మంచి తల్లిదండ్రులంటే ఎవరు?....           (29-Jun-2020)


మంచి తల్లిదండ్రులంటే ఎవరు?

 

 

పిచ్చిప్రశ్నలా ఉంది కదా! “తల్లిదండ్రులలో మంచివారు కానివారు కూడా ఉంటారా?” అని ఎదురు ప్రశ్నించాలనిపిస్తోండా? 30 ఏళ్ల క్రిందట ఒక రచయిత ఇలా అన్నాడు. “చెడు తల్లిడంద్రులుంటే ఉండవచ్చు కాని, చెడు పిల్లలు మాత్రం ఎక్కడా ఉండరు”.

 

ఏ తల్లిదండ్రులైనా తమ పిల్లలు తమ కంటే అన్నివిధాల బాగుండాలనే కోరుకుంటారు. అసలు ఈలోకంలో తమ పిల్లల మీద ఎవరికీ ప్రేమ ఉండదు? అయితే ఈ ప్రేమ మోతాదు ఎక్కువై, హద్దులు దాటి ఎక్కడకు దారి తీస్తుందనేదే అసలు సమస్య!

 

మన బిడ్డ సంపూర్ణ ఆరోగ్యంతో నిండు నూరేళ్ళు బ్రతకాలి.

 

తన ఇష్టప్రకారం చదువుకొని, వ్యక్తులను, పరిసరాలను, సమాజాన్ని అర్ధం చేసుకోవాలి.

 

తనకు నచ్చిన వృత్తి చేసుకొంటూ, గౌరవంగా బ్రతికే అవకాశం ఉండాలి.

 

నిజాయితీగా, సంతోషంగా అతని జీవితం గడవాలి.

 

ఇవే తల్లిదండ్రులకు ఉండదగిన సమంజసమైన కోరికలు.

 

ఇంతకు మించి అతిగా ఏమి కోరుకున్నా, అది స్వార్ధమే అవుతుంది. తమ బిడ్డ ఇంజనీరు, డాక్టరు, ఆడిటరు, కలెక్టరు, మంత్రి…. కావాలని ముందే కోరుకొనేకంటే

 

కష్టించి పనిచేసే స్వభావం కలిగి ఉండాలని,
చిత్తశుద్దితొ ప్రవర్తిస్తూ, పదిమందికి సహాయపడే వాడు కావాలని
కుటుంబం పట్ల, సమాజం పట్ల బాధ్యతగా మెలగాలని కోరుకోవడం సమంజసం.

మానవత్వం లేని డాక్టర్లు, ఇంజనీర్లు, కలెక్టర్లు ఎవరిని ఉద్ధరించాలి?

 

ఏదో విధంగా కోటానుకోట్లు గడించి త్వరత్వరగా మేడలు కట్టే పిల్లలను కాక, మంచిమనసు ఉండి పదిమందికీ తలలో నాలుకలా, అందరి కష్ట సుఖాలలో భాగస్థులుగా ఉండే పిల్లలను కోరుకొనే వారు మంచి తల్లిదండ్రులు.

 

ఈ ప్రపంచంలోని 700 కోట్ల మందిలో తమ బిడ్డ వంటి రూపురేఖలతో మరే బిడ్డ ఉండనట్లే, ఇలాంటి మనస్తత్వమే కలిగిన మరొక బిడ్డ ఉండడని గ్రహించి అతని అభిరుచుల ప్రకారం స్వేచ్ఛగా, ఆనందంగా పెరగనిచ్చే వారే మంచి తల్లిదండ్రులు.

 

తమ అత్యాశలను పిల్లలపైన రుద్డక పువ్వు పిందెగా, కాయగా మారినంత సహజంగా పిల్లలను ఎదగనీయడమే మంచి తల్లిదండ్రుల లక్షణం.

 

అలా స్వేచ్చతో, ప్రేమతో, మానవత్వంతో ఎదిగిన పిల్లలు వృద్ధులైన తమ తల్లిదండ్రులనే కాక ఇరుగు పొరుగు వారిని కూడా బాధ్యతతో చూసుకోగలరు.

 

 

తల్లిదండ్రులందరూ “తారే జమీన్ పర్”, “త్రీ ఇడియట్స్” సినిమాలు చూడాలని మనవి.

 

 

డా. దాసరి రామకృష్ణ ప్రసాదు

పద్మావతి హాస్పిటల్

చల్లపల్లి, కృష్ణా జిల్లా.