేయించుకున్నా, మంత్రం వేయించుకున్నా, అసలు ఆసుపత్రికి రాకపోయినా బ్రతికేవాడే.

- 26.07.2024