HEAL సంస్థ గురించి…. February 26, 2018.... (13-Jul-2020)
నిన్న ఉదయం HEAL స్కూల్ నుండి 46 మంది విద్యార్థులు వచ్చి స్వచ్ఛ చల్లపల్లి ఉదయం స్వచ్ఛంద సేవలో పాల్గొని చక్కగా పనిచెయ్యటం చూసి స్వచ్ఛ చల్లపల్లి కార్యకర్తలందరూ ఎంతో సంతోషపడ్డారు.
ఆగిరిపల్లి దగ్గరలో తోటపల్లిలో ఉన్న HEAL సంస్థ విద్యార్థులు అంత దూరం నుంచి చల్లపల్లి రావడానికి ముఖ్య కారణం స్వచ్ఛ సుందర చల్లపల్లి కార్యకర్తలు తమ శ్రమతో ఊరిని అభివృద్ధి చేసిన వైనమే!
HEAL అంటే Health and Education for all. గుంటూరు మెడికల్ కాలేజీ లో నాకు నాలుగైదు సంవత్సరాలు సీనియర్ అయిన డా. కోనేరు సత్య ప్రసాద్ గారు స్థాపించిన సంస్థ ఇది. తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లలు సంఘ వ్యతిరేక శక్తులు అవకుండా వారికి ప్రేమను పంచి సానుకూల దృక్పధాన్ని (Positive attitude) అలవాటు చేయడం, చదువు చెప్పించి, ఏదో ఒక వృత్తినైపుణ్యాన్ని నేర్పించి పంపించటం వారి ముఖ్య ఉద్దేశ్యం. గుంటూరు దగ్గర ఉన్న చోడవరం స్కూల్ లో 189 మంది, తోటపల్లి స్కూల్ లో 442 మంది విద్యార్థులున్నారు. తెలుగువారే కాకుండా ఢిల్లీ వంటి దూరప్రాంతాల వారు కూడా ఈ స్కూల్ లో చదువుకుంటున్నారు. వసతికి, భోజనానికి, చదువు చెప్పినందుకు దేనికీ ఫీజులుండవు. పూర్తిగా ఉచితం. దీనికి ఎంతోమంది పెద్దలు స్వచ్ఛందంగా తమ సమయాన్ని, డబ్బుని ఇచ్చి సహకరిస్తున్నారు.
కొన్ని సంవత్సరాల క్రితం HEAL సంస్థ కొరకు నిధుల సేకరణ కోసం రాజమండ్రి నుండి కొంతమంది సైకిల్ యాత్రను చేశారు. ఈ యాత్ర చల్లపల్లి మీదుగానే సాగటం మనలో కొంతమందికి గుర్తుండే ఉంటుంది.
గుంటూరులో ఉన్న HEAL సంస్థ నడుపుతున్న స్కూల్ ను గత సంవత్సరం నవంబర్ 25వ తేదీన స్వచ్ఛ చల్లపల్లి కార్యకర్తలందరం చూసి రావడం జరిగింది.
గత డిసెంబర్ 12వ తేదీన నేను, డా. పద్మావతి గారు తోటపల్లిలో ఉన్న స్కూల్ ని సందర్శించడం జరిగింది. అత్యంత విశాలమైన ఆవరణలో విద్యార్థులకు కావలసిన అన్ని వనరులు ఉన్న భవనాలతో, అందమైన తోటలతో చూడ చక్కగా ఉన్నది. పాము కరిస్తే ఏమి చెయ్యాలి? అనే విషయంపై అవగాహనా కార్యక్రమాన్ని నిర్వహించాము. స్కూల్ నిర్వహణను వివరంగా చూసి తృప్తిగా తిరిగి వచ్చాము. నిన్న నేను హైదరాబాద్ లో ఉండటం వలన ఈ విద్యార్థులు చల్లపల్లి వచ్చి చేసిన సేవను చూడలేకపోవడం నా దురదృష్టం.
దురదృష్టవంతులైన పిల్లల కోసం నిస్వార్థంగా ఇంత పెద్ద కృషి చేస్తున్న డా. కోనేరు సత్య ప్రసాద్ గారు, ఈ స్కూల్ నిర్వహణకు స్వచ్చందంగా సహకరిస్తున్న పెద్దలందరూ ఎంతో అభినందనీయులు.
-డా. దాసరి రామకృష్ణ ప్రసాదు
26-02-2018